Pepper Idli Fry: ఒకసారి పెప్పర్ ఇడ్లీ ఫ్రై చేసుకుని చూడండి, మీకు ఈ బ్రేక్‌ఫాస్ట్ తెగ నచ్చుతుంది
Pepper Idli Fry: బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీయే తినమని ఎక్కువగా సిఫారసు చేస్తారు వైద్యులు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒకసారి ఈ ఇడ్లీలతో ‘పెప్పర్ ఇడ్లీ వేపుడు’ ప్రయత్నించండి. దీని రెసిపీ చాలా సులువు.
Pepper Idli Fry: బ్రేక్ ఫాస్ట్ లో సాధారణంగా ఎక్కువ మంది తీసుకునేది ఇడ్లీలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఇడ్లీలను తినడం శ్రేయస్కరమే. దీంతో సాంబార్, చట్నీ వంటివి తింటే రుచిగా ఉంటాయి. ఎక్కువ మంది ఇడ్లీ సాంబార్ ను ఇష్టంగా తింటారు. ఇడ్లీలు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి పెప్పర్ ఇడ్లీ ఫ్రై ప్రయత్నించి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు.
పెప్పర్ ఇడ్లీ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఇడ్లీలు - నాలుగు
నెయ్యి - ఒక స్పూను
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
అల్లం తరుగు - అర స్పూను
వెల్లుల్లి తరుగు - అర స్పూను
ఉప్పు - చిటికెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూన్
మిరియాల పొడి - అర స్పూను
పెప్పర్ ఇడ్లీ ఫ్రై రెసిపీ
1. పెప్పర్ ఇడ్లీ ఫ్రై రెసిపీ కోసం ముందుగానే ఇడ్లీలను వండి పక్కన పెట్టుకోవాలి.
2. కొందరు బటన్ ఇడ్లీలను కూడా చేసుకుంటారు. బటన్ ఇడ్లీ కాకుండా పెద్ద ఇడ్లీలు పెట్టుకున్న వారు... ఒక్కో ఇడ్లీని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
4. ఆ నెయ్యిలో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి.
5. అలాగే వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి కూడా వేయించుకోవాలి.
6. అలాగే మిరియాల పొడి, చిటికెడు ఉప్పు వేసి వేయించాలి.
7. ఆ తర్వాత ఇడ్లీ ముక్కలను వేసి కలపాలి.
8. స్టవ్ కట్టేసి కొత్తిమీర చల్లుకోవాలి. అలాగే నిమ్మ రసాన్ని కూడా చల్లుకోవాలి. ఒకసారి ఇడ్లీలను మళ్ళీ కలపాలి.
9. అంతే టేస్టీ పెప్పర్ ఇడ్లీ ఫ్రై రెడీ అయినట్టే.
10. దీన్ని తినేకొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది.
ఇందులో వాడిన మిరియాల పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఇడ్లీలకు చట్నీ, సాంబార్ లేకపోయినా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. ఇందులో మనం ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే వేసాము. కాబట్టి ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.