నవరాత్రులు వచ్చాయంటే చాలు... చీరలు, లెహంగాలు, అందమైన సంప్రదాయ ఆభరణాలతో ముస్తాబవ్వడం ఆనవాయితీ. ముఖ్యంగా మనసు దోచుకునే డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల దుస్తులు ధరించి పండుగ వాతావరణానికి మరింత శోభ తేవడం అందరికీ ఇష్టమే. అలాంటి వారికి స్టైలింగ్ ఐడియాలు కావాలంటే... బాలీవుడ్ సెలబ్రిటీలనే కాదు, అంబానీ కుటుంబంలోని మహిళలను కూడా చూడొచ్చు. నీతా అంబానీ, రాధికా మర్చంట్, ఇషా అంబానీ, శ్లోకా మెహతాల సంప్రదాయ దుస్తులు, వాటిలో వారు మెరిసిన తీరు చాలామందికి స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా నవరాత్రి వేడుకల్లో అద్భుతంగా కనిపించడానికి వారు ఎంచుకున్న డ్రెస్సులు, వాటి ప్రత్యేకతలను ఓసారి చూద్దాం.
ఈసారి నవరాత్రికి పక్కా ట్రెడిషనల్ లుక్ కావాలని మీరు భావిస్తే, నీతా అంబానీ ధరించిన 'తోరాణి' లెహంగా మంచి ఎంపిక. దీనిలో ఆమె నిజంగా మెరిసిపోయారు. ప్రకాశవంతమైన రంగులు, అద్భుతమైన డిజైన్‌తో కూడిన ఈ లెహంగా ఖచ్చితంగా మీపై అందరి దృష్టి పడేలా చేస్తుంది. డిజిటల్ ప్రింట్స్, చేతితో చేసిన ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్, బద్లా, బూటా డిజైన్లతో ఈ లెహంగా నిజంగా ఒక కళాఖండం. దీనికి ముత్యాలు, డైమండ్స్ జోడించి ఫెస్టివ్ గ్లామర్‌ను మరింత పెంచారు. మీరు లెహంగాలు కాకుండా చీరలు ధరించాలనుకుంటే, నీతా అంబానీ ధరించిన ఎరుపు రంగు 'ఘర్ చోలా' చీర కూడా ఒక మంచి ఆప్షన్. ఇది సంప్రదాయ హంగులను, ఆధునిక శైలిని కలగలిపి అద్భుతంగా ఉంటుంది. ఈ చీరలోని జరీ వర్క్, సున్నితమైన ఎంబ్రాయిడరీ, సీధా పల్లూ డిజైన్ పండుగకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయి.
రాధికా మర్చంట్ ఫ్యాషన్ స్టైల్ ఎప్పుడూ 'మాగ్జిమలిజం'లా ఉంటుంది. ముఖ్యంగా సంప్రదాయ దుస్తులు ధరించేటప్పుడు ఆమె ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. నవరాత్రులు అంటే ఆమెకు మరింత ఇష్టం. అందుకే, తన పెళ్లికి ముందు జరిగిన గర్భా నైట్ పార్టీలో ఆమె ధరించిన 'తరుణ్ తహిలియాని' డిజైన్ చేసిన 'బంజారా-కుచి' స్టైల్ లెహంగా నవరాత్రికి ఫ్యాషన్ పాఠాలు నేర్పుతుంది. అద్దాల వర్క్, రంగురంగుల దారపు పనులు, సంప్రదాయ డిజైన్లకు ఆధునిక శైలి జోడించి తయారు చేసిన ఈ లెహంగా ఆమెకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. దీనికి తోడు కస్టమ్ యాక్సెసరీలు ఆమె సిగ్నేచర్ స్టైల్‌ను మరింత పెంచాయి. జాదౌ ఆభరణాలు, అల్లిన జుట్టుతో ఉన్న ఈ లుక్ పండుగకు చక్కటి స్ఫూర్తినిస్తుంది. అద్దాల వర్క్ అంటే మీకు ఇష్టమైతే, ఆమె ధరించిన మరొక నీలం రంగు లెహంగా కూడా మంచి ఎంపిక. దీనిపై తెలుపు రంగు ఎంబ్రాయిడరీ, అద్దాల వర్క్ కలగలిపి చాలా అందంగా, ఫెస్టివ్ లుక్‌లో ఉంటుంది.
మీరు లెహంగాలు, చీరలకు భిన్నంగా ప్రయత్నించాలనుకుంటే, ఇషా అంబానీ ధరించిన 'తోరాణి' కస్టమ్ స్కర్ట్-అండ్-టాప్ సెట్ మీకు మంచి స్టైల్ ఐడియా ఇస్తుంది. దీనిలో టాప్ లేటెస్ట్ డిజైన్‌తో, టస్సెల్ ఎంబ్రాయిడరీతో, హాఫ్టర్ నెక్‌లైన్‌తో చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి సరిపోయేలా ఉన్న సిల్క్ స్కర్ట్, రంగురంగుల ప్యానెల్స్, హృదయాకారంలో సీక్విన్స్, సున్నితమైన థ్రెడ్ వర్క్‌తో ఒక 'వేరబుల్ ఆర్ట్'లా కనిపిస్తుంది. కొద్దిపాటి రంగులు ఇష్టపడే వారికి ఇషా అంబానీ ధరించిన 'అబూ జానీ సందీప్ ఖోస్లా' లెహంగా చాలా బాగుంటుంది. థ్రెడ్, మిర్రర్ వర్క్, సిల్వర్, డైమండ్ ఆభరణాలతో, కొద్దిపాటి మేకప్‌తో ఆమె పండుగకు పర్ఫెక్ట్ లుక్‌లో కనిపిస్తారు.
అంబానీ కుటుంబపు పెద్ద కోడలు శ్లోకా మెహతాకు సంప్రదాయ దుస్తుల్లో ఎలా మెరిసిపోవాలో బాగా తెలుసు. ఆమె గుజరాతీ స్టైల్‌లో ధరించిన 'అబూ జానీ సందీప్ ఖోస్లా' లెహంగా నవరాత్రి వేడుకలకు పక్కాగా సరిపోతుంది. రాయల్ బ్లూ రంగులో ఉన్న ఈ లెహంగాపై రంగురంగుల రేషం ఎంబ్రాయిడరీ, అద్దాలు, స్టోన్స్ ఉంటాయి. ఆమె కదిలినప్పుడల్లా అవి మెరుస్తూ కళ్లు జిగేల్ మంటాయి. ఈ లెహంగాకు సరిపోయేలా 'తోరన్'ను, పచ్చని ఎమరాల్డ్ ఆభరణాలను ధరించి, శ్లోకా మెహతా మనందరికీ మంచి ఫ్యాషన్ ఇన్స్పిరేషన్‌ను ఇస్తారు.