Thursday Motivation: జీవితంలో సుఖమే కాదు కష్టం కూడా భాగమే, ఈ భూమిపై కష్టం లేని జీవి ఏదో చెప్పండి?-not only happiness but also hardship is a part of life learn to cope with difficulties ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation: జీవితంలో సుఖమే కాదు కష్టం కూడా భాగమే, ఈ భూమిపై కష్టం లేని జీవి ఏదో చెప్పండి?

Thursday Motivation: జీవితంలో సుఖమే కాదు కష్టం కూడా భాగమే, ఈ భూమిపై కష్టం లేని జీవి ఏదో చెప్పండి?

Haritha Chappa HT Telugu

Thursday Motivation: కొంతమందికి త్వరగా జీవితం పై విరక్తి వచ్చేస్తుంది. సుఖమే లేని జీవితం అని తిట్టుకుంటారు. కష్టాలను తలుచుకొని తెగ బాధపడతారు. కష్టం లేని జీవి ఏదో ఒకసారి ఆలోచించి చెప్పండి.

మోటివేషనల్ స్టోరీ (Pixabay)

చిన్న సమస్యకి అల్లాడిపోతూ విలవిల్లాడి పోయేవారు ఈ భూమిపై ఎంతోమంది ఉన్నారు. వారంతా కూడా కేవలం మనుషులే. జంతువులేవి కూడా తనకొచ్చిన కష్టాన్ని చూసి పొరలి పొరలి ఏడవవు. తలుచుకొని తలుచుకొని కుమిలి పోవు. ఆ క్షణాన్ని అక్కడే వదిలేసి ముందడుగు వేస్తాయి. జీవితంలో మరిన్ని మజిలీలను వెతుక్కుని ముందుకు సాగుతాయి. కానీ మనిషి మాత్రం కష్టం రాగానే అక్కడే ఆగిపోతాడు. కుమిలి కుమిలి ఏడుస్తూ ముందడుగు వేయడు.

ఎందుకీ జీవితం?

ఒక ఊరిలో ఒంటరిగా జీవిస్తున్న రాము అనే యువకుడు ఉన్నాడు. అతడికి ప్రతిరోజూ అడవిలోకి వెళ్లడం అలవాటు. అక్కడ ఉన్న చెట్లను, జంతువులను, పక్షులను చూసి చాలా ఆనందపడేవారు. అవి కలిసిమెలిసి జీవించడం అతనికి నచ్చేది. తనకి చిన్న కష్టం వచ్చినా కూడా చూసేవారు లేరని తెగ బాధపడేవాడు. అదే ఏ పక్షిగానో, జంతువుగానో పుడితే బాగుండేమో అనుకునేవాడు. అడవిలో అన్ని జీవులతో కలిసి హాయిగా జీవించవచ్చని భావించేవాడు. ఒకరోజు ఆయనకి ఆరోగ్యం పాడైంది. కనీసం లేవలేకపోయాడు. ఆ క్షణంలో జీవితం పైనే విరక్తి వచ్చింది. ఎందుకీ బతుకు? అడివిలో ఏ జంతువుగా మారినా బాగుణ్ను.. అనుకున్నాడు.

అలా అనుకున్నాడో లేదో చిన్న మొక్కలా మారిపోయాడు. తనను తాను మొక్కలా చూసి మురిసిపోయాడు. గాలికి ఇటూ అటూ ఊగుతూ ఉంటే ఆనందపడ్డాడు. ఈలోపు ఎక్కడినుంచి వచ్చిందో ఏనుగుల గుంపు వచ్చి ఆ మొక్కను తొక్కుకుంటూ పోయింది. ఆ క్షణం రాము మళ్ళీ అనుకున్నాడు. మొక్కల కన్నా అలా చెంగుచెంగున ఎగిరే ఏ కుందేలుగానో మారితే బాగుండు అని.

అలా అనుకున్నాడో లేదో అప్పుడే కుందేలులా మారిపోయాడు. తనకు నచ్చినట్టు అడవిలో గెంతులు వేశాడు. ఈ లోపు ఒక గుంట నక్క అటుగా వచ్చింది. కుందేలును తరమడం మొదలుపెట్టింది. బతుకు జీవుడా అని పరుగెందుకుంది. ఈ లోపు మరో కుందేలు నక్కకు దొరికిపోయింది. దాన్ని చూసి భయంతో వణికి పోయాడు రాము. ఈ కుందేలు రూపం వద్దు బాబోయ్ చక్కగా పెద్ద చెట్టుగా మారితే బాగుండు, అందరూ తనకిందే వచ్చి నిల్చుంటారు అనుకున్నాడు.

అలా అనుకున్నాడో లేదో చెట్టుగా మారాడు. ఓ రోజు పెద్ద గాలి వాన వచ్చి చెట్టు పటపట విరిగిపోయింది. అంతే చెట్టు రూపంలో ఉన్న రాజుకు ఒక్కసారిగా పిడుగు పైన పడినట్టు అనిపించింది. ఆ వెంటనే ఏ గాలిలో తిరిగే పక్షిగానో మారితే సమస్య ఉండదు కదా అనుకున్నాడు.

ఇలా కోరుకున్నాడో లేదో అలా పక్షిగా అయిపోయాడు. ఒక చెట్టుపై గూడు కట్టుకొని పక్షి పిల్లలతో ఆనందంగా ఉన్నాడు. నాలుగు రోజులు సంతోషంగా ఉన్నాడు. ఈలోపు కింద నుంచి ఓ పాము చెట్టుపైకి పాక్కుంటూ వచ్చి ఆ గుడ్లను మింగేసింది. అలాగే ఓ గ్రద్ధ వచ్చి పక్షి రూపంలో ఉన్న రాజును తన్నుకు పోవడానికి చూసింది. వెంటనే గజగజ వణికి పోయాడు. ఈ పక్షిరూపం నాకొద్దు... ఏ జీవిగా మారినా ఏదో ఒక కష్టం వెంటాడుతూనే ఉంది, మనిషిగా ఉంటేనే మంచిదేమో అని అనుకున్నాడు.

ఎవరికి లేవు కష్టాలు?

చివరికి మనిషిగా మారాడు రాము. కష్టాలు ప్రతి జీవికి ఉంటాయని మొక్క నుంచి మాను వరకు చీమ నుంచి ఏనుగు వరకు అన్నింటికీ వాటి స్థాయిలో ఇబ్బందులు, ఆపదలు వస్తూనే ఉంటాయని అర్థం చేసుకున్నాడు. జంతువులు అడవిలో ప్రతిరోజు ప్రాణ పోరాటాన్ని చేస్తాయని తెలిసింది. తన జీవితంలో కూడా తాను పోరాడాల్సిందేనని నిర్ణయించుకున్నాడు.

ఇది రాము గురించి మాత్రమే కాదు చిన్న కష్టానికి తెగ బాధపడే అందరికీ వర్తిస్తుంది. దూరపు కుండలు నునుపు... అలాగే ఒకరి జీవితంలోకి వెళ్లి కొన్ని రోజులపాటు అలా జీవిస్తేనే వారి కష్టాలు అర్థం అవుతాయి. దూరం నుంచి చూస్తే వారు ఆనందంగా ఉన్నారు అనుకుంటారు. సెలబ్రిటీలను, కోటీశ్వరులను చూసి కూడా అలాగే భావిస్తారు. కానీ ఎవరికి ఇవ్వాల్సిన కష్టాలను, సమస్యలను దేవుడు వారికి ఇస్తూనే ఉంటాడు. మనిషిగా జీవించాలంటే వాటిని తట్టుకొని ముందుకు సాగాల్సిందే.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం