జూన్ 19న రాహుల్ గాంధీ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన ఆయన నేటితో 55 ఏళ్లకు చేరుకుంటారు. ఈ వయసులో కూడా ఆయన ఫిట్‌నెస్ దినచర్య చాలామందికి స్ఫూర్తినిస్తోంది. 2023లో రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్రలో ఉన్నప్పుడు ట్రావెల్ అండ్ ఫుడ్ ఛానెల్ కర్లీటేల్స్‌తో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తన ఆహారం, వ్యాయామాల గురించి వివరించారు. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి తాను చేసే వివిధ రకాల వ్యాయామాల గురించి, మంచి శరీరాకృతిని కాపాడుకోవడానికి ఏమేం తింటారో ఆయన వివరించారు.
తాను ఎల్లప్పుడూ ఏదో ఒక రకమైన శారీరక శ్రమ చేస్తానని కాంగ్రెస్ ఎంపీ చెప్పారు. రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించారు. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు ఆయనకు డైవింగ్ కూడా వచ్చు. అంతేకాదు భారత్ జోడో యాత్ర సమయంలో కూడా తాను క్రమం తప్పకుండా మార్షల్ ఆర్ట్స్ తరగతులకు హాజరయ్యానని ఆయన చెప్పారు.
ఆహారం గురించి మాట్లాడుతూ తాను కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటానని, ఒకవేళ అన్నం లేదా రోటీ తినాల్సి వస్తే రోటీని ఇష్టపడతానని చెప్పారు. మాంసాహారాన్ని ఇష్టపడే ఆయనకు చికెన్ టిక్కా, సీక్ కబాబ్, ప్లెయిన్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. ఉదయం ఒక కప్పు కాఫీ తాగుతానని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఢిల్లీ యూనిట్, ఇండియన్ యూత్ కాంగ్రెస్ సంయుక్తంగా టాల్కటోరా స్టేడియంలో ఒక పెద్ద జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం గాంధీ ప్రధాన రాజకీయ అంశాలలో ఒకటైన నిరుద్యోగంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది.
ఇక కాంగ్రెస్ నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. X లోని సోషల్ మీడియా పోస్ట్‌లో సింగ్ ఇలా రాశారు, "లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు @RahulGandhi కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నాను.." అని పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ గెహ్లాట్ కూడా X లో తమ శుభాకాంక్షలు పోస్ట్ చేశారు.
టాపిక్