National Doctor's Day 2023 । ఓ ఆరోగ్య ప్రదాత.. నీ ఆరోగ్యం జాగ్రత్త!
National Doctor's Day 2023: ప్రతీ ఏడాది జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇది వైద్యులు, వారి సేవలకు గుర్తింపు. వైద్యులకు ఆరోగ్య చిట్కాలు ఇక్కడ చూడండి.
National Doctor's Day 2023: దేవుడి తర్వాత దేవుడు అని చాలా మంది చేత పిలుపించుకునే వాడు ఎవరైనా ఉన్నారా అంటే అది వైద్యుడు. తమ వైద్య నైపుణ్యంతో వైద్యులు ఎంతో మందికి ప్రాణాలు పోస్తారు, మరెంతో మందికి పునర్జన్మను ప్రసాదిస్తారు. తమ సేవా స్ఫూర్తితో ప్రజలను ఆయురారోగ్యాలతో నిలుపుతారు. కానీ అలాంటి వైద్యులు తమను తాము చూసుకునే విషయంలో మాత్రం వెనకబడిపోతున్నారు. వృత్తిజీవితంలో నిరంతరమైన ఒత్తిళ్లను అనుభవిస్తూ తరచుగా వారి స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి
ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు. కానీ వారు ఎంత వైద్యులు అయినప్పటికీ, వారు కూడా మనుషులే. ఒత్తిడితో కూడిన జీవనశైలిలో వైద్యులు కూడా బీపీలు, షుగర్లు, హృదయ సంబంధ వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు.
వైద్యులు, వారి సేవలను గుర్తిస్తూ ప్రతీ ఏడాది జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా, ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్, కార్డియాలజీ డైరెక్టర్ & హెచ్‌ఓడి డాక్టర్ నరేష్ కుమార్ గోయల్ మాట్లాడారు. వైద్యులు గుండెపోటు వంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థిలకు గురికాకుండా ప్రతి వైద్యుడు తప్పనిసరిగా స్వీకరించాల్సిన జీవనశైలి మార్పులను సూచిస్తున్నారు.
1. రెగ్యులర్ చెకప్
గుండెపోటులు అకస్మాత్తుగా సంభవిస్తాయి కానీ గుండె జబ్బులను ప్రోత్సహించే కారకాలు సంవత్సరాలుగా మీ శరీరంలో నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతాయి. ప్రతి వైద్యుడు ఎప్పటికప్పుడు తన హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఇందులో రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ పర్యవేక్షణ మాత్రమే కాకుండా, TMT పరీక్ష కూడా నిర్వహించుకోవాలి.
2. తినవలసిన ఆహారాలు
వైద్య నిపుణులందరికీ తమకు ఎలాంటి ఆహారం కావాలో వారికి తెలుసు. కాబట్టి తమ ఇంట్లోనైనా లేదా బయట పార్టీలు, సమావేశాలలోనైనా తమ ఆరోగ్యానికి కట్టుబడి ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి.
3. ఎక్కువసేపు కూర్చోవద్దు
OPD క్లినిక్‌లలో ఎక్కువ గంటలు కన్సల్టేషన్లు జరపడం వల్ల వైద్యుల శరీరంలో కొవ్వు, బరువు పెరగవచ్చు. కాళ్లలోని రక్త నాళాలు గడ్డకట్టడానికి దారితీయవచ్చు. ఈ రకమైన దినచర్య వారిలో అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ మొదలైన వాటికి దారి తీస్తుంది. వైద్యులు రెగ్యులర్ గా కొంత సమయం పాటు విరామం తీసుకొని నడవాలి.
4. సాధారణ శారీరక శ్రమ చేయాలి
రెగ్యులర్ శారీరక శ్రమ ద్వారా బరువు తగ్గడం, ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడం చేసుకోవచ్చని తెలుసు. కాబట్టి గుండె జబ్బులు రాకుండా తమ శరీరంలో LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం, మంచి' HDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం కోసం చర్యలు తీసుకోవాలి. అధిక రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రించడం చేయాలి.
5. తగినంత నిద్ర
వైద్యులు అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా వచ్చి తమ వైద్య సేవను అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు తమ జీవితంలో తగిన నిద్రను తీసుకోవడం లేదు. సరైన నిద్ర శరీరంలో హార్మోన్ల ఆరోగ్యకరమైన సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. కాబట్టి వైద్యులు తమ నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇవి కాకుండా ఒత్తిడి నియంత్రించుకోవడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు వదిలివేయడం ప్రతీ వైద్యుడు కఠినంగా ఆచరించాలని డాక్టర్ నరేష్ కుమార్ గోయల్ తన తోటి వైద్యులకు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం