PalaKova Recipe: పాలకోవాను ఇలా నిమిషాల్లో పాలపొడితో చేసేయండి, రుచి అదిరిపోతుంది-palakova recipe with milk powder know how to make this sweet recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palakova Recipe: పాలకోవాను ఇలా నిమిషాల్లో పాలపొడితో చేసేయండి, రుచి అదిరిపోతుంది

PalaKova Recipe: పాలకోవాను ఇలా నిమిషాల్లో పాలపొడితో చేసేయండి, రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Published Feb 07, 2025 11:30 AM IST

PalaKova Recipe: పాలపొడితో కోవాను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ చేయడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు నచ్చడం ఖాయం.

పాలకోవా రెసిపీ
పాలకోవా రెసిపీ (PC: Freepik)

పాలకోవా పేరు చెబితేనే తెలుగువారికి నోరూరిపోతుంది. ఎన్ని స్వీట్లు ఉన్నా పాలకోవా ప్రత్యేకతే వేరు. దీన్ని ఇష్టపడని వారు ఉండరు. పాలకోవా చేయాలంటే బోలెడన్నీ పాలు కావాలి. అప్పటికప్పుడు ఈ స్వీట్ ను తయారుచేసుకుని తినాలనిపిస్తే పాలతోనే కాదు పాలపొడితో కూడా చేయవచ్చు. కొన్ని నిమిషాల్లోనే ఈ స్వీట్ ను తయారుచేసుకోవచ్చు.

పాలపొడితో కోవా తయారు చేయడం చాలా సులభం. తక్కువ పదార్థాలతో ఇంట్లో రుచికరమైన నోరూరించే కోవా ఎలా తయారుచేయాలో ఇక్కడ ఇచ్చాము. పిల్లలు కూడా దీనిని ఇష్టపడతారు. ఏదైనా పండుగల సమయంలో, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ సులభమైన రెసిపీని ప్రయత్నించండి.

పాలకోవా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పాలు - 1 కప్పు

పాలపొడి - పావు కిలో

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

పంచదార పొడి - పావు కప్పు

కుంకుమపువ్వు - చిటికెడు

యాలకుల పొడి - పావు స్పూన్

పాలకోవా రెసిపీ

  1. పాలకోవా చేయడానికి ఒక స్పూను పాలలో ముందుగానే కుంకుమ పువ్వు రేకులను వేసి నానబెట్టండి.
  2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.
  3. ఆ నెయ్యిలో పాలు పోసి మరిగించండి.
  4. పాలు మరిగాక అందులో పాలపొడి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపండి.
  5. ఈ మొత్తం మిశ్రమంలో ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు రేకులు, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపండి.
  6. తరువాత అందులో మిక్సీలో మెత్తగా పొడి చేసిన పంచదార పొడిని కూడా వేసి బాగా కలపండి.
  7. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  8. చేతులకు కాస్త నెయ్యి రాసుకుని కోవా ముద్ద నుంచి కొంత మొత్తాన్ని తీసి కోవాల్లాగా చుట్టుకోవాలి.
  9. పైన మీకు కావాలంటే డ్రైఫ్రూట్స్ తరుగు చల్లి గార్నిషింగ్ చేసుకోవచ్చు. అంతే కోవాలు రెడీ అయినట్టే.

ఈ కోవాలను నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి. వీటిని తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలన్న కోరిక పెరిగిపోతుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో కోవాలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇవి మీకు ఎంతో నచ్చుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం