Paneer 65: రెస్టారెంట్ స్టైల్‍లో ఇంట్లోనే పనీర్ 65 చేసేయండిలా.. సులభంగా, టేస్టీగా..
Paneer 65 Recipe: పన్నీర్ 65 ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‍లో చేసుకోవచ్చు. తయారీ కూడా సులభమే. త్వరగా రెడీ అవుతుంది. పన్నీర్ 65 ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
పన్నీర్ 65 అంటే చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. రెస్టారెంట్‍కు ఎప్పుడు వెళ్లినా దీన్ని స్టాటర్‌గా కొందరు తప్పనిసరిగా ఆర్డర్ చేస్తారు. దీని రుచిని ఇష్టపడతారు. అయితే, ఈ పన్నీర్ 65ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్‍లో వస్తుంది. క్రిస్పీగా అదిరిపోయేలా ఉంటుంది. పన్నీర్ 65ను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పన్నీర్ 65 చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు
- 250 గ్రాముల పన్నీర్ (కాస్త పెద్ద క్యూబ్‍లుగా కట్ చేసుకోవాలి)
- ఓ టీస్పూన్ కారం
- ఓ టీస్పూన్ ధనియాల పొడి
- రెండు టేబుల్ స్పూన్‍ల మొక్కజొన్న పిండి
- ఓ టేబుల్ స్పూన్ బియ్యం పిండి
- ఓ టేబుల్ స్పూన్ మైదా
- అర టీస్పూన్ మిరియాల పొడి
- రుచిసరిపడా ఉప్పు
- అర టీస్పూన్ గరం మసాలా పొడి
- ఓ టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- సగం నిమ్మకాయ రసం
- రెడ్ ఫుడ్ కలర్ (ఆప్షనల్)
తాలింపు (పోపు) కోసం..: రెండు టీస్పూన్‍ల నూనె, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, రెండు పచ్చిమిరపకాయలు (నిలువునా కట్ చేయాలి), రెండు రెబ్బల కరివేపాకు
పన్నీర్ 65 తయారీ విధానం
- మీడియం సైజులో కట్ చేసిన పన్నీర్ ముక్కలను ఓ మిక్సింగ్ బౌల్‍లో వేసుకోవాలి.
- పన్నీర్ ముక్కలపై కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, ఫుడ్ కలర్, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దాంట్లో సగం నిమ్మకాయ రసం పిండాలి.
- ఆ తర్వాత వాటిని బాగా కలపాలి. కారం, మిగిలిన మసాలాలు పన్నీర్ ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేయాలి. పన్నీర్ ముక్కలు విరగకుండా మృధువుగా కలపాలి. పన్నీర్ ముక్కలకు అవన్నీ బాగా పట్టాక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత పన్నీర్ ముక్కల్లో మొక్కజొన్న పిండి, బొయ్యం పిండి, మైదా వేసుకోవాలి. అవి పన్నీర్ ముక్కలకు బాగా పట్టించేలా మిక్స్ చేయాలి. వాటిపై నీళ్లను చిలరించుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా వాటిని కలపాలి. పన్నీర్ ముక్కలకు పిండి అంటేలా మిక్స్ చేసుకోవాలి.
- నూనె వేడెక్కాక అందులో పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేయాలి. మీడియం మంటపై ఫ్రైచేయాలి. నూనెలో వేసిన వెంటనే పన్నీర్ ముక్కలను గరిటెతో కలపకూడదు. కాస్త ఫ్రై అయిన తర్వాత గంటెతో కదుపి.. వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పన్నీర్ ముక్కలను బయటకు తీసేయాలి.
- దీనికి తాలింపు పెట్టుకునేందుకు ఓ ప్యాన్‍లో నూనె వేడి చేయాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి వేసుకొని వేపుకోవాలి. అవి ఫ్రై అయ్యాక తరిగిన మిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసి కాస్త టాస్ చేసి దింపేసుకోవాలి. అంతే ఎంతో టేస్టిగా ఉండే పన్నీర్ 65 పూర్తిగా రెడీ అవుతుంది.
పన్నీర్ 65 పైన మంచి క్రంచీగా, లోపల పన్నీర్ సాఫ్ట్‌గా టేస్ట్ అదిరిపోతుంది. ఈవినింగ్ స్నాక్‍కు ఇది బాగా సూటవుతుంది. సుమారు అర గంటలోనే దీన్ని పూర్తిగా తయారు చేసేసుకోవచ్చు.