రోజుకో ఆపిల్ తింటే చాలు వైద్యుడిని కలిసే అవసరం లేదని అంటారు. శరీరంలోని ఎన్నో వ్యాధులను ఆపిల్ దూరం పెడుతుంది. ఆపిల్ తినేటప్పుడు పైన తొక్క తీసి తినేవారి సంఖ్యే ఎక్కువ. ఆపిల్ తొక్కతో తినడం వల్ల ఆ తొక్కపై ఉన్న క్రిమిసంహాకరకాలు వంటివి శరీరంలో చేరే అవకాశం ఉందని భయపడతారు. కానీ ఇలా ఆపిల్ తొక్క తీసి తింటే శరీరానికి అందే ప్రయోజనాలు తక్కువగా అందుతాయి. ఎందుకంటే ఆపిల్ తొక్కలో అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. ఆపిల్ లో ఉండే పోషకాలు కూడా ఆపిల్ తొక్కలో కూడా ఉంటాయి. ఆపిల్ తొక్కలను తినక పోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకోండి.
ఆపిల్స్‌లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా ఈ పండును ప్రతి సీజన్లో ఎక్కువగా తింటారు. కానీ ఆపిల్ పండ్ల పై మైనం, పురుగుమందులు ఉంటాయని వాటివని తినడానికి ఇష్టపడరు. అందుకే చాలా మంది దాని తొక్కను తొలగిస్తారు. నిజానికి ఆపిల్ తొక్కను తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ తొక్కలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఆపిల్ పండ్లను తొక్కతో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సవ్యంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఆపిల్ తొక్కతో తింటే అందులో ఉండే ఫైబర్ డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది ఆకలిని నియంత్రిస్తుంది.
ఆపిల్ తొక్కలో క్వెరెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను, గుండెను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఆపిల్ తొక్కలో ఉండే పాలీఫెనాల్స్… కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్తపోటును తగ్గిస్తాయి. దీనివల్ల గుండెలోని సిరలు మృదువుగా ఉండి వాటిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. దీనివల్ల గుండె జబ్బులు దరిచేరవు.
ఆపిల్ తిన్న కొద్దిసేపటికే మీకు ఆకలిగా అనిపిస్తే అందుకు కారణం ఆపిల్ తొక్క తీసి తినడం. ఆపిల్ తొక్కతో తింటే పొట్ట ఎక్కువసేపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీని వల్ల మీరు తక్కువ కేలరీలు తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదే సమయంలో, ఆపిల్ తొక్కలలో ఉండే పాలీఫెనాల్స్… కొవ్వును గ్రహించడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఆపిల్ తొక్కలో విటమిన్ఎ, విటమిన్ సి, విటమిన్ కె ఉంటాయి. పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం కూడా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది. అందువల్ల, ఆపిల్ తొక్కలతో తినడం వల్ల గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
ఆపిల్ పండ్లను తొక్కతో పాటూ తినడం కొన్నిసార్లు ప్రమాదకరమే. వాటిని శుభ్రపరచుకుని తింటే ఎలాంటి సమస్యలు రావు. వాటిపై చల్లిన పురుగుమందులను తొలగించుకోవాలంటే వాటిని పరిశుభ్రంగా కడగాలి. ఒక పెద్ద పాత్రలో నీళ్లు వేయాలి. అందులో బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి. ఇందుకోసం గోరువెచ్చటి నీళ్లు వాడాలి. అందులో ఆపిల్ పండ్లను వేసి అరగంట పాటూ వదిలేయాలి. చేత్తో ఒకసారి ఆపిల్ పండ్లను కడగాలి. ఇప్పుడు ఆపిల్ తొక్కతో పాటూ తినేందుకు సురక్షితంగా మారినట్టే.
టాపిక్