Natural Skin Care: మెరిసే చర్మం కావాలా? కెమికల్ ప్రొడక్ట్స్‌కి గుడ్ బై చెప్పి, ఈ ఆహారాలు తీసుకోండి చాలు!
Natural Skin Care: అందమైన చర్మం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఆహారంలో చర్మానికి మేలు చేసే పదార్థాలను చేర్చుకోవడం ద్వారా కూడా మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. సహజమైన పద్దతులతో శాశ్వతంగా మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకునేందుకు ఓ లుక్ వేసేయండి మేడమ్!
చర్మం బయట నుండి అందంగా కనిపించాలంటే, దానికి లోపలి నుండి పోషణ అందించడం చాలా ముఖ్యం. అంటే ఆరోగ్యకరమైన చర్మమే అందమైన చర్మం. పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకుంటే మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే ఒకటి రెండు రోజులు మంచి ఆహారాలు తింటే అందంగా కనిపించచ్చు అనేది కేవలం అపోహ మాత్రమే. చర్మాన్ని లోపలి నుండి అందంగా మార్చుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, కొంత ఓపిక కూడా అవసరమని ఆహార నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా కొన్నింటిని తింటేనే శాశ్వతంగా మెరిసే చర్మాన్ని పొందుతారు.

మీరు తినే ఆహారం మీ చర్మంపై ప్రభావం చూపించడానికి ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పట్టవచ్చని గుర్తుంచుకోండి. ఎందుకంటే మన చర్మానికి చాలా పొరలు ఉంటాయి. మనం తీసుకునే ఆహారం ప్రభావం బయటి పొరకు చేరడానికి కొంత సమయం పడుతుంది. అది లోపలి చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా మార్చేందుకు మరింత సమయం పడుతుంది. ఎలాంటి కెమికల్ ప్రోడక్ట్ లను ఉపయోగించకుండా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మీ ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకోండి:
1. చర్మం శుభ్రత కోసం..
ప్రతిరోజూ ఒకసారి అంటే ఉదయం లేవగానే లేదా మధ్యాహ్నం తప్పకుండా నిమ్మరసం నీళ్ళు తాగడం వల్ల మీ చర్మం శుభ్రం అయి కాంతివంతంగా కనిపిస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం నీళ్ళు తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది, లివర్ శుభ్రపడుతుంది. అలాగే చర్మం మెరిసేందుకు సహాయపడే విటమిన్-సి అందుతుంది. నిమ్మరసాన్ని సలాడ్, కూరగాయలు, పప్పు వంటి వాటిలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు.
2. రక్త శుద్ధి కోసం..
చర్మ ఆరోగ్యం అనేది శరీరంలోని రక్త శుద్ధి, రక్త ప్రసరణపై ఆధారపడి ఉంటుంది. చర్మానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా రక్తం ద్వారానే అందుతాయి. మీ శరీరంలో రక్త నాణ్యత ఎంత మెరుగ్గా ఉంటే, మీ చర్మం అంత అందంగా, మచ్చలు లేకుండా మెరుస్తూ కనిపిస్తుంది. రక్త శుద్ధికి బీట్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. కనుక ప్రతిరోజూ క్రమం తప్పకుండా మీ డైట్ లో బీట్‌రూట్‌ను చేర్చుకోండి. సలాడ్, కూరగాయలు లేదా సూప్ రూపంలో దీనిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
3. చర్మానికి తేమ కోసం..
శరీరంలోని ప్రతి భాగంలోనూ నీరు ఉంటుంది. దంతాల నుండి జుట్టు వరకు నీటి శాతం ఉంటుంది. ప్రతిరోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం మీ చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. నీరు శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వలన అవి పోషకాలను సులభంగా గ్రహించి, వ్యర్థాలను బయటకు పంపగలుగుతాయి. మీరు ఎంత నీరు త్రాగాలో అనేది మీరు ఎంత ఉడికించిన ఆహారం తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో సలాడ్, పండ్లు వంటివి తింటే త్రాగవలసిన నీటి మొత్తం తగ్గుతుంది. అదే సమయంలో, కాఫీ, వ్యాయామం, కారం ఎక్కువగా ఉన్న ఆహారం వంటివి తీసుకుంటే మీకు ఎక్కువ నీరు అవసరమవుతుంది.
4. అందం కోసం..
చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి శతాబ్దాలుగా బాదంను ఉపయోగిస్తున్నారు. బాదం నూనె చర్మానికి బాహ్య సౌందర్యాన్నిస్తుంది. క్రమం తప్పకుండా బాదం పప్పును తినడం వల్ల కూడా చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. బాదంలో మెగ్నీషియం ఉంటుంది, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది.
5. చర్మానికి ఉపశమనం కోసం
సాధారణంగా కూరలు, పప్పులు, ఇతర వంటకాలను అలంకరించడానికి కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తిమీరలో విటమిన్-ఎ, విటమిన్-సి, క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్ని ఆరోగ్యకరమైన చర్మానికి చాలా అవసరం. ముఖ్యంగా చర్మంపై మచ్చలు లేదా ఇతర చర్మ వ్యాధుల చికిత్సలో కొత్తిమీర ఉపయోగపడుతుంది. ఇందులో ఇనుము, ఫోలేట్, మెగ్నీషియం, మాంగనీస్ కూడా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఎల్లప్పుడూ అందంగా కనిపించేలా చేస్తాయి.