Uterus in Male: మహిళల్లోనే కాదు మగవారిలో కూడా గర్భాశయం, ఇలా ఎందుకు జరుగుతుంది? వారికి పిల్లలు పుడతారా?-not only women but also men have a uterus why does this happen do they have children ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Uterus In Male: మహిళల్లోనే కాదు మగవారిలో కూడా గర్భాశయం, ఇలా ఎందుకు జరుగుతుంది? వారికి పిల్లలు పుడతారా?

Uterus in Male: మహిళల్లోనే కాదు మగవారిలో కూడా గర్భాశయం, ఇలా ఎందుకు జరుగుతుంది? వారికి పిల్లలు పుడతారా?

Haritha Chappa HT Telugu

Uterus in Male: గర్భాశయం అనేది కేవలం మహిళలకు మాత్రమే ఉండే అవయవం. అందుకే పిల్లలు మహిళలకు మాత్రమే పుడతారు. అయితే పురుషులు కడుపులో కూడా గర్భాశయం ఉండే అవకాశం ఉంది.

మగవారిలో గర్భాశయం ఎందుకు వస్తుంది? (Pixabay)

గర్భాశయం, అండాశయాలు అనేవి మహిళలకు చెందిన అవయవాలు. పునరుత్పత్తి వ్యవస్థలో మహిళలకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. అయితే మహిళలకు ఉండాల్సిన అవయవాలు ఒక్కోసారి పురుషుల్లో కనిపించవచ్చు. అలాంటి పురుషులకు పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ ఉందని చెబుతారు. ఈ వ్యాధి ఉన్న పురుషులలో గర్భాశయం, అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్ వంటివన్నీ ఉంటాయి. అయితే వారు సంతానోత్పత్తి మాత్రం చేయలేరు. పురుష పునరుత్పత్తి అవయవాలు కూడా వారిలో ఉంటాయి.

ఈ వ్యాధి ఎందుకు వస్తుంది?

ఇలా పురుషుడిలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు రావడానికి యాంటీ ములేరియన్ హార్మోన్ ప్రధాన కారణం అని చెప్పుకుంటారు. దీని పనితీరులో లోపం వచ్చినా లేదా ఉత్పత్తిలో తేడా వచ్చినా కూడా ఇలా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు పురుషుడిలో పెరగడం ప్రారంభమవుతాయి.గర్భంలో ఉన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలవుతుంది. మగ లేదా ఆడ శిశువు గర్భంలో ఉన్నప్పుడు ముల్లేరియన్ డక్ట్... దీన్నే ముల్లేరియన్ వాహికా అని కూడా పిలుస్తారు. వారి శరీరంలో ఇది పెరగడం ప్రారంభం అవుతుంది.

గర్భంలో ఆడపిల్ల ఎదుగుతున్నప్పుడు ఈ వాహిక స్త్రీ లైంగిక అవయవాలుగా మారి అభివృద్ధి చెందుతుంది. అదే గర్భంలో అబ్బాయి ఉంటే వారి జన్యువులు ఈ వాహికను విచ్ఛిన్నం చేసి ప్రోటీన్లను విడుదల చేస్తాయి. కాబట్టి ఈ వాహిక అభివృద్ధి చెందకుండా ఆగిపోతుంది. కానీ కొంతమంది మగ శిశువుల్లో ఈ జన్యువులు మ్యుటేషన్ జరుగుతాయి. అంటే ఇవి ప్రోటీన్లుగా మారవు. ఫలితంగా ఆ మగబిడ్డలో ములేరియాన్ నాళం... గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబులుగా, అండాశయాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అలా ఆ మగపిల్లాడికి పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ వచ్చినట్టే.

ఈ వ్యాధి ఉన్న పురుషులు ఆరోగ్యంగా జీవించలేరు. వారికి పిల్లలు పుట్టే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. వారిలో పురుష పునరుత్పత్తి అవయవాల ఎదుగుదల పనితీరు సవ్యంగా ఉండదు. దీనివల్ల వారు సంతానాన్ని పొందలేరు. ఈ వ్యాధి మగపిల్లలకు టెస్టికల్స్ ఎదగవు. అవి కిందకి దిగకుండా అలానే ఉంటాయి. గజ్జ ప్రాంతంలో హెర్నియా కూడా పెరిగే అవకాశం ఉంది.

పిల్లలుగా ఉన్నప్పుడే వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా కొంతవరకు దీన్ని సరిచేస్తారు. కానీ దీనిని గుర్తించలేని వారు అలానే పెరిగి పెద్దవుతారు. పురుష జననేంద్రియాలు సరిగా పెరగకపోతే వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. వీటికి శస్త్ర చికిత్స అవసరం పడుతుంది. కొన్ని రకాల పరీక్షల ద్వారా ఈ వ్యాధి ఉందో లేదో నిర్ధారిస్తారు. రేడియోలాజిక్ పరీక్షలు, లాప్రోస్కోపీ ద్వారా రోగ నిర్ధారణను చేస్తారు. ఈ చికిత్సలో ముల్లేరియన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యే డక్ట్‌ను శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు. ఇలాంటి వారికి టెస్టికల్ క్యాన్సర్, ముల్లేరియన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వారసత్వంగా వచ్చేది

ఈ సిండ్రోమ్ వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే అది ఆ కుటుంబంలోని వారసులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో కేవలం 6 మందికి మాత్రమే శస్త్ర చికిత్స తర్వాత సంతానోత్పత్తి సామర్థ్యం వచ్చినట్టు తెలిసింది. ప్రపంచంలో 300 మంది కంటే తక్కువ పురుషుల్లోనే ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తించారు. వీరికి పిల్లలు పుట్టే సామర్థ్యం ఉండదు.

మనదేశంలో కూడా గోరఖ్‌పూర్‌కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కడుపులో గర్భాశయం, అండాశయాలు కనిపించాయి. అలాగే మరొక 40 ఏళ్ల వ్యక్తికి కూడా ఇదే సమస్య వచ్చింది. అతనికి శస్ర చికిత్స చేసి గర్భాశయాన్ని తొలగించారు. మరొక 22 ఏళ్ళ యువకుడి పొట్ట నుండి కూడా గర్భాశయాన్ని తొలగించారు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.