Palakura Ullikaram: వేడివేడి అన్నంలో పాలకూర ఉల్లికారం తిని చూడండి, రుచి అదిరిపోతుంది ఎంతో ఆరోగ్యం కూడా-palakura ullikaram recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palakura Ullikaram: వేడివేడి అన్నంలో పాలకూర ఉల్లికారం తిని చూడండి, రుచి అదిరిపోతుంది ఎంతో ఆరోగ్యం కూడా

Palakura Ullikaram: వేడివేడి అన్నంలో పాలకూర ఉల్లికారం తిని చూడండి, రుచి అదిరిపోతుంది ఎంతో ఆరోగ్యం కూడా

Haritha Chappa HT Telugu

Palakura Ullikaram: పాలకూర అంటే మీకు నచ్చదా? ఒకసారి పాలకూర ఉల్లికారం వండి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. పాలకూర ఉల్లికారం రెసిపీ కూడా చాలా సులువు.

పాలకూర ఉల్లికారం రెసిపీ (Youtube)

పాలకూరలో ఉండే పోషకాలు ఎన్నో. కానీ దాన్ని ఇష్టంగా తినే వారి సంఖ్య చాలా తక్కువ. అలాంటి వారి కోసమే ఇక్కడ మేము పాలకూర ఉల్లికారం రెసిపీ ఇచ్చాము. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఈ రెసిపీ చేయడం కూడా చాలా సులువు. పాలకూర, ఉల్లిపాయలు రెండూ అన్ని తరగతుల వారికి అందుబాటులోనే ఉంటాయి. ఈ రెండిటినీ కలిపి పాలకూర ఉల్లికారం ఎలా వండాలో ఇక్కడ చెప్పాము. ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది.

పాలకూర ఉల్లికారం రెసిపీకి కావలసిన పదార్థాలు

పాలకూర - అయిదు కట్టలు

ఉల్లిపాయలు - రెండు

వెల్లుల్లి పాయలు - ఐదు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - రెండు స్పూన్లు

చింతపండు - ఉసిరికాయ సైజులో

నూనె - తగినంత

ఎండుమిర్చి - నాలుగు

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - చిటికెడు

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

శనగపప్పు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

పాలకూర ఉల్లికారం రెసిపీ

1. పాలకూరను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర, కారం వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

3. చివరలో చింతపండును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు వేసి వేయించుకోవాలి.

6. తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండు మిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.

7. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్ ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.

8. ఇది ఇగురులాగా అయ్యాక అందులో పాలకూర తరుగును వేసి బాగా కలుపుకోవాలి.

9. పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.

10. ఇది దగ్గరగా ఇగురులాగా అయ్యాక నూనె పైకి తేలుతుంది.

11. ఆ సమయంలో స్టవ్ కట్టేసి పైన కొత్తిమీరను చల్లుకోవాలి.

12. అంతే పాలకూర ఉల్లికారం రెడీ అయినట్టే. దీని వేడి వేడి అన్నంలో కలుపుకుని చూడండి రుచి అదిరిపోవడం ఖాయం.

పాలకూరలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆయుర్వేదంలో కూడా పాలకూర గురించి ఎంతో సానుకూల స్పందన ఉంది. జ్వరం శ్వాస సంబంధిత రోగాలను పాలకూర రాకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా పాలకూర ముందు ఉంటుంది. చర్మం మృదువుగా మారేందుకు పాలకూరలోని పోషకాలు ఉపయోగపడతాయి.