Peanut Curry Recipe: కూరగాయలు అయిపోయాయా? వేరుశనగలతో కర్రీ చేసేయండిలా.. రుచి పాటు మెండుగా ప్రోటీన్
Peanut Curry Recipe: ఎలాంటి కూరగాయలు లేకుండా సింపుల్‍గా వేరుశనగలతో కర్రీ చేయవచ్చు. ఇది తినేందుకు చాలా రుచికరంగా ఉంటుంది. త్వరగా తయారవుతుంది. ఇది తింటే శరీరానికి ప్రోటీన్ బాగా అందుతుంది. ఈ కర్రీ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
Peanut Curry Recipe: కూరగాయలు అయిపోయాయా? వేరుశనగలతో కర్రీ చేసేయండిలా.. రుచి పాటు మెండుగా ప్రోటీన్
ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడో.. లేదా ఏదైనా డిఫరెంట్‍గా తినాలనుకున్నప్పుడో ‘వేరుశనగల కర్రీ’ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. సమయం లేక త్వరగా ఏదైనా కూర చేసుకోవాలన్నా ఇది సూటవుతుంది. వేరుశనగల కర్రీ రుచికరంగా ఉంటుంది. ఈ కర్రీలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ కర్రీ ఎలా చేసుకోవాలంటే..
వేరుశనగల కర్రీ చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు
- ఓ కప్పు వేరుశనగలు
- పావు కప్పు వేయించిన వేరుశనగలు (పొడి చేసిపెట్టుకోవాలి)
- రెండు టమాటాలు
- అరకప్పు పెరుగు
- ఓ ఉల్లిపాయ తరుగు
- రెండు పచ్చిమిరపకాయలు
- బిర్యానీ ఆకు, ఓ ముక్క దాల్చిన చెక్క, రెండు యాలకులు, ఓ అనాస పువ్వు, కసూరి మేతి
- ఓ టీస్పూన్ నెయ్యి
- నూనె
- సరిపడా ఉప్పు
- ఓ టీస్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్
- ఓ టీస్పూన్ ధనియాలు, ఓ ఎండు మిర్చి, పసుపు, గరం మసాలా పొడి, మెంతులు
వేరుశనగల కర్రీ చేసుకునే విధానం
- ముందుగా ఓ ప్రెజర్ కుక్కర్‌లో కప్పు వేరుశనగలను వేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు, టమాటాలో వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికేందుకు తగినంత నీరు పోసుకొని.. దాంట్లోనే ఓ స్పూన్ నెయ్యి వేయాలి.
- వేరుశనగలు వేసిన ఆ కుక్కర్‌లోనే దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, ఓ అనాసపువ్వు, కూడా యాడ్ చేయాలి. చివరగా మిరపకాయలు వేసి కక్కుర్ మూత మూసేయాలి.
- రెండు, మూడు విజిళ్లు వేస్తే వేరుశనగలు, అందులో వేసిన పదార్థాలు బాగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మంట ఆర్పేసి.. కుక్కర్ కిందికి దింపుకోవాలి.
- ఆ తర్వాత ఉడికించుకున్న వేరుశనగలు, అందులో వేసిన పదార్థాలు కలిపి బాగా మిక్సీలో ముద్దగా గ్రైండ్ చేసుకోవాలి.
- మరో పాత్రలో నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో ఆవాలు చిట్లిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మాసాలా, ఎండుమిర్చి వేసుకొని బాగా కలపాలి.
- ఆ తర్వాత ఆ పోపులో వెంటనే అరకప్పు పెరుగు వేసి, కాస్త ఉడకనివ్వాలి. కసూతి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వేయించుకొని పొడి చేసుకున్న పావు కప్పు వేరుశనగల పొడిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. అంతా కలిసేలా కలపాలి.
- అదంతా వేగాక.. కుక్కర్‌లో ఉడికించుకొని పేస్ట్‌గా గ్రైండ్ చేసుకున్న వేరుశనగల ముద్దను అందులో వేయాలి. బాగా మిక్స్ చేయాలి. కాస్త ఉడుకు రానివ్వాలి. ఆ తర్వాత మంట ఆర్పేసి.. పాత్ర దించేసుకోవాలి. అంతే ప్రోటీన్లు పుష్కలంగా ఉండే టేస్టీ వేరుశనగల కర్రీ రెడీ.