మిరియాల రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని తినేందుకు ఇష్టపడతారు. వేసవిలో మిరియాల రసం తాగడం వల్ల దగ్గు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి శరీరానికి వస్తుంది. కేవలం ఐదు నిమిషాల్లో మిరియాల రసం ఎలా చేయాలో చెప్పాము. ఈ పద్ధతిలో చేస్తే టేస్టీగా ఉంటుంది. పైగా తక్కువ సమయంలోనే రెడీ అయిపోతుంది.
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
ఆవాలు - అర స్పూను
చింతపండు - నిమ్మకాయ సైజులో
వేడి నీళ్లు - ఒక కప్పు
మిరియాలు - ఒకటిన్నర స్పూను
జీలకర్ర - అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు - 10
ఎండుమిర్చి - రెండు
నూనె - ఒక స్పూను
1. మిరియాల రసం ఐదు నిమిషాల్లోనే చేసేందుకు అన్నిటినీ రెడీగా పెట్టుకోవాలి.
2. స్టవ్ మీద గిన్నె పెట్టిన తర్వాత అయిదు నిమిషాల్లోనే మిరియాల రసం రెడీ అయిపోతుంది.
3. దీనికి ముందుగా మీరు చింతపండును వేడి నీళ్లల్లో వేసి నానబెట్టుకోవాలి.
4. అలాగే మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర రోట్లో వేసి దంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద మిరియాల రసం వండేందుకు గిన్నె పెట్టాలి.
6. అందులో ఒక స్పూను నూనె వేసి ఆవాలను వేసి చిటపటలాడించాలి.
7. తర్వాత దంచి పెట్టుకున్న మిరియాల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
8. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
9. మొత్తం మిశ్రమం వేగాక అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేయాలి.
10. మీకు మిరియాల రసం ఎంత పరిమాణంలో కావాలో అంత పరిమాణంలో నీళ్లు వేసుకోవాలి.
11. ఈ మంటను హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి.
12. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే పసుపును కూడా వేయాలి.
13. పైన కొత్తిమీర తరుగున చల్లి పెద్ద మంట మీద మూడు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
14. అంతే మిరియాల రసం రెడీ అయిపోయినట్టే.
మిరియాలలో ఉండే పోషకాలు అన్నీ ఈ రసంలోనూ ఉంటాయి. మిరియాల రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులను తట్టుకునే సామర్థ్యం మన రోగనిరోధక శక్తికి వస్తుంది. కాబట్టి మిరియాల రసాన్ని అప్పుడప్పుడు ఇంటిళ్లపాది తినాల్సిన అవసరం ఉంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే మిరియాల రసం రెడీ అయిపోతుంది. కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
సంబంధిత కథనం