Relationship: సోలో లైఫే సో బెటర్ అనుకుంటున్నారా? సింగిల్స్ గురించి అనూహ్యమైన విషయాలు వెల్లడించిన అధ్యయనం
Relationship: రిలేషన్‍షిప్‍లో ఉన్న వారు, సింగిల్‍గా ఉన్న వారి స్థితిని పోలుస్తూ ఓ సంస్థ అధ్యయనం చేసింది. సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఈ స్టడీలో ఏం తేలిందంటే..
రిలేషన్‍షిప్‍లో లేకుండా సింగిల్‍గా ఉంటే స్వేచ్ఛగా ఉండొచ్చని చాలా మంది అనుకుంటారు. సింగిల్‍గానే ముందుకు సాగుతుంటారు. మరికొందరు అవకాశం లేక సింగిల్‍గా ఉంటారు. ఎలా అయినా రిలేషన్‍షిప్‍లో ఉన్న వారి కంటే సింగిల్సే సంతోషంగా, స్వతంత్య్రంగా ఉంటారని అందరూ అనుకుంటారు. ఇష్టమైన పని చేస్తూ ఆనందంగా ఉంటారని భావిస్తారు. అయితే, తాజాగా ఓ అధ్యయనం ఇది నిజం కాదని చెప్పింది.
అధ్యయనం ఇలా..
ఎవల్యూషనరీ సైకాలజీ సైన్స్‌లో ఈ అధ్యయనం పబ్లిష్ అయింది. జీవితంలో వివిధ రిలేషన్‍షిప్ స్టేటస్‍లో ఉన్న వారి భావోద్వేగ, మానసిక ఆరోగ్యం ఎలా ఉందనే విషయాలపై ఈ స్టడీ జరిగింది. 12 దేశాలకు చెందిన విభిన్నమైన సంస్కృతులకు చెందిన 6,338 మంది ఈ అధ్యయనంలో భాగమయ్యారు.
పెళ్లి అయిన వారిని, ప్రేమలో ఉన్న వారిని రిలేషన్‍షిప్‍లో ఉన్నట్టు అధ్యయనం చేసే వారు తీసుకున్నారు. సింగిల్స్‌ను మూడు విభాగాలుగా విభజించారు. కావాలని సింగిల్‍గా ఉన్న వారు, అవకాశం లేక సింగిల్‍గా మిగిలిన వారు, రిలేషన్ తర్వాత సింగిల్ ఇలా మూడు విభాగాలు చేశారు. ఇక రిలేషన్‍షిప్‍లో ఉన్న వారు, సింగిల్‍గా ఉన్న వారి మధ్య భావోద్వేగ, మానసిక ఆరోగ్యం, జీవితంలో సంతృప్తి, సంతోషం, ఆశావాద దృక్పథాలు ఎలా ఉన్నాయో సర్వే ద్వారా తెలుసుకొని, విశ్లేషించారు.
రిలేషన్‍షిప్‍లో ఉన్న వారే ఆనందంగా..
మూడు కేటగిరీల సింగిల్స్ కంటే రిలేషన్‍షిప్‍లో ఉన్న వారే జీవితంలో ఎక్కువ సంతోషంతో ఉన్నారని ఈ సర్వేలో వచ్చిన స్పందనలతో వెల్లడైంది. ఒంటరి వ్యక్తుల కంటే రిలేషన్‍లో ఉన్న వారు జీవితంలో ఎక్కువ సంతృప్తితో, అధికమైన పాజిటివ్ ఎమోషన్లను కలిగి ఉన్నారని తేలింది. మానసిక విషయాల పరంగా బంధంలో ఉన్న వారు ఎక్కువ స్కోర్ చేశారు. సింగిల్స్‌తో పోలిస్తే రిలేషన్‍షిప్‍లో ఉన్న వారు అధిక సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారని ఈ అధ్యయనం తేల్చింది. ఎమోషనల్‍గా, మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే క్వాలిటీ, ఆరోగ్యకరమైన రిలేషన్‍షిప్ ఉండాలని ఈ స్టడీ పేర్కొంది.
సింగిల్స్‌లో ఇలా..
మొత్తంగా చూసుకుంటే రిలేషన్‍షిప్‍లో ఉన్న వారి కంటే సింగిల్స్ తక్కువ సంతోషంతో ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. అయితే, సింగిల్స్‌లో మూడు విభాగాల్లో ఎలా ఉన్నారో కూడా ఈ స్టడీ వెల్లడించింది. కావాలనే సింగిల్‍గా ఉంటున్న వారు మిగిలిన ఒంటరి వారితో పోలిస్తే కాస్త ఎక్కువ హ్యాపీగా ఉన్నారని తెలిపింది. అయినా రిలేషన్‍షిప్‍లో ఉన్న వారితో పోలిస్తే ఆనందం తక్కువేనని పేర్కొంది. ఇక, ఎవరూ దొరకక సింగిల్‍గా ఉన్న వారు చాలా అసంతృప్తితో ఉన్నారని ఈ స్టడీ వెల్లడించింది. జీవితంలో లోటు ఉందని వారు భావిస్తున్నారని తెలిపింది. ఇక రిలేషన్ తర్వాత సింగిల్‍గా ఉన్న వారు ఈ విషయంలో కాస్త నయమని వెల్లడించింది. ఆప్షన్ లేక సింగిల్‍గా ఉన్న వారే అసంతృప్తితో, మానసిక బాధతో ఉన్నారని ఈ అధ్యయనం తేల్చింది.
టాపిక్