Heart Break: మీ బంధానికి ముగింపు ముందే గమనించండి..-notice the end before heart break in your relationship otherwise you can not cope up
Telugu News  /  Lifestyle  /  Notice The End Before Heart Break In Your Relationship Otherwise You Can Not Cope Up
మీ ప్రేమ బంధానికి ముగింపు ముందే గమనించండి
మీ ప్రేమ బంధానికి ముగింపు ముందే గమనించండి

Heart Break: మీ బంధానికి ముగింపు ముందే గమనించండి..

22 March 2023, 18:46 ISTHT Telugu Desk
22 March 2023, 18:46 IST

Heart Break: కొన్ని హార్ట్ బ్రేక్స్ విషాదంగా ముగుస్తాయి. ఒక్కోసారి బలవన్మరణానికి పాల్పడుతుంటారు. కానీ కాస్త జాగ్రత్త పడితే ఈ విషాదాలను ఆపొచ్చని థెరపిస్టులు చెబుతున్నారు.

ప్రేమ, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచి మీకు దగ్గరైన వారిని మీ సర్వస్వం అనుకుంటారు. వారి ప్రేమ మీకు ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేస్తుంది. మిమ్మల్ని మైమరిపింపజేస్తుంది. వారితో ఇక మీ బంధం శాశ్వతం అని అనుకుంటారు. కానీ జీవితం అనే పదానికి ఎవరికి సౌకర్యవంతంగా ఉన్న నిర్వచనాలు వారు ఇచ్చుకుంటారు. అందువల్ల మీరు ప్రేమ బంధాన్ని ఒకసారి లోతుగా తరచి చూడండి. వారే సర్వస్వం అని మీరు అనుకుంటున్నారు సరే. మీరు ఇష్టపడిన వారు కూడా అనుకోవాలి కదా.. వారు కూడా మీరే సర్వస్వం అనుకుంటున్నారో లేదో తెలుసుకోండి. ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి సూచనలు నచ్చవు. కానీ మీ ప్రేమ విషాదాంతం కాకూడదనుకుంటే మీరు స్పృహలో ఉండండి. దురలవాట్లకు బానిసలై నిద్ర లేని రాత్రులు గడిపి జీవితాన్ని నాశనం చేసుకోకండి. వారిది నిజమైన ప్రేమా? ఆకర్షణా? ఇంకేదైనా కారణమో తెలుసుకోండి. నిండా మునిగే వరకూ చూస్తూ ఉంటే ఇక మీరు పాతాళం నుంచి పైకి లేవలేరు.

1.మాటలు కాదు.. చేతలు చూడండి

మీ అనుకున్న వారి మాటల్లో మీకు ఎలాంటి అనుమానం కలగకపోవచ్చు. వారి ప్రేమలో నిజాయతీ కనిపించొచ్చు. కానీ మాటలు వ్యక్తీకరించని అసలు వాస్తవాలు కొన్ని చేతల్లో కనిపించొచ్చు. మీరు ఇష్టపడిన వారి మనసులో మీరు కాకుండా ఇంకెవరైనా ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. కేవలం ఒక సంఘటన, ఉదంతం కాకుండా కొన్ని వరుస సంకేతాలు మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వారి ప్రాధాన్యతలు మారడం, ఇతరులపై వేరే రూపంలో వారి ప్రేమను వ్యక్తపరచడం మీరు గమనించాల్సి ఉంటుంది. కానీ ఇందుకు కొన్ని హద్దులు ఉన్నాయి. మీది అనుమానంగా కాకుండా, కేవలం ఫ్యాక్ట్ చెకింగ్‌లా మీ గమనిక ఉండాలి.

2. గాఢత, ప్రాధాన్యత తగ్గిందా?

మీతో ఇంతకుముందులా ఆప్యాయంగా మాట్లాడడం లేదా? వారి ప్రేమలో గాఢత తగ్గిందా? ఈ పరిణామంలో మీ నుంచి ఎలాంటి తప్పు లేదని మీరు నిర్ధారించుకున్నాక.. అందుకు గల కారణాలను అర్థం చేసుకోండి. వారి జీవితంలో, మీ జీవితంలో జరిగిన సంఘటనలను విశ్లేషించండి. వారు ఆశించింది మీ ద్వారా వారికి లభించలేదా? మీ ఇద్దరి జీవితంలోకి మూడో వ్యక్తి వచ్చారా? వంటి సంకేతాలు గమనించండి. మూడో వ్యక్తిపై వారి ప్రేమను ఏ రూపంలో వ్యక్తీకరిస్తున్నారో గమనించండి. మీరు ప్రేమించిన వ్యక్తి అభిరుచులు మారడం, ప్రాధాన్యతలు మారడం, మీ పట్ల వారి భాష, టోన్ మారడం మీరు గమనిస్తారు. మిమ్మల్ని పిలిచే విధానమూ మారుతుంది. అంటే వారి జీవితంలో మీ పాత్ర ముగిసిందేమో గమనించండి.

