Palak Rajma masala: రుచితో పాటు ప్రొటీన్లతో నిండిన పాలక్ రాజ్మా గ్రేవీని ఎప్పుడైనా తిన్నారా? ఇదిగోండి! ఇలా తయారు చేయండి!
Palak Rajma Recipe: శరీరానికి కావాలసిన పోషకాలను అందించడంతో పాటు అద్భుతమైన రుచిని అందించడంలో రాజ్మా పర్ఫెక్ట్. విడిగానే కాదు ఇతర కూరగాయలతో కలిపి వండుకున్నప్పటికీ ఒరిజినల్ టేస్ట్ మిస్ అవదు. ఇదే తరహాలో పాలకూరతో కలిపి రాజ్మా వండుకోవాలనుకుంటే, ఈ రెసిపీ ఫాలో అయిపోండి.

గరంగరం రాజ్మా కర్రీ అంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా.. రాజ్మా అంత రుచికరంగా ఉంటుంది మరి. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. పెళ్లిళ్లలోనూ స్పెషల్ కర్రీగా వండి వడ్డిస్తారు. ఎందుకంటే, రాజ్మాలో పుష్కలంగా ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ K, B, ఇనుము వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా అందిస్తాయి. కాబట్టే, రాజ్మా అంటే అంత డిమాండ్ ఉంటుంది. రాజ్మాను అంతా ఆహారంలో భాగం చేసుకోవడానికి పలు రకాల కాంబినేషన్స్ ట్రై చేస్తుంటారు. వాటిల్లో ఒకటే ఈ పాలక్ రాజ్మా మసాలా. ఈ సారి కాస్త కొత్తగా తిందామనుకున్న వారికి, పాలక్ రాజ్మా బెస్ట్ ఆప్షన్. మరింకెందుకు ఆలస్యం, ఈ స్పెషల్ కర్రీ రెసిపీ ఏంటో చూసేద్దామా..?
కావలసినవి:
• పాలకూర: 300 గ్రాములు
• రాజ్మా: 1/2 కప్పు
• టమాటోలు: 2
• పచ్చిమిర్చి: 2
• అల్లం: 1 ముక్క
• నూనె: 3 చెంచాలు
• ఇంగువ: చిటికెడు
• అల్లం పొడి: 1/4 చెంచా
• గరం మసాలా పొడి: 1/4 చెంచా
• కారం పొడి: 1/4 చెంచా
• కొత్తిమీర పొడి: 1 చెంచా
• బేకింగ్ సోడా: 1/4 చెంచా
• ఉప్పు: రుచికి తగినంత
తయారీ విధానం:
- రాజ్మాను బాగా కడిగి, ఎనిమిది నుండి పది గంటలు నీటిలో నానబెట్టండి.
- నానబెట్టిన రాజ్మాను కుక్కర్లో వేసి ఒక కప్పు నీరు, బేకింగ్ సోడా, రుచికి తగినంత ఉప్పు వేయండి.
- కుక్కర్ మూత మూసి, మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్ ప్రెషర్ దానంతట అదే తగ్గనివ్వండి.
- ఇంతలో పాలకూరను నీటితో మూడు నుండి నాలుగు సార్లు కడగాలి.
- పాలకూర ఆకులను రంధ్రాలున్న గిన్నెలో ఉంచి, నీరు పూర్తిగా పోనివ్వండి.
- ఒక గిన్నెలో ఒక కప్పు నీరు వేసి మరిగించండి. అందులో పాలకూర ఆకులు వేసి, మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి.
- పాలకూర ఆకులను వేడినీటి నుండి తీసి, కొంతసేపు సాధారణ నీటిలో ఉంచి, ఆ తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోండి.
- టమాటోలు, అల్లం, పచ్చిమిర్చిని కడిగి ముక్కలు చేసి గ్రైండర్లో మెత్తగా చేసుకోండి.
- ఆ తర్వాత కడాయిలో నూనె వేసి వేడి చేయడంతో పాటు కాస్త ఇంగువ వేసి, జీలకర్ర వేయండి. వేగిన తర్వాత టమాటో పేస్ట్, అల్లం పొడి, కొత్తిమీర పొడి, ఎర్ర మిర్చి పొడి వేసి వేపుతూ ఉండండి. పైన నూనె తేలే వరకు వేయించండి.
- ఇప్పుడు కడాయిలో పాలకూర పేస్ట్, ఉప్పు, ఉడికించిన రాజ్మా వేసి బాగా కలపండి.
- బాగా ఉడికిందనుకున్న తర్వాత చివర్లో గరం మసాలా వేసి చిన్న మంట మీద నాలుగు నుండి ఐదు నిమిషాలు ఉడికించండి.
- ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి, చపాతీ లేదా పరాటాలతో వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
సంబంధిత కథనం