మీ పిల్లలంటే మీకెంత ఇష్టం ఉన్నా.. ఈ విషయాల్లో మాత్రం వారిని సపోర్టు చేయకండి-no matter how much you love your children dont support them in these matters ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ పిల్లలంటే మీకెంత ఇష్టం ఉన్నా.. ఈ విషయాల్లో మాత్రం వారిని సపోర్టు చేయకండి

మీ పిల్లలంటే మీకెంత ఇష్టం ఉన్నా.. ఈ విషయాల్లో మాత్రం వారిని సపోర్టు చేయకండి

Haritha Chappa HT Telugu

తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమ, మద్దతు ఇవ్వడం ఎంతో అవసరం. అలాగే తప్పు చేసినప్పుడు అతన్ని ఆపడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. తప్పుడు విషయాలలో పిల్లలను సపోర్ట్ చేస్తుంటే, భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపపడవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.

పేరెంటింగ్ టిప్స్ (Pixabay)

పిల్లల భవిష్యత్తు వారి బాల్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వారిలో అనేక అలవాట్లకు బాల్యంలోనే పునాది పడుతుంది. మంచి అలవాట్లను పిల్లలు నేర్చుకునేలా చేయడంలో తల్లిదండ్రులదే ముఖ్యమైన పాత్ర. పిల్లలకు తప్పొప్పుల మధ్య వ్యత్యాసాన్ని బోధించడం తల్లిదండ్రుల బాధ్యత.

పిల్లలకు అవసరమైనప్పుడు వారికి మానసిక మద్దతు తల్లిదండ్రులు ఇవ్వాలి. అలాగే వారు తప్పు చేసినప్పుడు వారిని అడ్డుకోవడం కూడా చాలా ముఖ్యం. పిల్లలకు ప్రేమ, మద్దతును ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తల్లిదండ్రులు తెలుసుకోవాలి.

పిల్లలకు సరైన మార్గాన్ని చూపడానికి ఒక సరిహద్దును నిర్ణయించడం చాలా ముఖ్యం. లేకపోతే కొన్ని అలవాట్లు పెద్దయ్యాక వారి భవిష్యత్తుకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక్కడ మేము అటువంటి కొన్ని అలవాట్ల గురించి చెప్పాము. మీ పిల్లలకు ఇలాంటి అలవాట్లు ఉంటే వారి చేత మానిపించండి.

ప్రతిదాన్ని ఒప్పుకోకండి

పిల్లలు తమకు నచ్చినవి కొనిపించడం కోసం పట్టుబడతారు. వారి అల్లరి ఆపడానికి తల్లిదండ్రులు వారు అడిగినవన్నీ అంగీకరిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది బాగానే ఉంటుంది… ఇదే కొనసాగితే పిల్లలు మొండిగా మారతారు. ఈ అలవాటు భవిష్యత్తులో పిల్లల్లో ప్రవర్తనా లోపానికి కారణం అవుతాయి. పిల్లలు తాము ఏది అడిగినా అవును అనే సమాధానం రావాలని బలంగా కోరుకుంటారు. ఏడవడం ద్వారా తాము కోరుకున్నది పొందవచ్చని వారు భావిస్తారు. అటువంటి పిల్లలు తరువాత మానసికంగా బలహీనంగా, మొండి స్వభావంతో ఎదుగుతారు.

పిల్లల పక్షాన నిలబడటం

మీ బిడ్డకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. కానీ తప్పు ఎవరిదో తెలియకుండా ప్రతిసారీ గుడ్డిగా మీ పిల్లల పక్షాన నిలబడటం మంచిది కాదు. పిల్లవాడు ఎక్కడి నుంచైనా వచ్చి ఉంటే, ఎవరి మీదైనా మీకు ఫిర్యాదు చేస్తే… వెంటనే మీ పిల్లల తరుపున వెళ్లి గొడవపడకండి. ముందు ఇరుపక్షాల మాట వినండి. ఏది సరైనదో దాని వైపు మొగ్గు చూపండి. మీ బిడ్డది తప్పు అనిపిస్తే వెంటనే ఆ విషయాన్ని చెప్పండి. అతడిని అర్థమయ్యేలా వివరించండి. అతడు మంచి వ్యక్తిగా మారతాడు.

తప్పులు దాచి పెట్టద్దు

పిల్లలు భయంతో తమ తప్పులను దాచిపెడతారు. కొన్నిసార్లు ఆ తప్పులను ఇతరులపై తోసేస్తారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇలాంటి విషయాలు పట్టించుకోకపోతే పెద్దయ్యాక కూడా అదే పని చేస్తాడు. పిల్లలు తాము తప్పు చేసిన ఎవరూ ఏమనరు అనే భావనకు వస్తారు. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలు చేసిన తప్పులకు బాధ్యత వహించడం వారికి నేర్పాలి. ఆ తప్పుల నుంచి ఎలా పాఠాలు నేర్చుకోవాలో నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్యం.

ఫోన్లు ఇవ్వకండి

పిల్లల అల్లరి తగ్గించడానికి తల్లిదండ్రులు తరచుగా టీవీ రిమోట్ లేదా స్మార్ట్ ఫోన్ ను వారి చేతుల్లోకి ఇస్తారు. ఈ వ్యవహారంలో కొందరు పిల్లలు రోజంతా ఫోన్ లేదా టీవీలో నిమగ్నమై ఉంటారు. దీని వల్ల వారిలో మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చిన్నవయసు నుంచే మనుషులకు దూరమై ఒక్కోసారి ఫోన్ కు అలవాటు పడిపోతుంటారు. ఇది భవిష్యత్తులో ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది.

పనులు చెప్పండి

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను ఏ పనీ చేయనివ్వరు. వారి దృష్టిలో, పిల్లలను ప్రేమించడం అంటే పిల్లలకు అన్ని పనులను తామే చేసి పెట్టడం అనుకుంటారు. కానీ పిల్లలకు చిన్నప్పటి నుంచే అన్నీ విషయాల్లో అవగాహన కల్పించాలి. అతడి వయసుకు తగ్గట్టు పనులు చెప్పండి. తద్వారా వారు బాధ్యతా భావాన్ని పొందుతారు. పెద్దయ్యాక కూడా వారు సొంతంగా పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంటారు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.