Parenting Tips: చలికాలంలో మీ పిల్లల ఆరోగ్యం కోసం ఈ ఐదు పనులను చేస్తున్నారా..? లేదా?
Parenting Tips: చిన్నపిల్లలు ఉన్నవారికి చలికాలం చాలా టఫ్. ఈ సమయంలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచీ పదేళ్ల పిల్లల వరకూ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో వచ్చే అనేక సమస్యల నుంచి బయటపడాలంటే పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రండి తెలుసుకుందాం.
ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్లకు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారికి చలికాలం చాలా టఫ్ టైం. పిల్లలతో బయటకు వెళ్లాలన్నా, పిల్లలకు బట్టలు వేయాలన్నా, పిల్లల కోసం తినేవి కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. ఎందుకంటే వాతావరణం ఎఫెక్ట్ అలా ఉంటుంది మరి. తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే వాళ్లు సేఫ్ గా, ఆరోగ్యంగా ఉండగలరు. వారిని పెంచే క్రమంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సరైనవేనా, ఇంకా వారి కోసం ఏమైనా మిస్ అవుతున్నారా చూసేద్దామా..
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:
వెచ్చగా ఉంచండి
శీతాకాలంలో శరీరం నిండా కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. అలా చేసే సమయంలో మీ శిశువు వెచ్చగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అదనపు వెచ్చదనం సమకూరేందుకు మృదువైన, శ్వాసకు ఇబ్బంది కలిగించని స్వెట్టర్లు వాడండి. అంతేకాకుండా కాలికి సాక్సులు, తలకు టోపీ పెట్టడం మర్చిపోకండి. వారి మెడ, వీపు భాగంలో ఉష్ణోగ్రతను బట్టి వారికి వెచ్చగా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఇది మొదటిది.
చర్మం పొడిబారకుండా చూసుకోవాలి
శీతాకాలం గాలి కాస్త చల్లగా ఉంటుంది. ఇది చర్మంపై పొరపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా అది పొడిగా, పగుళ్లు వచ్చినట్లుగా మారుతుంది. ఈ సమస్య రాకుండా ఉండేందుకు చిన్నారులను హైడ్రేటెడ్ గా ఉంచేందుకు ప్రయత్నించండి. మృదువైన, సువాసన లేని, రసాయన రహిత మాయిశ్చరైజర్ రాయడం ద్వారా వారి చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన మాయిశ్చరైజర్లు వాడటం బెటర్. స్నానం చేయించే సమయంలో మరీ ఎక్కువ వేడి నీటిని వాడకండి. గోరువెచ్చని నీటిని వాడితే సరిపోతుంది.
శ్వాస విధానాన్ని పర్యవేక్షించండి
శీతాకాలంలో పిల్లలకు దగ్గులు, జలుబు వంటి శ్వాస ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలను ముందుగానే పసిగట్టడానికి వారి శ్వాస తీరును గమనిస్తూ ఉండండి. శ్వాసకోశ సమస్యలు తీవ్రతరం కాకముందే స్పందించడం వల్ల చిన్నారుల పరిస్థితిని ముందుగానే కాపాడుకోవచ్చు. శీతాకాలంలో శిశువును జాగ్రత్తగా చూసుకోవడంలో ఇది రెండో ఉత్తమ మార్గం.
మసాజ్ చేస్తూ ఉండండి
కొబ్బరి నూనె వంటి సున్నితమైన నూనెలు వాడుతూ క్రమం తప్పకుండా మీ బిడ్డకు మసాజ్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల వారిలో రక్తప్రసరణ మెరుగై చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాకుండా తగిన విశ్రాంతిని కూడా అందిస్తుంది. మసాజ్ తరచూ చేస్తూ ఉండటం వల్ల రాత్రుళ్లు బాగా నిద్రపోగలుగతారు. మసాజ్ చేసేటప్పుడు పిల్లలకు ఎక్కువ ఒత్తిడి కలిగించకూడదని గుర్తుంచుకోండి.
ఓవర్ హీట్ వద్దు
చిన్నారులను వెచ్చగా ఉంచాలనే తాపత్రయంలో పొరబాటున వారికి ఎక్కువ వేడి కలిగేలా చేయకండి. అలా చేయడం వల్ల కొందరు శిశువుల్లో మరణాలు కూడా సంభవించిన పరిస్థితులు ఉన్నాయి. దానికి బదులుగా వారిని ఆరుబయట తిప్పడం ద్వారా వేడిగా ఉంటారు. చిన్నారులు, శిశువులపై వేడిగా ఉంచేందుకు బరువైన దుప్పట్లు వేయకండి. వీటి ఫలితంగా వారు ప్రశాంతంగా నిద్రపోకపోగా, కొన్నిసార్లు శ్వాస సమస్యలు కూడా కలగొచ్చు.