మీ జ్ఞాపకశక్తి తగ్గి ఇబ్బంది పడుతున్నారా? తాళాలు, పర్సులు వంటి ముఖ్యమైన వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, లేదా ఏ గదిలోకి వెళ్లాలో గుర్తుకు రాక ఆగిపోవడం వంటివి తరచూ జరుగుతున్నాయా? బాధపడకండి. ఇలా మీకు ఒక్కరికే కాదు.. చాలామందికి జరుగుతుంటాయి. ఇందుకు కారణం కేవలం వయసు, ఒత్తిడి మాత్రమే కాదట. మనం రోజూ చేసే కొన్ని ముఖ్యమైన పనులు కూడా అయి ఉండచ్చట.
ప్రముఖ న్యూరోసైంటిస్ట్ రాబర్ట్ W.B. లవ్ మీ జ్ఞాపకశక్తిని నెమ్మదిగా దెబ్బతీసే మూడు అలవాట్లను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.అల్జీమర్స్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడానికి కొన్ని రోజూవారీ అలవాట్లను మార్చుకుంటే చాలని ఆయన చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.
ఉదయాన్నే బెడ్ కాఫీ తాగడం చాలామందికి ఉన్న అలవాటు. "అది తాగగానే రోజంతా చురుగ్గా ఉంటాం" అనుకుంటారు. కానీ మీరు అనుకున్న దానికంటే అది ఎక్కువ హానికరం. మీకు కాఫీ ఎంత ఇష్టమైనా, దాని చెడు ప్రభావాలు లేకుండా ఉండాలంటే సరైన సమయంలో తాగడం చాలా ముఖ్యం.
"కాఫీ అనేది అడినోసిన్ అనే ఒక కెమికల్‌ను అడ్డుకుంటుంది. ఈ అడినోసిన్ మనల్ని నిద్రపోయేలా చేస్తుంది. ఉదయాన్నే మీరు కాఫీ తాగితే, అది అడినోసిన్‌ను బ్లాక్ చేస్తుంది. దీనివల్ల మొదట్లో ఎనర్జీ వచ్చినట్లు అనిపించినా, మధ్యాహ్నం అయ్యేసరికి మీ మెదడు మందగిస్తుంది లేదా బాగా అలసిపోతుంది. అంటే, ఉదయం మీరు వెంటనే కాఫీ తాగితే, మధ్యాహ్నం అలసటను అనుభవించవచ్చు.
మీరు ఉదయం నిద్రలేచిన 90 నుండి 120 నిమిషాల వరకు (అంటే దాదాపు ఒకటిన్నర లేదా రెండు గంటల వరకు) కాఫీ తాగకూడదు. ఎందుకంటే, ఆ సమయంలో మీ శరీరం సహజంగానే మేల్కొంటుంది. కొంచెం సమయం పడుతుంది, కానీ అప్పుడు మీరు జంప్ రోప్ చేయడం, లేదా గుండె వేగాన్ని పెంచే ఏదైనా చిన్నపాటి వ్యాయామం చేయడం, లేదా చల్లటి నీళ్లతో మొహం కడగడం లాంటివి చేస్తే అది మిమ్మల్ని ఇంకా వేగంగా మేల్కొనేలా చేస్తుంది. మీరు నిద్రలేచిన కనీసం 90 నిమిషాల తర్వాత కాఫీ తాగితే, మీకు రోజంతా చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. అంతేకాదు, మీ మెదడు కూడా చాలా బాగా పనిచేస్తుంది."
రాత్రి మధ్యలో వాష్‌రూమ్‌కు వెళ్ళడానికి లేదా నీళ్ళు తాగడానికి లేచినప్పుడు వెంటనే టైం చూడాలి అనిపిస్తుంది లేదా అలారం మోగడానికి ఇంకా ఎన్ని గంటలు మిగిలి ఉన్నాయో అనే ఆలోచనతో ఫోన్ చూడాలనిపించచ్చు. ఇది చాలా సాధారణ అలవాటు అయినప్పటికీ ఈ అలవాటు మీ నిద్రకు లేదా జ్ఞాపకశక్తికి మంచిది కాదు.
రాత్రి మధ్యలో ఫోన్ లేదా గడియారం చూడటం వల్ల అంటే ఫోన్ నుండి వచ్చే ప్రకాశవంతమైన కాంతిని పది సెకన్ల కంటే ఎక్కువసేపు చూస్తే అది మిమ్మల్ని వెంటనే నిద్రలేపేస్తుంది. అప్పుడు మళ్లీ నిద్రపట్టడం కష్టం అవుతుంది.
అంతేకాదు రాత్రి మధ్యలో మేల్కొని సమయం చూసినప్పుడు, 'అయ్యో, ఇంకా ఒక గంట మాత్రమే పడుకున్నామా, కాసేపట్లో లేవాల్సిందేనా అనే ఆలోచన మనలో కలిగి అది మనకు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి వల్ల కూడా నిద్ర పాడవుతుంది.
కాబట్టి, రాత్రి మధ్యలో మేల్కొన్నప్పుడు గడియారం అస్సలు చూడకండి. మీ కళ్ళు మూసుకుని ఉండటమే చాలా మంచిది. పడక మీదే ఉండి, మళ్లీ నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ నిద్ర నాణ్యత నిజంగా మెరుగుపడుతుంది. అంతేకాదు మీ జ్ఞాపకశక్తిని కాపాడటానికి కూడా బాగా సహాయపడుతుంది."
కొన్నిసార్లు కొత్త సిరీస్ లేదా సినిమా చూడాలని లేదా టీవీలో ఏదైనా చూడాలనే కోరిక పుడుతుంది. దీన్ని ఆపుకోవడం కష్టమే కానీ, పడుకునే ముందు గంటల తరబడి టీవీ చూడటం మీ నిద్రను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అంతేకాదు, దీర్ఘకాలంలో ఇది మీ జ్ఞాపకశక్తిని కూడా పాడుచేస్తుంది. ఇవి మాత్రమే కాదు బెడ్‌రూమ్‌లో టీవీ ఉండటం భార్యాభర్తల మధ్య సన్నిహిత సంబంధానికి కూడా మంచిది కాదు.
రాబర్ట్ ఏం చెబుతున్నారంటే "తమ బెడ్‌రూమ్‌లో టీవీ ఉన్న దంపతులు తక్కువ శృంగారంలో పాల్గొంటారు. కాబట్టి టీవీని మీ బెడ్‌రూమ్ నుంచి తీసేయడానికి ఇదొక మంచి కారణం.
రెండవది, మీరు పడుకునే ముందు టీవీ చూడకూడదు. ఎందుకంటే అది మనల్ని చాలా ఉత్సాహపరుస్తుంది, అడ్రినలిన్ అనే హార్మోన్‌ను పెంచుతుంది. ఇది మనల్ని మేల్కొనేలా చేస్తుంది, కాబట్టి నిద్రపోవడానికి ముందు అలా చేయకూడదు.
మూడవది, టీవీ తెరలు, ఫోన్‌లు లేదా కంప్యూటర్లు నీలి కాంతిని విడుదల చేస్తాయి. ఈ కాంతి మన మెదడును ఉత్తేజపరుస్తుంది, మనల్ని నిద్రపుచ్చే మెలటోనిన్ అనే హార్మోన్‌ను తగ్గిస్తుంది. దీనివల్ల మనకు నిద్రపట్టదు. కాబట్టి పడుకునే ముందు స్క్రీన్లను చూడకూడదు.