తినేటప్పుడు మాత్రమే కాదు వంట చేసేటప్పుడు కూడా మాట్లాడకూడదంట! ఎందుకో తెలుసా?
తినేటప్పడు మాట్లాడకూదనీ, వేరే ఏ పని చేయకుండా, ఆహారం మీద శ్రద్ధ పెట్టాలనీ మీరు వినే ఉంటారు. కేవలం తినే సమయంలో మాత్రమే కాదు ఆహారాన్ని వండే సమయంలో కూడా ఇలాగే మౌనంగా, శాంతంగా ఉండాలంట! ఎందుకో తెలుసుకుందాం రండి..
భోజనం చేసేటప్పడు మాట్లాడకూడదు, ఫోన్ పట్టుకుని కూర్చోకూడదు, టీవీ చూస్తే అన్నం తినకూడదు ఇలాంటివన్నీ మీరు వినే ఉంటారు. కానీ ఆహారం తయారు చేసేటప్పుడు అంటే వంట చేసేటప్పుడు కూడా మాట్లాడకూదనీ, ఇతర పనులు ఏవీ చేయకూడదనీ ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? ఇది కాస్త విడ్డూరంగా, వింతగా అనిపించినప్పటికీ ఇందులో వాస్తవం ఉందని చెబుతున్నారు ఆహార నిపుణులు.
వంట చేయడం రోజువారి కార్యక్రమంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే ప్రతి ఒక్కరికీ వంట చేయడంలో తమదైన శైలి, పద్థతి ఉంటాయి. కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ వంట చేయడానికి ఇష్టపడతారు, మరికొంతమంది టీవీ సీరియల్స్ చూస్తూ వంట చేస్తారు, మరికొంతమంది బిగ్గరగా పాటలు వింటూ వంట చేస్తారు. కానీ ఈ విధంగా వంట చేయడం సరైనదేనా? అంటే కానీ కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందాం రండి..
వంట చేసేటప్పుడు మౌనంగా ఉండాలనీ, ఇతర పనులేవీ చేయద్దనీ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. శాంతంగా వంట చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎక్కువగా దృష్టిని పెట్టేలా చేస్తుంది. తయారు చేస్తున్న ఆహారం వాసనను, రూపాన్ని, శబ్దాన్ని పూర్తిగా అనుసంధానించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాదు మౌనంగా శాంతంగా వంట చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందట. ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో చూసేద్దాం..
ఒత్తిడి తగ్గుతుంది
మీరు శ్రద్ధగా, మౌనంగా వంట చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే ఒక శాంత వాతావరణం ఏర్పడుతుంది. మీలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒంటరితనాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. ఒంటరిగా ఫీల్ అయ్యే వ్యక్తులకైతే ఈ పద్ధతి మరింత సహాయకారిగా పనిచేస్తుంది. ఇలా శాంతంగా వంట చేయడం మీకు చాలా నచ్చుతుంది.
శబ్దాల పట్ల అవగాహన
వంట చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడటం లేదా పాటలు, మాటలు వినకుండా నిశ్శబ్దంగా, శాంతంగా ఉండటం వల్ల వంటకు సంబంధించిన చిన్న చిన్న శబ్దాలను కూడా గ్రహించగలుగుతారు. ఉదాహరణకు నూనె వేడయ్యే శబ్దం, నీరు మరిగే శబ్దం, కూరగాయలు ఉడికే శబ్దం వంటివి వినగలుగుతారు. అందులో నిమగ్నమైపోయి వంటలో పొరపాట్లు చేయకుండా ఉంటారు. వంట పట్ల ఎక్కువ అవగాహాన పొందగలుగుతారు.
మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్
మీ మనసులో ఎల్లప్పుడూ ఎన్నో రకాల ఆలోచనలు, ఆందోళనలు ఉంటాయి. నిశ్శద్దంగా, శాంతంగా వంట చేయడం కూడా ఒక రకమైన మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ అవుతుంది, ఇది ప్రస్తుత క్షణంలో సంపూర్ణంగా ఉండటానికి, పనిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఇలా చేయడం ద్వారా మీరు మరింత విశ్రాంతిగా ఫీలవుతారు, దృష్టి కేంద్రీకరణ మెరుగవుతుంది.
ఆహారం రుచి మెరుగుపడుతుంది
వంట చేసేటప్పుడు వచ్చే శబ్దాలు, ఆహారం రంగు, రూపంపై పూర్తి దృష్టి పెట్టడం ద్వారా, కూరలు మాడకుండా, ఉప్పులు, కారాలు ఎక్కువగా కాకుండా చూసుకోగలుగుతారు. మీరు మీ ఆహారానికి మంచి రూపాన్ని ఇవ్వగలుగుతారు. చక్కటి రుచిని జోడిచగలుగుతారు.