పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి ఇలా చేశారంటే ఏ కూరలు అవసరం లేదు, ఎంత అన్నమైనా తినేస్తారు-pachi mirchi mamidikaya roti chutney made like this know the tasty recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి ఇలా చేశారంటే ఏ కూరలు అవసరం లేదు, ఎంత అన్నమైనా తినేస్తారు

పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి ఇలా చేశారంటే ఏ కూరలు అవసరం లేదు, ఎంత అన్నమైనా తినేస్తారు

Haritha Chappa HT Telugu

వేసవిలో పచ్చి మామిడికాయతో చేసే రెసిపీలు ప్రయత్నించాలి. ఎందుకంటే ఇవి సీజనల్ గా దొరికేవి. అందుకే ఇక్కడ మేము పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఇది అద్భుతంగా ఉంటుంది.

పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి రెసిపీ (Vismai Foods)

పచ్చడి పేరు చెబితేనే నోరూరి పోతుంది. స్పైసీగా, కాస్త పుల్లగా ఉండే పచ్చళ్ళు అయితే ఎంతైనా తినేస్తాము. మామిడికాయలు వేసవిలోనే అధికంగా దొరుకుతాయి. కాబట్టి పచ్చి మామిడికాయతో చేసే స్పైసీ పచ్చడి గురించి చెప్పాము.

పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి చేస్తే రుచిగా ఉంటుంది. ఎంత అన్నమైనా దీంతో సులువుగా తినేస్తారు. పక్కన ఏ కూర పెట్టినా దీని ముందు దిగదుడుపే. దీన్ని మిక్సీలో కన్నా రోట్లో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

పచ్చి మామిడికాయ - ఒకటి

పచ్చిమిర్చి - 15

ఉల్లిపాయ - ఒకటి

నూనె - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

వెల్లుల్లి - పది రెబ్బలు

వేరుశెనగ పలుకులు - గుప్పెడు

ఆవాలు - ఒక స్పూను

ఎండుమిర్చి - ఒకటి

పచ్చి శనగపప్పు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి రెసిపీ

1. పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.

2. అలాగే వేరుశెనగ పలుకులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో పచ్చిమిర్చిని వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు రోటిలో ఈ పచ్చిమిర్చిని వేయాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, మామిడి ముక్కలు వేసి దంచుకోవాలి.

5. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

6. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకునేందుకు స్టవ్ మీద మరొక కళాయిని పెట్టాలి.

7. అందులో ఒక స్పూన్ నూనెను వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకులను వేయించి పచ్చడిపై వేసుకోవాలి.

8. అంతే టేస్టీ పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది.

9. వేడివేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ పచ్చడి ఉంటే పక్కన ఏ కూర ఉండాల్సిన అవసరం లేదు.

రోలు లేనివారు మిక్సీలోనే దీన్ని చేసుకోవచ్చు. కాకపోతే మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా అయ్యేలా రుబ్బుకోవాలి. మరీ మెత్తగా అయిపోతే ఇది అంత రుచిగా ఉండదు.

సీజనల్ గా దొరికే మామిడి కాయను ఇందులో వాడాము. అలాగే పచ్చిమిర్చిని కూడా అధికంగా వాడాము. ఈ రెండూ కూడా పోషకాలను నిండుగా కలిగి ఉంటాయి. కాబట్టి ఇందులో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కసారి దీన్ని చేసుకొని చూడండి కచ్చితంగా నచ్చితీరుతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/