క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల జారీలో RBI కొత్త నిబంధనలు.. అలా చేస్తే జరిమానా తప్పదు!-new credit debit card rules for online payments from next month ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  New Credit, Debit Card Rules For Online Payments From Next Month

క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల జారీలో RBI కొత్త నిబంధనలు.. అలా చేస్తే జరిమానా తప్పదు!

HT Telugu Desk HT Telugu
Apr 21, 2022 11:20 PM IST

డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించి ఆర్‌బిఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది, ప్రస్తుత మార్గదర్శకాలలో మార్పులు చేసింది.

Debit Card
Debit Card

బ్యాంక్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సి) ప్రస్తుత మార్గదర్శకాలను సమూలంగా మారుస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. కొత్త మార్గదర్శకాలు జూలై 01, 2022 నుండి వర్తిస్తాయని ఆర్‌బిఐ తన ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాలను పాటించని పక్షంలో బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలపై విధించే జరిమానాలను కూడా ఆర్‌బిఐ వెల్లడించింది. కస్టమర్ల అనుమతి లేకుండా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను జారీ చేయడం లేదా అప్‌గ్రేడ్ చేస్తే బ్యాంకులపై ఆర్‌బిఐ నూతన మార్గదర్శకాల ప్రకారంగా పెనాల్టీ విధించబడుతుంది.

బ్యాంకుల వద్ద రూ. 100 కోట్ల నికర విలువ ఉంటే క్రెడిట్ కార్డ్‌లను ఇచ్చేందుకు ఆర్‌బీఐ అనుమతించింది.  స్వంతంగా లేదా  కార్డ్-జారీ చేసే ఇతర బ్యాంకులు లేదా NBFCల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డ్‌లను బ్యాంకులు జారీ చేయవచ్చు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల విషయానికి వస్తే.. RBI రెగ్యులేటర్ నుండి ఆమోదం పొందిన తర్వాత కనీసం 100 కోట్ల రూపాయల నికర విలువ కలిగిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను (UCBs) క్రెడిట్ కార్డ్ జారీ చేయడానికి అనుమతి ఉంటుంది. అంతేకాకుండా UCBలు కోర్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉండాలి. అలాగే, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి UCBలకు అనుమతి లేదని RBI పేర్కొంది.

కనిష్టంగా రూ. 100 కోట్ల నికర విలువ కలిగిన ఎన్‌బిఎఫ్‌సిలు సెంట్రల్ బ్యాంక్ నుండి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాత క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయవచ్చని ఆర్‌బిఐ వెల్లడించింది. "రిజర్వ్ బ్యాంక్ నుండి ముందస్తు అనుమతి పొందకుండా, NBFCలు డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఛార్జ్ కార్డ్‌లు లేదా అలాంటి ప్రోడక్ట్‌లను వాస్తవంగా లేదా భౌతికంగా జారీ చేయవద్దన" అని RBI తెలిపింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్