మనసు ఎప్పుడూ వద్దు అన్న పనిని చేయడానికి ఆరాటపడుతుంది. ఇది పిల్లల విషయంలో అయితే మరీ ఎక్కువ ఉంటుంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు వద్దు అన్ని పనినే చేయడానికి ప్రయత్నిస్తారు. దొరికిపోయినప్పుడు తప్పును కప్పి పుచ్చుకోవడానికి అబద్దాలు చెప్తారు. ఉదాహరణకు చాలా మంది చిన్న పిల్లలు మట్టి తింటారు, అమ్మ వచ్చి అడిగితే లేదు నేను తినలేదు అంటారు. ఇది సాధారణ బాల్య ప్రవర్తన కావచ్చు. కానీ ఇలా అబద్ధం చెప్పడం వారికి అలవాటుగా మారితే మాత్రం తల్లిదండ్రులకు తీవ్రమైన సమస్యగా మారుతంది.
పిల్లలలో అబద్దం చెప్పే అలవాటును సకాలంలో గుర్తించి వారిలో మార్పు తీసుకురాకపోతే పెద్దయ్యాక తల్లిదండ్రులకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది. బాల్యం నుంచే పిల్లల ప్రవర్తన, అలవాట్ల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
చిన్నప్పటి నుండి పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రీగా మాట్లాడాలి. వారికి ఒక కంఫర్టబుల్ సంభాషణను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా వారు వారి ప్రతి సమస్యను మీతో పంచుకోగలుతారు. ఎటువంటి భయం లేకుండా మీతో అన్నీ నిజాలు చెబుతారు.
పిల్లల మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని వారు ఒక్కసారికే వినిపించుకోవాలనీ, ఒక్కసారికే అర్థం చేసుకోవాలని ఏం లేదు. బాల్యం నుండి కౌమారదశ వరకు పిల్లలు తమ పరిసరాల నుండి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అనుభూతిని పొందుతారు, ఇది వారిని ఆసక్తిగా, ఉత్సాహంగా ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఓపికతో పనిచేయాలి. మీ పిల్లవాడు చెప్పే విషయాలనూ, చేసే పనులనూ వెంటనే నిరాకరించకండి, వారి మీద గట్టిగా అరవకండి. వారి మాటలను ప్రశాంతంగా విని వారితో ఏకీభవించకపోయినా మీ అభిప్రాయాన్ని వారికి నెమ్మదిగా సౌకర్యవంతంగా వివరించడానికి ప్రయత్నించండి.
పిల్లలు తరచుగా వారి తల్లిదండ్రులను, వారి చుట్టు పక్కలుండే ఇతర పెద్దలను అనుకరిస్తారు. ఇది కాలక్రమేణా వారి అలవాటులో భాగం అవుతుంది. కాబట్టి పిల్లల ముందు మీరు రోల్ మోడల్, పాజిటివ్ పర్సనాలిటీని మాత్రమే చూపించండి. మీరు నిజాలు మాత్రమే చెప్పడం అలవాటు చేసుకోండి. వారు కూడా అదే నేర్చుకుంటారు.
ప్రతి పిల్లవాడు మరొకరి కంటే భిన్నంగా ఉంటాడు. కానీ తల్లిదండ్రులు పిల్లలను సమాజంలోని ఉత్తమమైన వారిని చూపించి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెబుతుంటారు. ఈ దిశగా వారిని ఒత్తిడికి గురి చేస్తారు. తమ అంచనాలను అందుకోవాలని పిల్లలను ఇబ్బంది పెడుతుంటారు. ఈ పరిస్థితిని నుంచి బయటపడటానికి పిల్లలు అబద్ధం చెప్పడం ప్రారంభిస్తారు. అలా కాకుండా పిల్లల ఇష్టాలకు విలువనివ్వడం అలవాటు చేసుకోండి. వారిని ఒత్తిడి చేసి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకండి.
పిల్లలలో అబద్ధం చెప్పే అలవాటును మానిపించాలంటే మీరు చేయాల్సిన ముఖ్యమైన పనేంటంటే.. వారు అబద్ధాలు చెప్పినప్పుడు కోపగించుకోకండి. బదులుగా వారు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో నెమ్మదిగా, ఓపికగా అడిగి తెలుసుకోండి. నిజం చెప్పడం అలవాటు చేసుకునే వరకూ వారిని ఓపిగా, ప్రేమగా, మద్ధతునివ్వడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే క్రమంగా వారు అబద్ధం చెప్పే అలవాటును విడిచిపెడతారు.
సంబంధిత కథనం