New Year Food: న్యూ ఇయర్ రోజున పొడవాటి నూడల్స్ తప్పకుండా తినాలట.. ఎందుకో తెలుసా?-new years foods that are meant to bring good luck and health in the year ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Food: న్యూ ఇయర్ రోజున పొడవాటి నూడల్స్ తప్పకుండా తినాలట.. ఎందుకో తెలుసా?

New Year Food: న్యూ ఇయర్ రోజున పొడవాటి నూడల్స్ తప్పకుండా తినాలట.. ఎందుకో తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Dec 30, 2024 12:30 PM IST

New Year Food: న్యూ ఇయర్ అంటే కేవలం విషెస్, పార్టీలు మాత్రమే కాకుండా ఫుడ్‌తో ముడిపడి ఉన్న అనేక సంప్రదాయాలు ఉన్నాయి. చాలా దేశాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను తినడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున వీటిని తినడం వల్ల ఏడాది పొడవునా అదృష్టం, ఆరోగ్యం కలిసివస్తాయని నమ్ముతారు.

న్యూ ఇయర్ రోజున పొడవాటి నూడల్స్ తప్పకుండా తినాలట
న్యూ ఇయర్ రోజున పొడవాటి నూడల్స్ తప్పకుండా తినాలట (pixabay)

కొత్త సంవత్సరంలో మొదటి రోజు చాలా ప్రత్యేకం. ఈ రోజు ఎలా మొదలవుతుందో, సంవత్సరం మొత్తం కూడా అలాగే గడుస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ప్రజలు ఈ రోజును వీలైనంత ప్రత్యేకంగా, సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. న్యూ ఇయర్ పార్టీలు, విషెస్ వంటి విషయాల మాదిరిగానే, ఈ రోజుకు సంబంధించిన ఆహారం కూడా చాలా ప్రత్యేకమైనదని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి. వీటి ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున తప్పకుండా ఇంట్లో కొన్ని వంటకాలను చేసుకుని తినాలి. ఈ రోజున వీటిని తినడం వల్ల ఏడాది అంతా అదృష్టం, ఆరోగ్యం కలిసివస్తాయని నమ్మిక. న్యూ ఇయర్ రోజున తప్పకుండా తినాల్సిన సంప్రదాయక ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..

yearly horoscope entry point

ఆకుకూరలు:

న్యూ ఇయర్ సందర్భంగా ఆకుకూరలు తినడం కూడా చాలా మంచిదని భావిస్తారు. ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యం, శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. న్యూ ఇయర్ రోజున ఆకుకూరలతో కూర, సూప్, సలాడ్ వంటి ఏదైనా ఒక వంటకం తినడం వల్ల సంవత్సరం పొడవునా చాలా అదృష్టం లభిస్తుందని చెబుతారు.

కాలే, క్యాబేజీ:

అమెరికాలో న్యూ ఇయర్ సందర్భంగా కాలేను ఉడకబెట్టి తింటారు. ఈ రోజున ఎక్కువ ఆకుపచ్చ కూరగాయలను తినడం అంటే సంవత్సరం పొడవునా ఆరోగ్యకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడపుతారని అమెరికా ప్రజల విశ్వాసం. తూర్పు ఐరోపాలో క్యాబేజీ ముఖ్యంగా ఆర్థిక అదృష్టాన్ని సూచిస్తుందని కొత్త సంవత్సరం రోజున తప్పకుండా తింటార

చేపలు:

కొన్ని సంప్రదాయాల ప్రకారం న్యూ ఇయర్ రోజున చేపలు తప్పనిసరిగా తినాలి. వెండి రంగు సంపదను సూచిస్తుంది. కనుక ఈ రోజున వెండి రంగులో ఉండే చేపలను తినడం వల్ల సంవత్సరం అంతా సంపదను ఆహ్వానించవచ్చని నమ్మిక.

పరవన్నం:

హిందూ మతంలో బియ్యం చాలా పవిత్రమైనవి భావిస్తారు. రకరకాల ప్రతికూల శక్తులను పారద్రోలే శక్తి బియ్యానికి ఉంటుందని వారి నమ్మిక. అందుకే ఏదైనా పండుగలు లేదా ప్రత్యేకమైన రోజుల్లో బియ్యంతో ఖీర్ లేదా పరవన్నం వంటి ఆహారాలను ఖచ్చితంగా తినాలని చెబుతారు. బియ్యంతో చేసిన ఏదైనా ప్రత్యేక వంటకంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం వల్ల ఏడాదంతా ప్రతికూల శక్తులకు దూరంగా ఉండచ్చని విశ్వాసం.

స్వీడన్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో కూడా న్యూ ఇయర్ సందర్భంగా రైస్ పుడ్ తప్పనిసరిగా తింటారు. ఇది రాబోయే సంవత్సరంలో మంచిని, ధనాని ఆకర్షిస్తుందని నమ్ముతారు.

నూడుల్స్:

చాలా దేశాల్లో న్యూ ఇయర్ సందర్భంగా నూడుల్స్ తినే సంప్రదాయం కూడా ఉంది. ముఖ్యంగా చైనా, జపాన్ వంటి అనేక ఆసియా దేశాల్లో ఈ రోజున కచ్చితంగా నూడుల్స్ వండుకుని తింటారు. పొడవాటి నూడుల్స్ దీర్ఘాయుష్షుకు చిహ్నమని న్యూ ఇయర్ రోజున నూడుల్స్ తినడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాకపోతే ఒక షరతు కూడా ఉందట.. నూడుల్స్ మొత్తం నోట్లోకి వెళ్లాకే నమిలి తినలాట. మధ్యలోనే దంతాలతో కొరకకూడదట. ఇలా చేయడం వల్ల మన ఆయుష్షుకు మనమే ఆటంకం కలిగించిన వారమవుతామని కొందరు నమ్ముతారు.

పండ్లు:

ఫిలిప్పీన్స్‌లో, నూతన సంవత్సరానికి 13 రకాల పండ్లను తినడం ఆచారం. పండ్లు సంతానానికి, అదృష్టానికి సూచికనీ న్యూ ఇయర్ మొదటి రోజున వీటిని తినడం వల్ల ఏడాదంతా అదృష్ట కలిసివస్తుందని నమ్ముతారు.

కేక్ లేదా స్వీట్ :

పుట్టినరోజు లేదా వార్షికోత్సవం వంటి ఏదైనా ప్రత్యేక సందర్భాలు కేక్ లేకుండా పూర్తిగా అసంపూర్ణం. అమెరికా నుంచి గ్రీస్ వరకు చాలా దేశాల్లో నూతన సంవత్సర వేడుకల్లో కేక్ తినే సంప్రదాయం ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా కేక్ ముక్క తినేవారికి జీవితంలో మంచి లక్ వస్తుందని నమ్ముతారు.

Whats_app_banner