భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ (C-SUV) విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇవ్వడానికి నిస్సాన్ సిద్ధమైంది. నిస్సాన్ మోటార్ ఇండియా తమ రాబోయే కొత్త ఎస్‌యూవీ పేరును అధికారికంగా ప్రకటించింది. దీని పేరు ఆల్-న్యూ నిస్సాన్ టెక్టాన్ (All-New Nissan Tekton). ఈ కారు 2026లో భారత మార్కెట్లో విక్రయానికి రానుంది.
నిస్సాన్ 'వన్ కార్, వన్ వరల్డ్' (One Car, One World) వ్యూహంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ టెక్టాన్‌ను చెన్నైలోని నిస్సాన్ ప్లాంట్‌లో రెనాల్ట్‌తో భాగస్వామ్యం ద్వారా తయారు చేయనున్నారు. ఇది దేశీయ విక్రయాలతో పాటు ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి అవుతుంది.
'టెక్టాన్' అనే పేరు గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్థం 'శిల్పకారుడు' లేదా 'ఆర్కిటెక్ట్'. ఇంజనీరింగ్ ఖచ్చితత్వం, విలక్షణమైన డిజైన్‌తో కూడిన ప్రీమియం సి-సెగ్మెంట్ ఎస్‌యూవీని అందించాలనే తమ లక్ష్యాన్ని ఈ పేరు సూచిస్తుందని నిస్సాన్ తెలిపింది.
హ్యుందాయ్ క్రెటా సెగ్మెంట్‌లోని కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ.. ఈ కారును పోటీ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. టెక్టాన్‌కు పోటీగా కియా సెల్టోస్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, టాటా నెక్సాన్ వంటి మోడళ్లు ఉన్నాయి.
టెక్టాన్ డిజైన్, నిస్సాన్ యొక్క పెద్ద, లెజెండరీ ఎస్‌యూవీ అయిన 'పట్రోల్' (Patrol) నుంచి ప్రేరణ పొందినట్లు కంపెనీ వెల్లడించింది. తొలి విజువల్స్ చూస్తే... టెక్టాన్ దృఢంగా, మస్కులర్ సిల్హౌట్‌తో కనిపిస్తోంది.
శక్తివంతంగా చెక్కిన బోనెట్, 'C' ఆకారంలో ఉండే హెడ్‌ల్యాంప్ సిగ్నేచర్, రోబస్ట్ (దృఢమైన) దిగువ బంపర్ ముందు భాగానికి కమాండింగ్ లుక్‌ను ఇస్తున్నాయి. దీన్ని 'ఆకట్టుకునే', కండరాల నిర్మాణంతో కూడినదిగా కంపెనీ అభివర్ణించింది.
ముందు డోర్‌లపై 'డబుల్-సి' (Double-C) యాక్సెంట్ ఉంది. ఇది హిమాలయాల పర్వత శ్రేణి నమూనాను సూచిస్తుందని నిస్సాన్ తెలిపింది.
వెనుక భాగంలో.. 'C' ఆకారపు టెయిల్ ల్యాంప్‌లను కలుపుతూ నిరంతరాయంగా వెలిగే లైట్ బార్ ఉంది. టెయిల్‌గేట్‌పై 'టెక్టాన్' పేరు స్పష్టంగా హైలైట్ అయింది.
"ఆల్-న్యూ నిస్సాన్ టెక్టాన్ మా లెజెండరీ నిస్సాన్ పట్రోల్ నుండి డిజైన్ ప్రేరణ పొందింది. ఇది నేటి ఆధునిక భారతీయ వినియోగదారుడు కోరుకునే ప్రతిదాన్నీ అందించడానికి, మార్కెట్‌ను శాసించడానికి రూపొందించింది" అని నిస్సాన్ మోటార్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అల్ఫోన్సో అల్బైసా తెలిపారు.
టెక్టాన్‌ను రెనాల్ట్ భాగస్వామ్యంతో నిస్సాన్ చెన్నై ప్లాంట్‌లో తయారు చేస్తారు. ఇది భారత మార్కెట్‌తో పాటు ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంది. ఎగుమతి గమ్యస్థానాలను త్వరలో ప్రకటిస్తారు.
కొత్త మోడల్ లాంచ్‌కు మద్దతుగా నిస్సాన్ ఇండియాలో తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తోంది. నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ.. టెక్టాన్ నిస్సాన్ 'పునరుజ్జీవన కథ' (resurgence story)లో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. "దృఢమైన, శుద్ధమైన C-ఎస్‌యూవీని కోరుకునే కొనుగోలుదారులను ఇది ఆకట్టుకుంటుందని మేం నమ్ముతున్నాం" అని పేర్కొన్నారు.
టాపిక్