Almond Mistakes: ఈ ఐదు రకాల వ్యాధులతో బాధపడుతున్నవారు బాదం పప్పులను తినకపోవడమే మంచిది!
Almond Mistakes: బాదం తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అయితే కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారు వీటిని తినడం వల్ల ప్రయోజనం కన్నా ఎక్కువ నష్టమే కలుగుతుందట. ముఖ్యంగా ఈ ఐదు రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు బాదం పప్పులను దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బాదం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో మనందరికీ తెలుసు. రోజుకు గుప్పెడు బాదం పప్పులను నమిలి తినే అలవాటు చిన్నప్పటి నుంచే అలవరుస్తూ వస్తున్నాం. బాదంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అందుకే డైలీ డైట్లో బాదం పప్పులను క్రమం తప్పకుండా చేర్చాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అయితే అన్ని విధాలుగా ప్రయోజనకరంగా కనిపించే బాదం కొంతమందికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
కొన్ని రకాల వ్యాధులు, సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు బాదం పప్పులను తినడం వల్ల ప్రయోజనం కన్నా ఎక్కువ నష్టమే కలుగుతుందట. బాదం తినడం వల్ల రోగి మరింత ఇబ్బందిని ఎదుర్కొనే కొన్ని పరిస్థితులు వస్తాయి. ఎలాంటి సమస్యలు ఉన్నవారు బాదం పప్పు తినకూడదో తెలుసుకుందాం రండి.
మైగ్రేన్:
మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు బాదం తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ కాలంగా తీవ్రమైన మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు బాదం పప్పులను తమ ఆహారంలో చేర్చుకోకూడదు. బాదంలో విటమిన్- ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది తలనొప్పి, మైకము, వాంతులు, అలసటకు కారణమవుతుంది. ఈ పరిస్థితిలో మైగ్రేన్ సమస్య మరింత పెరుగుతుంది.
కిడ్నీలో రాళ్లు:
కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి బాదం వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువగా ఉంటుందట. బాదంపప్పుల్లో చాలా ఎక్కువగా ఉండే ఆక్సలేట్ అనే సమ్మేళనం కిడ్నీలకు ప్రమాదం కలిగిస్తుంది. మూత్రపిండాల్లోకి చేరిన కాల్షియంను రాళ్లుగా మార్చుతుంది. ఇప్పటికే కిడ్నీ రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు, రోజూ బాదం తినడం వల్ల రాయి పరిమాణాన్ని చేతులారా పెంచుకున్న వాళ్లవుతారు. ఇటువంటి పరిస్థితిలో, మీ వైద్యుడి సలహా లేకుండా బాదం తినకపోవడమే మంచిది.
రక్తపోటు:
రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు బాదం పప్పులను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా రోజువారీ అలవాటులో చేర్చుకోకూడదు. నిజానికి బాదం పప్పులో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్దీకరించే మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ రక్తపోటు మందులతో బాదం తింటుంటే, అది మీకు కచ్చితంగా హానికరమే.
ఎసిడిటీ, మలబద్దకం:
గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఉంటే బాదం పప్పులను కూడా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. మీ జీర్ణక్రియ బలహీనంగా ఉంటే, బాదంపప్పు తిని జీర్ణించుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు మరింత పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, మీ వైద్యుడి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే బాదంపప్పులను మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
అధిక బరువు:
ఎక్కువ బరువుతో ఇబ్బంది పడుతున్న వారు కూడా బాదం పప్పులను డైట్ లో చేర్చుకునే ముందు ఆలోచించాలి. నిజానికి బాదం పప్పులో కొవ్వు, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, బాదంపప్పులను ప్రతిరోజూ కొన్నింటిని మాత్రమే తీసుకోవడం వల్ల మీ కొవ్వును వేగంగా పెరగకుండా నియంత్రించుకోగలరు. ఒకవేళ ఊబకాయంతో పోరాడుతుంటే ఆ సమస్య నుంచి బయటపడేందుకు బాదంపప్పును తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
సంబంధిత కథనం