Beautiful Beach: మనదేశంలో ఉన్న ఎర్ర పీతల బీచ్‌ను చూసేందుకు వెళ్ళండి, చాలా ఆహ్లాదంగా ఉంటుంది
Beautiful Beach: బీచ్ అంటే అందరికీ ఇష్టమే. కొన్ని బీచ్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ మేము ఎర్రపీతల బీచ్ గురించి ఇచ్చాము. దీన్ని చూసేందుకు ప్రయత్నించండి.
ఎర్ర పీతలు చూసేందుకు చాలా అందంగా ఉంటాయి. ఇవి సముద్రపు ఒడ్డున అలా నడుచుకుని వెళ్తుంటే ఎన్నో కెమెరాలు క్లిక్ మనిపిస్తాయి. అంత అందంగా ఉంటుంది ఎర్ర పీతల బీచ్‌లు. మీకు ఎప్పుడైనా వర్క్ లోడ్ ఎక్కువ అయినప్పుడు, విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు, ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకున్నప్పుడు ఎర్ర పీతల బీచ్ కు వెళ్లేందుకు ప్రయత్నించండి. అక్కడ సూర్యాస్తమయాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవు. బీచ్ లో ఎర్ర పీతలు పరిగెడుతూ ఉంటే సూర్యుడు అస్తమించడం, ఉదయించడం వంటివి చేస్తూ ఉంటాడు. అందుకే ఎర్ర పీతల బీచ్‌లు మన దేశంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ ఎర్ర పీతల బీచ్ ఎక్కడ ఉందో తెలుసుకోండి.
ఒడిశాలో ఎర్రపీతల బీచ్
ఒడిశాలో ఒక అందమైన ఎర్ర పీతల బీచ్ ఉంది. ఆ బీచ్ ఎప్పుడూ పర్యాటకులతో నిండిపోయి ఉంటుంది. ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి ఈ ఎర్ర పీతల బీచ్ మంచి అవకాశం. ఒడిశా లోని బాలసూర్ జిల్లాలో ఈ సముద్రతీరం ఉంది. ఇది బాలాసోర్ పట్టణానికి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది కోల్ కతా నుండి అయితే దాదాపు 245 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దిగ్దా అని పిలిచే గ్రామం పక్కనే ఈ ఎర్రపితల బీచ్ ఉంది. ఇది చాలా సహజంగా ఉంటుంది. శక్తివంతమైన ఎర్రపీతలు ఈ బీచ్ లో తిరుగాడుతూ ఉంటాయి. తమ ప్రకాశమంతమైన ఎరుపు రంగుతో ఇసుక తిన్నలపై చీమల్లా కదులుతూ చూసేవారికి కనుల విందును చేస్తాయి.
ఇవి ఏడాది పొడుగునా ఆ బీచ్ లో తిరుగుతూ ఉన్నా కూడా ఎవరూ వీటిని పట్టడం వంటివి చేయరు. అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా బీచ్ లోని ఈ ఎర్ర పీతలను రక్షించేందుకే ప్రయత్నిస్తారు. ఈ పీతలు బీచ్‌లో ఉన్న పర్యావరణ వ్యవస్థలో కలిసిపోయాయి. అక్కడున్న పోషకాలను సైక్లింగ్ చేయడం, తీర ప్రాంత నాణ్యతను కాపాడడం వంటివి చేస్తాయి. అందుకే వీటి జోలికి అక్కడ ఎవరూ వెళ్ళరు.
బీచ్ లో ఉన్న మొక్కలు సేంద్రియ పదార్థాలను తిని ఇవి జీవిస్తాయి. దీనివల్లే బీచ్ మరింత శుభ్రంగా ఉంటుంది. అక్కడున్న మొక్కల అవశేషాలు కుళ్లిపోయి బీచ్ చూసేందుకు అంద విహీనంగా ఉంటుంది. అందుకే ఈ ఎర్ర పీతలు వాటిని తిని బీచ్‌ను అందంగా మారుస్తున్నాయి. దీన్నే పోషక సైక్లింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి బీచ్ లో జరగాల్సిన అవసరం ఉంది.
ఈ ఎర్ర పీతలను చూసేందుకు ఫోటోలు తీసేందుకు ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు అధికంగా వస్తూ ఉంటారు. ఈ పీతలను పట్టి తినే వారి సంఖ్య చాలా తక్కువ. అక్కడ ప్రభుత్వాలు కూడా ఈ ఎర్రపీతల బీచ్ ను కాపాడేందుకే నడుము కట్టాయి. స్థానిక పర్యావరణ వ్యవస్థకు ఈ పీతలు చేస్తున్నా సాయం ఇంతా అంతా కాదు. బీచ్ కూడా జీవవైవిద్యంతో సమృద్ధిగా ఉందంటే దానికి ఈ ఎర్ర పీతలే కారణం. కాబట్టి మీకు కూడా వీలైతే ఒడిషాలోనే బాలాసూర్ జిల్లాలో ఉన్న ఈ ఎర్ర పీతుల బీచ్ చూసేందుకు వెళ్ళండి. ముఖ్యంగా సాయంత్రం పూట వెళితే వందలుగా పీతలు బీచ్ ఒడ్డున నడుచుకొని వెళుతూ ఉంటాయి. దూరం నుంచి చూస్తే ఎర్ర తివాచీని పరిచినట్టు కనిపిస్తాయి. ఈ సీన్ చూసేందుకైనా మీరు ఆ బీచ్ కి వెళ్లాల్సిందే.