Paneer Burfi: సాయంత్రం స్నాక్‌గా పనీర్ బర్ఫీ... గంటలో దీన్ని వండేయొచ్చు
Paneer Burfi: సాయంత్రం స్నాక్ గా ఏం తినాలా? అని ఆలోచిస్తున్నారా... ప్రోటీన్ నిండిన పనీర్ బర్ఫీ ట్రై చేయండి. రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
Paneer Burfi: పనీర్‌తో చేసిన వంటకాలు శాఖాహారులకు ఎంతో ఇష్టం. ఎందుకంటే పనీర్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వారు ప్రోటీన్ కోసం పనీర్‌ను తింటూ ఉంటారు. కేవలం శాఖాహారులే కాదు మాంసాహారులు కూడా పనీర్ తినాల్సిన అవసరం ఉంది. పనీర్ కేవలం కూర గానో, బిర్యానీ గానో మాత్రమే కాదు స్వీట్ గా కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్ బర్ఫీ ఒక్కసారి చేసి చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. వీటిని చేయడం కూడా చాలా సులువు.
పనీర్ బర్ఫీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
తురిమిన పనీర్ - అరకిలో
కండెన్స్‌డ్ మిల్క్ - పావు కిలో
పాల పొడి - అరకప్పు
క్రీమ్ పాలు - అరకప్పు
యాలకుల పొడి - పావు స్పూను
చక్కెర - పావు కప్పు
పనీర్ బర్ఫీ రెసిపీ
1. స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు వేయాలి.
2. చిన్న మంట మీద ఉంచి వాటిని మరిగించాలి.
3. అవి పూర్తిగా మరిగాక అందులో తురిమిన పనీర్ ను వేసి బాగా కలుపుతూ ఉండాలి.
4. కొన్ని నిమిషాలకు అది చిక్కబడుతుంది. ఇప్పుడు కండెన్స్‌డ్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇది బాగా కలిసాక పాల పొడి, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముద్దలు కట్టకుండా చూసుకోవాలి.
6. దీన్ని అలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా కళాయి నుంచి వేరుగా వస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్టవ్ కట్టేయాలి.
7. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని అడుగున నెయ్యి లేదా బటర్ రాసుకోవాలి.
8. దానిపై ఈ మిశ్రమాన్ని వేయాలి. అన్ని వైపులా సమానంగా సర్దాలి. అలా చల్లబడనివ్వాలి.
9. చల్లబడ్డాక ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అది కాస్త గట్టిపడుతుంది.
10. అప్పుడు వాటిని బర్ఫీలా కట్ చేసుకోవాలి. పైన పిస్తాలు, బాదంలతో గార్నిష్ చేసుకుంటే చూస్తుంటేనే నోరూరిపోతుంది.
పనీర్ బర్ఫీ పిల్లలకు నచ్చడం ఖాయం. దీనిలో చక్కెర వేసాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు తినకపోవడమే మంచిది. దీన్ని బెల్లంతో తయారు చేసుకోవచ్చు. కాకపోతే రంగు కొంచెం మారుతుంది. పంచదార వేయడం వల్ల పనీర్ బర్ఫీ తెల్లగా వస్తుంది. అదే బెల్లం వేస్తే గోధుమ రంగులో వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు చక్కెర పెట్టడం ఇష్టం లేనివారు బెల్లాన్ని వేసి వండుకోండి.