డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీలను ఇలా కాపాడుకోవాలి, లేకుంటే డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చేస్తుంది-people with diabetes should protect their kidneys like this otherwise diabetic nephropathy will occur ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీలను ఇలా కాపాడుకోవాలి, లేకుంటే డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చేస్తుంది

డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీలను ఇలా కాపాడుకోవాలి, లేకుంటే డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చేస్తుంది

Haritha Chappa HT Telugu

డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. డయాబెటిస్ వల్ల మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అదే డయాబెటిక్ నెప్రోపతి. ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తగా ఉండాలి.

డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏమిటి? (Pixabay)

శరీరంలో డయాబెటిస్ చేరితే ఎన్నో రకాల రోగాలు దానితో పాటే వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకుంటే... డయాబెటిస్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కలగకుండా జాగ్రత్త పడవచ్చు.

ఎప్పుడైతే డయాబెటిస్ వచ్చిందో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండకపోతే ఆ పరిస్థితి మూత్రపిండాల వ్యాధి డయాబెటిక్ నెప్రోపతి వచ్చేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

జీవనశైలి మార్పుల ద్వారా అవసరమైన మందులు వాడడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. అందుకోసం కిడ్నీ ఫ్రెండ్లీ డైట్ ని కూడా తీసుకోవాల్సి వస్తుంది.

డయాబెటిక్ నెఫ్రోపతి అంటే

డయాబెటిక్ నెప్రోపతిని డయాబెటిక్ కిడ్నీ వ్యాధి అని కూడా అంటారు. కిడ్నీలు దెబ్బతీసేలా మధుమేహం పెరగడమే దీనికి కారణం. డయాబెటిక్ నెఫ్రోపతి వస్తే మూత్రపిండాలు క్రమంగా రక్తం నుండి వ్యర్ధాలను, అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీనివల్ల శరీరంలో విషాలు, ద్రవం పేరుకుపోతుంది.

అదుపులో లేని మధుమేహం నేరుగా రక్తం నుండి వ్యర్ధాలను ఫిల్టర్ చేసే మూత్రపిండాలలోని చిన్న రక్తనాళాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాలక్రమైణా ఈ రక్తనాళాలు సమర్ధవంతంగా రక్తాన్ని ఫిల్టర్ చేయలేదు. ఇదే డయాబెటిక్ నెఫ్రోపతికి కారణమవుతుంది.

మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే అధిక ద్రవం చేతులు, కాళ్లు, చీలమండలలో చేరిపోయి వాచినట్టు కనిపిస్తుంది. మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాంటప్పుడు డయాలసిస్ చేయాల్సి రావచ్చు. లేదా మూత్రపిండాల మార్పిడి కూడా అవసరం కావచ్చు. డయాబెటిక్ నెఫ్రోపతి గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి ఇతర సమస్యలను కూడా పెంచేస్తుంది.

డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు

డయాబెటిక్ నెఫ్రోపతి దశల వారీగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించవు. కానీ పరిస్థితి తీవ్రంగా మారుతున్న కొద్దీ తీవ్రమైన అలసట, కాళ్లు, చేతులలో వాపు, దురద పెట్టడం, మూత్ర విసర్జన చేయడానికి ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు డయాబెటిక్ నెప్రోపతి రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

రాకుండా ఏం తినాలి?

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ శారీరక శ్రమ చేయాలి. అంటే వ్యాయామం చేయడం అవసరం. రన్నింగ్, వాకింగ్ వంటివి చేసినా చాలు రక్తంలో చక్కెర అదుపులో ఉండేలా, రక్తపోటు పెరగకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. అలాగే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వెంటనే వదిలేయాలి.

డయాబెటిక్ నెఫ్రోపతిని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. దీనివల్ల మూత్రపిండాల పనితీరు పూర్తిగా దెబ్బ తినకముందే చికిత్స తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ ఇందులో చేయడం వల్ల మీరు మూత్రపిండాల ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. డయాబెటిస్ అదుపులో లేనట్టు అనిపిస్తే మీరు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి.

ఆరోగ్యకరమైన మూత్రపిండాల పనితీన కోసం మీరు తగినంత నీటిని తాగడం చాలా ముఖ్యం. అలాగే ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలి. ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. అలాగే రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.