Oral Hygiene in Monsoon। వర్షాకాలంలో నోటిని అదుపులో పెట్టుకోండి, పరిశుభ్రత ముఖ్యం!
Oral Hygiene in Monsoon: వర్షాకాలంలో ఉండే వాతావరణం ఆహార కోరికలను పెంచుతాయి. చిరుతిళ్లు తినడం, వేడిగా ఆహారాలు తీసుకోవడం వలన నోటి ఆరోగ్యం చెడిపోతుంది. నోటి ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి ఈ చిట్కాలను అనుసరించండి.
Oral Hygiene in Monsoon: వర్షాకాలంలో వేడి వేడి రుచికరమైన వంటకాలను ఆస్వాదించడం, తరచుగా ఒక కప్పు టీని తాగాలనుకోవడం సర్వసాధారణం. ఈ సీజన్ లో ఉండే వాతావరణం ఆహార కోరికలను పెంచుతాయి. తరచుగా కారంగా, తియ్యగా ఉండే చిరుతిళ్లు తినడం, వేడిగా ఆహారాలు తీసుకోవడం వలన నోటి ఆరోగ్యం చెడిపోతుంది, దంత సమస్యలు కలగవచ్చు. ముఖ్యంగా సున్నితమైన దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్న వారికి ఈ మాన్‌సూన్ సీజన్‌ను ఎదుర్కోవడం ఒక సవాలుగా ఉంటుంది. చల్లని వాతావరణం కారణంగా కూడా దంతాలలోని నరాలు జివ్వుమని లాగుతాయి. కాబట్టి, ఇటువంటి పరిస్థితులలో మీ నోటి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసన ఇతర సమస్యలు నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్లనే కలుగుతాయి.
ఇవి పంటి నొప్పి, దంతాలు చెడిపోవడం, చిగుళ్ల సున్నితత్వం వంటి బాధాకరమైన అనుభూతిని, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నోటి ఆరోగ్యం బాగాలేకపోతే అది మీ మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఇతర అనేక అనారోగ్యాలను కలిగిస్తుంది. మీ శరీరానికి సాధారణ పరిశుభ్రత పద్ధతులు అవసరం అయినట్లే, నోటి పరిశుభ్రతకు పద్ధతులు ఉన్నాయి. వర్షాకాలంలో నోటి ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి ఈ చిట్కాలను అనుసరించండి.
రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి
మీ దంతాలను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. రోజూ ఉదయం, రాత్రి ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రెండు నిమిషాలు బ్రష్ చేయడం వల్ల నోటి దుర్వాసన, కావిటీస్, చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే మీరు వాడే టూత్ బ్రష్ కుడా పొడిగా, పరిశుభ్రమైన వాతావరణంలో నిలువుగా ఉంచండి.
దంతాల ఫ్లాస్ చేయండి
మీ దంతాల మధ్య, మీ చిగుళ్లలో ఇరుక్కున ఫలకం, ఆహార కణాలను తొలగించుకోటానికి రోజుకు ఒక్కసారైనా ఫ్లాస్ చేయండి లేదా ప్రత్యామ్నాయ రోజులలోనైనా చేయాలి.
మౌత్ వాష్ ఉపయోగించండి
బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం పూర్తయ్యాక మీ నోటిని మౌత్ వాష్ తో శుభ్రం చేసుకోండి. మౌత్ వాష్ బ్యాక్టీరియాను చంపడానికి, మీ శ్వాసను తాజాగా మార్చడానికి సహాయపడుతుంది.
చక్కెర ఆహారాలను తినడం తగ్గించండి
చక్కెర కలిగిన ఆహారాలు, ఆమ్లత్వం కలిగిన పదార్థాలు దంత క్షయం, చిగుళ్లలో మంటకు కారణమవుతాయి. చక్కెర పదార్థాలు దంతక్షయం కలగడానికి కారణమవుతాయి వీటిని నివారించడానికి మీరు చక్కెర పానీయాల తీసుకోవడం పరిమితం చేయండి. ధూమపానం, పొగాకు ఉత్త్పత్తులను నివారించండి.
పుష్కలంగా నీరు త్రాగండి
నీరు త్రాగడం వలన మీ నోటిలోని ఆహార కణాలు, బ్యాక్టీరియాను కడిగివేయడంలో సహాయపడుతుంది. ఇది మీ నోటిని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
దంత వైద్యుడిని సంప్రదించండి
నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి అప్పుడప్పుడు దంత పరీక్షలు చేసుకోవడం, దంతాలను డీప్ క్లీన్ చాలా ముఖ్యం. కనీసం సంవత్సరానికి రెండుసార్లైనా దంత వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరిశీలనలు, చికిత్సలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తారు.
సంబంధిత కథనం