పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతడు ఎంతో తెలివైనవాడు. ప్రతి సంవత్సరం తన రాజ్యాన్ని కాపాడేందుకు సమర్థవంతమైన, తెలివైన, శక్తి ఉన్న సైనికులను ఎంపిక చేసుకునేవాడు. ఆ ఎంపిక ప్రక్రియలో అతను ఏనాడు విఫలం కాలేదు. మంచివారిని తెలివిగా ఎంపిక చేసుకునేవాడు. ప్రతి ఏటా సైనికులు ఎంపిక ప్రక్రియ కోసం యువకులు ఎదురుచూసేవారు. ఎందుకంటే ప్రతి ఏటా కొత్త కొత్త పరీక్షలు పెట్టడం ద్వారా సైనికులను ఎంపిక చేసుకునేవాడు. రాజు ప్రతి సంవత్సరం ఏ పరీక్ష పెడతారా? అని ప్రజలు ఎదురుచూస్తూ ఉండేవారు.
అలాగే యువకులకు పరీక్షాకాలం వచ్చేసింది. ఆ రాజు సైన్యంలోకి యువకులను తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ప్రతి ఊరులో కూడా పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పాడు. అలా పోటీల్లో గెలిచిన వారిని ఎంపిక చేసుకొని తగిన శిక్షణ ఇచ్చి తమ సైన్యంలో చేర్చుకుంటామని చెప్పాడు. అలాగే ఆకర్షణీయమైన జీతభత్యాలు కూడా ఇస్తామని ప్రకటించాడు. ఆ జీతభత్యాలకు ఎంతో మంది యువకులు ఆకర్షితులయ్యారు. ఎలాగైనా సైనిక ఉద్యోగం సంపాదించాలని అనుకున్నారు. అతను ఊరూరా తిరుగుతూ కొత్త కొత్త పరీక్షలు పెడుతూ ఉన్నాడు. అలా రామాపురం అనే ఊరికి వచ్చాడు. సైనిక పరీక్షలు జరుగుతున్న ప్రదేశానికి వచ్చి నిలుచున్నాడు. చుట్టూ ప్రజలు చూస్తున్నారు. యువకులు తమకు ఎలాంటి పరీక్ష ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు.
రాజు ఆజ్ఞ ఇవ్వగానే ఓ పదిమంది ఒక పెద్ద రాయిని మోసుకొచ్చి మైదానం మధ్యలో పెట్టారు. రాజు యువకులతో మాట్లాడుతూ ‘ఈ రాయిని మీరు మోయగలిగితే మీకు ఖచ్చితంగా సైనిక ఉద్యోగం ఇస్తాను’ అని ప్రకటించాడు.
దాదాపు 50 మంది యువకులు సైనిక ఉద్యోగాల కోసం వచ్చారు. వారిలో ఎంతోమంది ఈ బండను ఎవరు ఎత్తగలరు అంటూ మాట్లాడుకున్నారు. వారిలో 40 మంది ఆ రాయిని ఎత్తడం అసాధ్యమని చెప్పి ప్రయత్నం చేయకుండా వెనక్కి ఉండిపోయారు. మిగతా పదిమంది మాత్రం రాయి దగ్గరకు వచ్చి కదపడానికి ప్రయత్నించారు. వారు అలా రాయి ఎత్తడానికి ప్రయత్నించినప్పుడల్లా చుట్టూ ఉన్నవారు పకపక నవ్వేవారు. ఆ పదిమంది రాయిని ఎత్తడానికి ప్రయత్నించి విఫలమై వెనక్కి వెళ్ళిపోయారు.
ఎవరూ రాయిని ఎత్తలేదు. కనుక ఎవరినీ సైనికులుగా ఎంపిక చేయరని ఆ ఊరిలో ప్రజలంతా అనుకున్నారు. కానీ రాజు రాయిని ఎత్తడానికి ప్రయత్నించిన పదిమందిని సైనిక శిక్షణ కోసం ఎంపిక చేసినట్టు ప్రకటించారు. దీంతో ప్రయత్నం కూడా చేయని ఆ 40 మంది యువకులు రాజుని ప్రశ్నించారు. ‘బండను ఎత్తిన వారికి మాత్రమే మీరు సైన్యంలో చేర్చుకుంటామని చెప్పారు. కానీ వీరు ఎత్తడానికి ప్రయత్నించి విఫలమైనారు. వారిని ఎలా చేర్చుకుంటారు?’ అని అడిగారు.
అప్పుడు రాజు ‘బండను ఎత్తలేమని ఇక్కడున్న అందరికీ తెలుసు. మీరు మొదటే చేతులెత్తేశారు. కానీ వీరు తమవల్ల కాదని తెలిసి కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే చాలా ముఖ్యం. అందుకే వీరిని నేను ఎంపిక చేసుకుంటున్నాను. వారు ఓడిపోతామని తెలిసికూడా ప్రయత్నించారు. ఓటమి భయం వారిని ఆపలేకపోయింది. కానీ మీరు ఓడిపోతామని ప్రయత్నమే చేయకుండా ఆగిపోయారు. నాకు ఓటమి ఎదురవుతున్నా భయపడని ఇలాంటి యువకులే కావాలి’ అంటూ ఆ పది మందిని తమతో పాటు తీసుకువెళ్లాడు.
ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని... మీరు కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం ప్రయత్నం ఆపకూడదు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కానీ ప్రయత్నం చేయడంలోనే ఓడిపోకూడదు. గెలుపుకు ప్రయత్నమే మొదటి మెట్టు. సుత్తితో ఒక్క దెబ్బ వేస్తే బండరాయి ముక్కలైపోదు. దెబ్బ వెనుక దెబ్బ వేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే విజయం దక్కేది.
సంబంధిత కథనం