Pesarapappu Rasam: పెసరపప్పు చారును ఇలా వండితే వేడివేడి అన్నంలో అదిరిపోతుంది
Pesara pappu Rasam: ఎప్పుడూ ఒకేలాంటి రసం లేదా చారు తినే కన్నా కొత్తగా పెసరపప్పు చారును ప్రయత్నించండి. దీనిలో పోషకాలు ఎక్కువ. ఈ చారును చేయడం చాలా సులువు.
Pesara pappu Rasam: ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో భోజనంలో చారు లేదా రసం కచ్చితంగా ఉండాల్సిందే. కొంతమంది రెండు పూటలా రసం లేదా చారుతో భోజనాన్ని ముగిస్తూ ఉంటారు. ఎప్పుడు ఒకేలాంటి రసం తింటే ఎలా? ఓసారి పెసరపప్పు రసం ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉండడంతో పాటు ఎన్నో పోషకాలను శరీరానికి అందిస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఇలా చేయాలో ఒకసారి చూడండి.
పెసరపప్పు చారు రెసిపీకే కావలసిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
కొత్తిమీర - మూడు స్పూన్లు
పచ్చిమిర్చి - రెండు
చింతపండు - నిమ్మకాయ సైజులో
కరివేపాకులు - గుప్పెడు
నూనె - ఒక స్పూన్
టమాటో - రెండు
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - ఒక స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - ఏడు
ఎండుమిర్చి - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడినన్ని
పెసరపప్పు చారు రెసిపీ
1. పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి.
2. మూడు విజిల్స్ వచ్చే దాకా ఉడకబెడితే పెసరపప్పు మెత్తగా ఉడికిపోతుంది.
3. ఆవిరి పోయాక కుక్కర్ మూత తీసి గరిటెతో మెత్తగా కలుపుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఆ కుక్కర్ ను పెట్టి ఉడికించాలి.
5. అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకులు, టమోటో తరుగు వేసి మరగనివ్వాలి.
6. చింతపండును నీటిలో నానబెట్టుకుని ఆ చింతపండు నీటిని కూడా వేయాలి.
7. మీకు రసం ఎంత కావాలనుకుంటున్నారో దానికి తగినట్లు నీళ్లు వేసుకోవాలి.
8. ఈ మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద పావుగంట నుంచి 20 నిమిషాలు ఉడికించాలి.
9. ఇప్పుడు మరొక స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి అందులో నూనె వేయాలి.
10. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.
11. ఈ మొత్తం తాళింపును పెసరపప్పు చారులో వేసుకోవాలి.
12. అంతే ఘుమఘుమలాడే పెసరపప్పు రసం రెడీ అయిపోతుంది.
13. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుంటూ పక్కన వడియాలు, అప్పడాలు పెట్టుకొని తింటే ఆ రుచే వేరు. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగుంటుంది. వాళ్ళు సులువుగా జీర్ణం చేసుకుంటారు. ఆరోగ్యానికి కావలసిన పోషకాలు దీంతో అందుతాయి.
పెసరపప్పులో మనకు శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి నిండి ఉంటాయి. అలాగే ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రెండు మూడు రోజులకు ఒకసారి పెసరపప్పు చారును వండి పెడితే మంచిది.
పెసరపప్పులో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్యాన్సర్, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నియంత్రిస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి రక్తపోటును నియంత్రిస్తాయి. పెసరపప్పులో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి పెసరపప్పు చారును వారానికి కనీసం రెండు మూడు సార్లు పండుకోవడం అన్ని విధాలా మంచిది.
టాపిక్