3. శాశ్వతంగా ఉండలేని పరిస్థితి ఉందా?

మీరు ప్రేమించారు. శాశ్వతంగా బంధంలో ఉండిపోదామనుకున్నారు. కానీ అవతలి వ్యక్తికి కూడా వీలు కావాలి కదా. అందుకు పరిస్థితులు సహకరించాలి కదా. ఒకవేళ అలా సాధ్యం కానప్పుడు.. వారు మీతో బంధం తెగదెంపులు చేసుకోవడంలో భాగంగా మీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారేమో గమనించండి. ఇలాంటి పరిస్థితుల్లో తప్పంతా మీపైనే వేసుకుని, ఇక జీవితం ముగిసిపోయిందనుకోకండి. మీ బాధ పట్ల వారికి సానుభూతి ఉండాలని కోరుకోకండి.

4. నేరుగా చెప్పలేకపోవచ్చు

మీరు ఇష్టపడిన వాళ్లు మొదట్లో మిమ్మల్ని ఇష్టపడ్డా, అనివార్యమైన పరిస్థితుల కారణంగా మిమ్మల్ని దూరం పెడుతున్నట్టు మీకు చెప్పకపోవచ్చు. మీరు భావోద్వేగాలు అదుపులో పెట్టుకోలేరని వారు భావిస్తే మీకు చెప్పేందుకు ఇష్టపడరు. అయితే ఎవరినీ బలవంతంగా ప్రేమించగలిగేలా చేయలేమని గుర్తించండి. అలాగే మీరు బతిమాలేందుకు ఎంత తగ్గినా, దిగజారినా ఫలితం ఉండదని గమనించండి. మీరు ఎంత నిజాయతీగా ఉన్నా, మీరు ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. మీరంటే ఇష్టం తగ్గిన వారు.. మీ ప్రయత్నాలను ఎలా ఇష్టపడతారు?

5. మీ పాత్రతో అవసరం లేకపోవచ్చు

మీ మధ్య కమ్యూనికేషన్ తగ్గిందని గమనించారా? ఏ ఒక్కరి జీవితంలోనూ మీది ప్రధాన పాత్ర కాదని గుర్తించండి. మీరు ప్రేమించిన వ్యక్తి జీవితంలో మీ పాత్ర అవసరం ఇక లేదని వారు భావించినట్టు మీరు గుర్తిస్తే వారి నిర్ణయాన్ని గౌరవించండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడమో లేక అవతలి వారి నుంచి వాలిడేషన్ కోరుకోవడం అస్సలే వద్దు. మీ వ్యక్తిత్వానికి ఇంకొకరి సర్టిఫికెట్ అవసరం లేదు. అలా కాకుండా మీరు ఆ గుండె గాయాన్ని మాననివ్వను అని అనుకుంటే మీరే నష్టపోతారు. మీరంటేనే నచ్చని వారు మీ గాయాలను, మీ భావాలను పట్టించుకుంటారని ఎలా అనుకుంటారు? మీ వ్యక్తిత్వంతో వారికి ఏం పని.

6. మీ నిజాయతీ మిమ్మల్ని ఫెయిల్ చేసి ఉండొచ్చు

మీ ప్రేమలో మీరు నిజాయితీగా ఉండి ఉండొచ్చు. మీ బలహీనతలు, మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు అన్నీ షేర్ చేసుకుని ఉండొచ్చు. కానీ అవతలి వ్యక్తికి అవి అసౌకర్యంగా ఉండొచ్చు. వీటిని స్వీకరించేందుకు వారు సిద్ధంగా ఉండకపోవచ్చు. లేదా వారు ఆశించిన ప్రేమ మీ వద్ద దొరకదని తెలియడంతో వారు మిమ్మల్ని దూరం పెడుతుండొచ్చు. అప్పుడు కూడా తప్పు మీదేనంటూ కుమిలిపోకండి. మీ ప్రతికూలతల్లో సపోర్ట్ చేయలేని వారు, మీ బాధ్యతలను పంచుకోలేని వారు మీతో ఉన్నా మిమ్మల్ని ప్రేమించలేరని గుర్తించండి. అప్పటి వరకు టన్నుల కొద్ది ప్రేమ చూపించిన వారు.. ఇప్పుడు టన్నుల కొద్ది అయిష్టాన్ని ప్రదర్శించినా భరించండి. కానీ మీ విలువైన జీవితాన్ని కోల్పోకండి.

మీ తప్పులకు మీరే బాధ్యులు.. ఒకవేళ మీ తప్పు లేనట్టు మీరు నిర్ధారించుకుంటే మాత్రం.. మీరు చేయని తప్పుకు మీరు శిక్ష అనుభవించడం సరికాదు. మనతో ఉండిపోయే వాళ్లు వచ్చే వరకూ.. వచ్చిన వాళ్లందరూ వెళ్లిపోతూనే ఉంటారన్న డైలాగ్ గుర్తు పెట్టుకోండి.

సంబంధిత కథనం