Palli Masala Rice: పల్లీలతో చేసే కారం రైస్ లేదా మసాలా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. దీని చేయడం చాలా సులువు. మిగిలిపోయిన అన్నంతో దీన్ని పది నిమిషాల్లో చేసుకోవచ్చు. ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీలు ప్రయత్నించండి. దీన్ని లంచ్ లోకి, రాత్రి డిన్నర్లోకి కూడా తినవచ్చు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. స్పైసీ ఫుడ్ ని ఇష్టపడేవారు దీనిలో ఎండు మిరపకాయలు అధికంగా వేసుకుంటే చాలు. దీంతో పాటు ఒక పచ్చి ఉల్లిపాయను తింటే ఆ రుచే వేరు. ఇక పల్లి కారం రైస్ ఎలా చేయాలో తెలుసుకోండ.
వేరుశనగ పలుకులు - గుప్పెడు
మినప్పప్పు - ఒక స్పూను
శనగపప్పు - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
నువ్వులు - ఒక స్పూను
ఎండుమిర్చి - మూడు
కొబ్బరి తురుము - రెండు స్పూన్లు
నూనె - మూడు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
వండిన అన్నం - రెండు కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
ఆవాలు - ఒక స్పూను
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
2. అందులో వేరుశెనగ పలుకులు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
3. చివరిలో కొబ్బరి తురుమును వేసి వేయించి స్టవ్ కట్టేయాలి.
4. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. అంతే పల్లి కారం మసాలా రెడీ అయినట్టే.
5. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.
6. అందులో ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఇప్పుడు కరివేపాకులను వేయాలి.
7. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని, రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి కలుపుకోవాలి.
8. తర్వాత వండిన అన్నాన్ని అందులో వేసి పులిహోర లాగా కలుపుకోవాలి.
9. చిన్న మంట మీద ఇదంతా చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాలు వదిలేయాలి.
10. ఆ తర్వాత దీన్ని తిని చూస్తే రుచి అదిరిపోతుంది. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా వినియోగించుకోవచ్చు. లేదా మిగిలిపోయిన అన్నంతో రాత్రికి డిన్నర్‌గా తినేయవచ్చు. ఏది ఏమైనా పిల్లలకు పెద్దలకు ఇది బాగా నచ్చడం ఖాయం.
పిల్లలకు పెట్టాలనుకుంటే ఎండుమిర్చి వేయకుండా పెట్టండి. కారాన్ని ఇష్టపడేవారు స్పైసీగా కావాలనుకుంటే ఎండుమిర్చిని కొంచెం అధికంగా వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారిగా దీని రుచి చూశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇక స్పైసీగా దీన్ని చేసుకుంటే పక్కన ఒక పచ్చి ఉల్లిపాయని పెట్టుకోండి. మధ్య మధ్యలో దాన్ని తినడం వల్ల ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది.
టాపిక్