Night Shift Side Effects: నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తున్న వారు జాగ్రత్త, మీరు త్వరగా లావు అయిపోతారట, ఎందుకంటే...
Night Shift Side Effects: ఒకప్పుడు ఉదయం చేసే ఉద్యోగాలు మాత్రమే ఉండేవి. ఎప్పుడైతే ఇంటర్నెట్ యుగం మొదలైందో నైట్ షిఫ్ట్‌లు కూడా ఎక్కువైపోయాయి. అయితే రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.
Night Shift Side Effects: మనదేశంలో ఎక్కువగా విదేశీ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులు నడుస్తాయి. అందుకే సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఎక్కువగా రాత్రి శక్తుల్లో కూడా పనిచేయాల్సి వస్తుంది. ఎవరైతే రాత్రి షిఫ్టుల్లో దీర్ఘకాలంగా పనిచేస్తారో వారిపై ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల చేసిన అధ్యయనాల ప్రకారం రాత్రిపూట పనిచేయడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని... అలాగే ఊబకాయం కూడా వస్తుందని చెప్పాయి. కాబట్టి రాత్రి షిఫ్టులో పనిచేస్తున్న వారు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఈ రోగాలు వచ్చే అవకాశం
శరీరానికి సిర్కాడియన్ రిథమ్ ఉంటుంది. అంటే అది ప్రతిరోజూ నిద్రపోయే సమయం, మేల్కొనే సమయం ఆటోమేటిక్‌గా సెట్ చేసుకుంటుంది. ఇదొక సహజ అంతర్గత గడియారం. జీవక్రియ ఆరోగ్యంగా ఉండడానికి ఈ సిర్కాడియన్ రిథమ్ చాలా ముఖ్యం. అయితే రాత్రి షిఫ్ట్ లో పనిచేసే వారికి ఈ సిర్కాడియన్ రిథమ్ అంతరాయం కలుగుతుంది. దీనివల్ల నిద్రపట్టే సమయాలు, ఆహారం తినే సమయాలు... అన్నింటి విషయంలో శరీరంలోని అంతర్గత గడియారం కన్ఫ్యూజ్ అవుతుంది. దీనివల్ల జీవక్రియ ఆరోగ్యంగా సాగదు. ఇవన్నీ ఆరోగ్యానికి అవాంతరాలుగా మారుతాయి. జీవక్రియ, హార్మోన్ నియంత్రణ వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనివల్ల టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. నాణ్యమైన నిద్ర లభించదు. దీనివల్ల శరీరం ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటుంది. గ్లూకోజ్ సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేక రక్తంలో అధికంగా పేరుకు పోతుంది. దీనివల్లనే టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.
నైట్ షిఫ్ట్‌లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. వారు అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకూడదు. ఇవి జీవక్రియ ప్రక్రియలను దెబ్బతీస్తాయి. అలాగే బరువు పెరిగేలా చేస్తాయి. రాత్రిపూట నిద్ర లేకపోతే... ఉదయం సమయంలో ఎంత నిద్రపోయినా కూడా శరీరానికి సరిపోదు. దీనివల్ల గ్రెలిన్, లెప్టిన్.. వంటి ఆకలి హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఎంత తిన్నా కూడా తృప్తిగా అనిపించదు. దీనివల్ల అధిక కేలరీల ఆహారం తినాలనిపిస్తుంది. ఇది కూడా ఊబకాయం రావడానికి ఒక సమస్య.
నైట్ షిఫ్ట్‌లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారు ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాదు మానసిక ఆరోగ్య సవాళ్లు వారికి అధికంగానే ఎదురవుతాయి. ఒంటరితనం, నిరాశ, మానసిక సమస్యలు వారిలో వస్తాయి. అనారోగ్య ఆహారపు అలవాట్లు కూడా దానికి తోడైతే శారీరక, ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతాయి. వీరు షిఫ్టును మార్చుకునే అవకాశం తక్కువే. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సెలవు దినాల్లో మాత్రం ఖచ్చితంగా రాత్రిపూట నిద్రపోవడానికి ప్రయత్నించడమే మంచిది. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలను, చక్కెర కొవ్వులేని ఆహారాలను తినడం చాలా ముఖ్యం.