Parenting tips: మీ పిల్లాడు పెద్దయ్యాక జెంటిల్ మెన్‌లా ఉండాలంటే... అతడిని ఇలా పెంచండి
Parenting tips: మీ అబ్బాయి పెద్దయ్యాక జెంటిల్మెన్ లా ఉండాలని కోరుకుంటున్నారా దీనికి చిన్నప్పటి నుంచే మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి
Parenting tips: ఎవరైనా తమ పిల్లలు పెద్దయ్యాక జెంటిల్ మెన్‌లా ఉండాలని కోరుకుంటారు. జెంటిల్ మెన్ అంటే సానుకూలంగా ఉంటారు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తారు. జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఇతరులను ప్రోత్సహిస్తూ తాను కూడా ఎదుగుతారు. ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు చేయరు. తమ చుట్టూ ఉన్నవారికి మర్యాదను, విలువను ఇస్తారు. తాము కూడా ఎంతో గౌరవాన్ని పొందుతారు. తమ పిల్లలు ఇలానే ఎదగాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారు. పెద్దయ్యాక మీ పిల్లాడు జెంటిల్మెన్ గా మారాలి అంటే చిన్నప్పుడే మీరు కొన్ని పనులు చేయాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరే రోల్ మోడల్
పిల్లలకు తల్లితండ్రులే రోల్ మోడల్. మీరు ఇంట్లో ఎలా ఉంటారో వారు కూడా అలానే ఉంటారు. మీరు ఇప్పుడు చేసే పనులే పెద్దయ్యాక మీ పిల్లలు చేస్తారు. కాబట్టి మీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో... మీరు వారి ముందు అలానే ఉండండి. దయ, మర్యాద, గౌరవాన్ని అందరి పట్ల చూపించండి. ప్రతి ఒక్కరి పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించండి. మర్యాదపూర్వకమైన భాషను ఉపయోగించండి. ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. పెద్దయ్యాక వాటిని ఫాలో అవుతారు.
వయసు, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకునేలా చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయండి. పేద, ధనిక వంటి అభిప్రాయాలను వారిలో నాటకండి. మీరు కూడా వారి ముందు మాట్లాడకండి. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వినడం అనేది పిల్లలకు నేర్పండి. ముందుగా మీరు ఆ పని చేస్తేనే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరిని గౌరవంగా దయతో చూడాలని చెప్పండి.
మంచి మర్యాద ఎంత ముఖ్యమో వారికి నేర్పండి. ప్రతి పనిలోనూ క్లీన్ గా ఉండాలని, ఇతరులకు మర్యాద ఇవ్వాలని, సమయపాలన పాటించాలని చెప్పండి. ఆ పనులు మీరు కూడా చేస్తూ ఉండండి. ఎవరైనా రాగానే నవ్వుతూ పలకరించడం, సాగనంపినప్పుడు నవ్వుతూ చెప్పడం అనేది పిల్లలకు నేర్పండి.
పిల్లలు చేత పనిచేయించ డానికి ఇష్టపడరు తల్లిదండ్రులే. అదే ప్రేమ అనుకుంటారు. మీ ప్రేమ వల్ల వారిని చేతకానివారుగా మార్చకండి. మీ పిల్లల వయసుకు తగిన పనులను చెప్పండి. ఇంట్లో బాధ్యతాయుతంగా ఉన్న పిల్లలు పెద్దయ్యాక కూడా అదే విధంగా ఉంటారు. వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం, ఇంట్లో వస్తువులు, వారి పుస్తకాలు సర్దడం, అమ్మానాన్నలకు సహాయపడడం అనేవి వారికి నేర్పండి. ఇది వారికి జీవిత నైపుణ్యాలను నేర్పిస్తుంది. పెద్దయ్యాక కూడా ఇతరులకు సహాయపడే గుణాన్ని పెంపొందించేలా చేస్తుంది.
పిల్లలను భావోద్వేగాలపరంగా బలంగా మార్చండి. వారి ముందే ఏడవడం, దుర్బలంగా మాట్లాడడం, తమ బలహీనులమని చెప్పడం చేయకండి. ఇది వారిలోనూ తామేమీ చేయలేమనే భావాన్ని పెంచుతుంది. వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదే.
జీవితంలో నిజాయితీ ఎంత ముఖ్యమో వారికి చెప్పండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఇతరులను కష్టపెట్టకూడదని వివరించండి. ఈ లక్షణాలన్నీ ఉన్న పిల్లాడు పెద్దయ్యాక కచ్చితంగా జెంటిల్ మెన్‌లా జీవిస్తాడు. అమ్మానాన్నలకు మంచి పేరు తెస్తాడు.
టాపిక్