Palak Chole: అన్నం రోటీల్లోకి పాలక్ చోలే కర్రీ ఇలా వండేయండి, రుచి చూస్తే వదలరు
Palak Chole: పాలకూర, కొమ్ము శనగలు రెండూ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఈ రెండింటినీ ఉపయోగించి పాలక్ చోలే కర్రీ ఉత్తరాది వాళ్లు అధికంగా చేస్తూ ఉంటారు. దీని రుచి అదిరిపోతుంది. రెసిపీ తెలుసుకోండి.
పాలక్ చోలే కర్రీ ఉత్తర భారత దేశంలో ప్రతి రెస్టారెంట్లోనూ దొరికే డిష్. ఇది పాలకూర ,కాబూలీ చనా కలిపి చేసే ఈ వంటకం రుచిగా ఉంటుంది. రోటీతో, చపాతీతో, పూరితో అన్నంతో కూడా ఈ కర్రీ అదిరిపోతుంది. నలుపువి కాకుండా తెల్ల కొమ్ము శనగలను ఇందులో వాడుతారు. వీటినే కాబూలీ చనా అంటారు. మార్కెట్లో ఇవి అధికంగానే లభిస్తాయి. పాలకూర ఒక మూడు కట్టలు, ఒక కప్పు కాబూలీ చనా కలిపి టేస్టీ కూరను వండొచ్చు. దీనిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పాలక్ చోలే రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పాలక్ చోలే రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలకూర తరుగు - ఒకటిన్నర కప్పు
కాబూలీ చనా - ఒకటిన్నర కప్పు
జీలకర్ర - ఒక స్పూను
బిర్యానీ ఆకు - ఒకటి
దాల్చిన చెక్క - చిన్న ముక్క
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
ఉల్లిపాయల తరుగు - అర కప్పు
అల్లం పచ్చిమిర్చి పేస్టు - రెండు స్పూన్లు
టమోటోలు - రెండు
కారం - ఒక స్పూను
చోలే మసాలా - ఒక స్పూను
ధనియాల పొడి - అర స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
పాలక్ చోలే కూర రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీలకర్ర, వెల్లుల్లి తరుగు వేసి బాగా వేయించాలి.
3. తర్వాత ఉల్లిపాయలు తరుగును కూడా వేసి వేయించుకోవాలి.
4. ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ను వేసి బాగా కలపాలి.
5. తర్వాత టమోటోలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని ఆ మిశ్రమాన్ని కూడా కళాయిలో వేసి బాగా కలుపుకోవాలి.
6. పైన ఉప్పు చల్లి మూత పెట్టి కాసేపు ఉడికించాలి.
7. టమోటోలు మెత్తగా ఇగురులాగా అవుతాయి.
8. అప్పుడు కారం, చోలే మసాలా, ధనియాలపొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
9. మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
10. తర్వాత పాలకూరను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని ఆ మిశ్రమాన్ని కూడా కళాయిలో వేసి బాగా కలుపుకోవాలి.
11. మరొకపక్క ముందుగానే కాబూలీ చనాను ముందుగానే నాలుగు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
12. ఇప్పుడు వాటిని కూడా వేసి బాగా కలపాలి.
13. అవి ఉడకడానికి సరిపడా నీటిని వేసి పైన మూత పెట్టి చిన్న మంట మీద అరగంట పాటు ఉడికించాలి.
14. ఇది ఇగురు లాగా దగ్గరగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
15. అంతే టేస్టీ పాలక్ చోలే కూర రెడీ అయినట్టే. ఇది వండుతున్నప్పుడే ఘుమఘుమలాడిపోతుంది.
ఇందులో వాడిన కొమ్ము శెనగలు, పాలకూర రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని మీరు వేడి వేడి అన్నంతో తిన్నా లేక రోటి, చపాతీలతో తిన్నా రుచి అదిరిపోతుంది. ఒక్కసారి దీన్ని వండుకొని చూడండి. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తినడం వల్ల మన శరీరానికి అత్యవసరమైన కొన్ని విటమిన్లు, ఖనిజాలు దీని నుంచి లభిస్తాయి. కాబట్టి చనా పాలక్ కర్రీని వారానికి ఒక్కసారైనా వండుకోండి. దీన్ని వేడి వేడిగా తింటేనే రుచిగా ఉంటుంది.
టాపిక్