వేసవిలో కొండ ప్రాంతాలకు వెళ్లాలని ఎంతోమంది కోరుకుంటారు. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో చాలా చల్లగా ఉంటుంది. అందుకే హిల్ స్టేషన్లను ఎంపిక చేసుకుంటారు. ఎంతోమంది తమిళనాడు, కర్ణాటకలోని హిల్ స్టేషన్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. నిజానికి తెలుగు రాష్ట్రాల వారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏపీలోనే ఎన్నో అందమైన హిల్స్ స్టేషన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్న కొండ ప్రాంతాలు గురించి ఇక్కడ ఇచ్చాము. వీటికి వెళ్తే మీకు ఖర్చు చాలా తక్కువ అవుతుంది. పైగా ప్రకృతి సౌందర్యం పచ్చదనం ఆహ్లాదాన్ని కూడా అందిస్తాయి.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది హార్స్లీ హిల్స్. ఇది ఒక అద్భుతమైన హిల్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఊటీ ఆఫ్ ఆంధ్ర అని కూడా పిలుచుకుంటారు. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఈ హార్స్లీ హిల్స్ ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. దీని ప్రకృతి అందానికి ఎవరైనా ముగ్ధులవుతారు. ఇక్కడ ట్రెక్కింగ్ తో పాటు క్యాంపింగ్ కూడా చేయొచ్చు. చుట్టూ పచ్చదనంతో కప్పిన కొండలు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఇక్కడ ఉండే సరస్సు కూడా ఎంతో అందంగా ఉంటుంది.
విశాఖపట్నంలో ఉన్న అరకులోయ ఎంతో ప్రసిద్ధమైనది. ఇది సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టూ కాఫీ తోటలు, గిరిజన మనుషులు, పచ్చని లోయలు చూసేందుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ దగ్గరలో కటికి జలపాతాలు, బొర్రా గుహలు కచ్చితంగా చూడాల్సిన ప్రాంతాలు.
ఇదొక ప్రశాంతమైన అందమైన హిల్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ హిల్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి. దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుచుకుంటారు. ఎర్రటి ఎండల్లో కూడా లంబసింగిలో చలేస్తుంది. ఇక్కడి పచ్చటి కొండలు, ప్రశాంతమైన వాతావరణం.. దీన్ని అద్భుతమైన కొండ ప్రాంతంగా మార్చాయి. శీతాకాలంలో మంచు కురిసే ఏకైక ప్రదేశం ఇదే. ఇది విశాఖలోని ఒక చిన్న గ్రామం, ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఇప్పుడిప్పుడే మారుతుంది.
అనంతగిరి కొండలు విశాఖపట్నం నుండి తొంబై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యానికి ఉదాహరణ. దట్టమైన అడవుల మధ్యలో కాఫీ తోటలతో చిన్న నదులతో అనంతగిరి కొండలు అద్భుతంగా కనిపిస్తాయి. మీరు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్, క్యాంపింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.
గోదావరి ఒడ్డున ఉన్న కొండ ప్రాంతం పాపికొండలు. ఇది తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించి ఉంటాయి. మీరు ఇక్కడ బోటింగ్ ను ఎంతో ఆస్వాదించవచ్చు. రెండు కొండల మధ్యగా సాగుతున్న నదిలో ఈ బోటింగ్ మరిచిపోలేని అనుభూతులను ఇస్తుంది.