కర్ణాటకలోని కొండ ప్రాంతం చిక్‌మగుళూరు. కాఫీ తోటలు, అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇది. ఇక్కడ పచ్చని లోయలు, జలపాతాలు, అభయారణ్యాలు నిండుగా ఉన్నాయి. సాహసాలు చేసేందుకు ఎన్నో క్రీడలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ కాఫీ భూమిని చూడాలంటే రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.
చిక్‌మగుళూరు.. బెంగళూరు నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఉత్తమ హిల్ స్టేషన్లలో ఇది ఒకటి. పచ్చదనం నిండి ఉన్న లోయలు, కొండలతో ఈ ప్రాంతం కనులు విందుగా ఉంటుంది.
దీన్ని కాఫీ భూమి అని పిలుచుకుంటారు. ఎందుకంటే చిక్‌మగుళూరు కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో మొదట ఈ ప్రాంతంలోనే కాఫీని సాగు చేశారని కూడా చెబుతారు.
చిక్‌మగుళూరు ఎంతో ప్రసిద్ధమైనది. దీన్ని ఏడాది పొడవునా ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఇక్కడ అధిక వేడి ఉండదు. అలా అని అధిక చలి కూడా ఉండదు. సాహస క్రీడలను ఇష్టపడే వారికి ఇక్కడ అన్ని ఆటలు ఉన్నాయి.
ఈ హిల్ స్టేషన్‌కు ప్రతి ప్రధాన నగరం నుండి రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మైసూర్ నుండి బెంగళూరు చేరుకొని.. బెంగళూరు నుండి నాలుగు నుంచి ఆరు గంటల్లో చిక్‌మగుళూరు రావచ్చు. అలాగే బెంగుళూరు, మైసూరు రెండు ప్రధాన విమానాశ్రయాలు ఉన్నాయి. బయట నగరాల నుంచి విమానాల్లో వచ్చేవారు... బెంగళూరు వరకు లేదా మైసూర్ వరకు విమానంలో వచ్చి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా చిక్‌మగుళూరులో చేరుకోవచ్చు.
చిక్‌మగుళూరులో చూడడానికి ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అద్భుతమైన జలపాతాలు చూసే కొద్ది తనివి తీరదు. ఇక్కడ ఉన్న అత్యంత అందమైన ప్రాంతాలలో కాళహట్టి జలపాతం ఒకటి. అలాగే భద్రా వన్యప్రాణుల అభయారణ్యంలో చిరుతలు, పులులు, అడవి పందులు అధికంగా ఉంటాయి. వన్యప్రాణులను ఫోటోలు తీయాలనుకునేవారు ఇది మంచి ప్రదేశం అనే చెప్పాలి.
బాబు బుడన్ గిరి పైకి చేరుకోవడానికి 450 కంటే ఎక్కువ మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడికి చేరుకున్న తర్వాత శిఖరపు అంచు నుంచి చూస్తే ఎంతో అందమైన దృశ్యాలు చుట్టూ కనిపిస్తాయి. అంత ఎత్తు నుంచి కిందకు పడుతున్న లోయలను జలపాతాలను దర్శించవచ్చు.
చిక్‌మగుళూరు నుండి 29 కిలోమీటర్ల దూరంలో బెలవాడి అనే గ్రామం ఉంది. ఈ గ్రామం చరిత్రలో ఎంతో పేరు తెచ్చుకుంది. హోయసలుల పరిపాలించిన గ్రామంగా దీన్ని చెప్పుకుంటారు. ఇప్పటికీ ఆ గ్రామంలో హోయసల నిర్మాణ శైలిని చూడవచ్చు.
ఇక్కడ ఉన్న బటర మిల్క్ జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. పచ్చని కొండల నుండి ఈ ప్రవహించే జలపాతం పైనుంచి చూస్తే నురగలా మజ్జిగలా కనిపిస్తుంది. అందుకే దీనికి బటర్ మిల్క్ జలపాతం అని పేరు పెట్టారు.
చిక్‌మగుళూరులో ఉన్న కాఫీ మ్యూజియం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాఫీ సాగు నుంచి కోత వరకు.. కాఫీ పొడి తయారీ వరకు మొత్తం ప్రక్రియ ఈ మ్యూజియంలో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే ప్రయోగశాలలో కూడా ఎన్నో ఆసక్తికరమైన ప్రదేశాలు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల నుండి చిక్‌మగుళూరు వెళ్లడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. రైలు మార్గం ద్వారా బెంగళూరు వరకు చేరుకొని అక్కడ నుంచి చిక్‌మగుళూరుకి ప్రయాణం చేయవచ్చు. అక్కడ ఉండే హోటల్స్ కూడా తక్కువ ధరలోనే లభిస్తాయి. తక్కువ బడ్జెట్లో వేసవి లో ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి చిక్‌మగుళూరు మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి.