భార్యాభర్తలు ఎలా అయితే ఒక జంటలా ఉంటారో.. ఈ షుగర్, ఊబకాయం కూడా జంటలుగా ఉంటాయి. మీరే చూడండి.. ఎవరైతే ఊబకాయంతో బాధపడతారో.. వాళ్లతో 90 శాతం మందికి షుగర్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు లేకపోయినా అదే బరువు మీరు తగ్గకుండా ఉంటే.. భవిష్యత్తులో పక్కా వస్తుంది. బరువును కంట్రోల్ చేసుకోకపోతే.. ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు..ఇదైతే నిజం.. అందుకే ఈ ఊబకాయ దినోత్సవం సందర్భంగా అయినా.. మీకు మీరే బరువు తగ్గాలనే సంకల్పాన్ని పెట్టుకోండి.
ఇలాంటి సంకల్పాలు గతంలో చాలానే పెట్టాం..అయినా పనికాలేదు అని ఫీల్ అవుతున్నారా..? బరువు తగ్గాలంటే.. తిండి మానేయాలి అనుకుంటారు చాలా మంది. ఇది చాలా తప్పు.. తిండి మానక్కర్లేదు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా ఊబకాయం పెరుగుతుంది. పెద్దలకే బరువు మీద కంట్రోల్ లేదు.. చిన్నపిల్లల్లో ఊబకాయాన్ని కంట్రోల్ చేసేది ఎలా?
మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పిల్లలలో ఊబకాయం 1990 నుండి ఎక్కువగా పెరుగుతుంది. ఈరోజు చాలా మంది పిల్లలు మొబైల్ ఫోన్లు, టీవీల ముందు గడుపుతున్నారు. పిల్లల్లో స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల ఊబకాయం వస్తుంది. అనారోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు, ఫాస్ట్ ఫుడ్స్, అధిక కేలరీల ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు.
పిల్లలు జంక్ ఫుడ్, స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. అదే సమయంలో, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినేలా చూసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే ఆహారం కూడా ఊబకాయం, జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పిల్లలు మొబైల్ స్క్రీన్ ముందు ఉన్నప్పుడు కంట్రోల్ చేయాలి. టీవీ చూస్తూ తినడం మానిపించండి. టీవీ చూస్తూ.. ఎక్కువ ఆహారం తినేస్తుంటారు. అందుకే తినేప్పుడు మెుబైల్, టీవీలకు దూరంగా ఉంచండి.
వాకింగ్ ప్లాన్‌లలో నడక, సైక్లింగ్, అవుట్‌డోర్ గేమ్‌లు ఉండాలి. దీంతో పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెరుగుతుంది. ఎంతసేపు చదువు, హోమ్‌వర్క్, పరీక్షలు ఇవే కాదు.. వారికి బయట ప్రపంచాన్ని పరిచయం చేయండి.. శారీరక శ్రమ అందరికీ అవసరం.
ఆరోగ్యకర అలవాట్లను పిల్లల్లో ముందుగానే పెంచాలి. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకుండా వారిని నిరుత్సాహపరచాలి. ఫాస్ట్ ఫుడ్స్, సోడాలు, స్వీట్లు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వినియోగాన్ని తగ్గించాలి.
నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రతిరోజూ బాగా నిద్రపోయేలా చూసుకోవాలి. వీకెండ్ వస్తే.. బిర్యానీలు, స్కూల్ నుంచి వచ్చేప్పుడు పిజ్జాలు, బర్గర్‌లు, పానీపూరీలు, లాంటివి తినిపించకుండా తల్లిదండ్రులు మీరే జాగ్రత్తలు తీసుకోవాలి.
పండ్లు, కూరగాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సలహా ప్రకారం పండ్లు, కూరగాయలు ఒబెసిటి రిస్క్‌ను తగ్గిస్తాయి. పోషకాలు అధికంగా ఉండి, డయాబెటిస్‌ను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం వల్ల క్యాలరీలు కొద్దిగా లభించినా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు.