infertility in obesity: ఒబెసిటి ఉంటే ఫెర్టిలిటీ సమస్యలు.. అపోహలు, వాస్తవాలు ఇవీ
infertility in obesity: ఫెర్టిలిటీ సమస్యలకు ప్రధాన కారణాల్లో ఒబెసిటి కూడా ఒకటి. వీటి చుట్టూ ఉన్న అపోహలు వాస్తవాలను వైద్య నిపుణులు ఇక్కడ వివరించారు.
సంతానోత్పత్తి, ఒబెసిటీ సంబంధిత ఆరోగ్యం గురించి చర్చించడాన్ని మన దేశంలో అసౌకర్యంగా చూస్తారు. అయితే వాస్తవానికి ఇప్పుడు రోజూ ప్రతి 15 జంటల్లో ఒక జంట ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతోంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రీప్రోడక్షన్ గణాంకాల ప్రకారం దేశంలో 2.75 కోట్ల మంది పురుషులు, మహిళలు ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు.
సంతాన సామర్థ్య లోపంతో పోరాడడం ఒక సవాలుతో, ఒత్తిడితో కూడుకున్నది. శారీరకంగానూ, మానసికంగానూ పోరాడాల్సి ఉంటుంది. ఇటీవలికాలంలో ఇన్‌ఫెర్టిలిటీ రేటు వేగంగా పెరగడానికి అనేక కారణాలు తోడవుతున్నాయి. అందులో ముఖ్యమైన కారణంగా ఒబెసిటీ (ఊబకాయం) నిలుస్తోంది. ఇది పురుషుల్లోనూ, మహిళల్లోనూ ఉంది. అనేక ఇతర కారకాలకు ఇది తోడవడం వల్ల సమస్య జఠిలమవుతోంది.
బెరియాట్రిక్ కన్సల్టెంట్, లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అపర్ణా గోవిల్ భాస్కర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత విషయాలను వివరించారు. ‘సంతానోత్పత్తి సామర్థ్యంపై ఒబెసిటి ప్రబావం సంక్లిష్టమైనది. మహిళల్లో ఒబెసిటి కారణంగా పీరియడ్స్ సక్రమంగా రావు. ఈ కారణంగా ఒవల్యూషన్ చక్రం దెబ్బతింటుంది..’ అని వివరించారు.
‘ఒబెసిటి కారణంగా మహిళలు ఇన్సులిన్ నిరోధకత ఎదుర్కొంటారు. ఈ కారణంగా వారిలో పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య ఉత్పన్నమవుతుంది. పీసీఓఎస్‌లో అండాశయాలు వ్యాకోచించి చిన్నచిన్న నీటి తిత్తులు ఏర్పడతాయి. సంతానోత్పత్తికి అవసరమైన ల్యుటినైజింగ్ హార్మోన్, లెప్టిన్, ఇన్సులిన్, ఈస్ట్రోన్ వంటి పలు రకాల హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. అలాగే లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ కూడా హైపోపిట్యూటర్ గొనడోట్రాఫిక్ యాక్సిస్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది ఇన్‌ఫెర్టిలిటీకి దారితీస్తుంది..’ అని వివరించారు.
‘గర్భం దాల్చినా కూడా ఒబెసిటితో ఉన్న మహిళల్లో మిస్‌క్యారేజ్‌కు, అబార్షన్‌కు దారితీస్తుంది. చాలాసార్లు క్రమం తప్పిన పీరియడ్స్, తెలియకుండానే మిస్‌క్యారేజ్ కావడం వంటివి వారి జీవితంలో చోటు చేసుకుని ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో వారు హైబ్లడ్ ప్రెజర్, జెస్టేషనల్ డయాబెటిస్, ఇన్ఫెక్షన్, బ్లడ్ క్లాటింగ్ వంటి సమస్యలు ఎదుర్కొనే ముప్పు ఉంటుంది..’ అని డాక్టర్ వివరించారు. ఒబెసిటీ, ఫెర్టిలిటీపై ఉన్న అపోహలు, వాస్తవాలను ఈ సందర్భంగా డాక్టర్ అపర్ణా గోవిల్ భాస్కర్ వివరించారు.
ఒబెసిటీ, ఫెర్టిలిటీపై ఉన్న అపోహలు, వాస్తవాలు
అపోహ 1: అనారోగ్యకరమైన ఆహారం వల్లే ఊబకాయం
వాస్తవం: ఒబెసిటి, ఇన్‌ఫెర్టిలిటీ కారణంగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు రెండు రకాలుగా ఇబ్బందిపడుతారు. అయితే ఒబెసిటికి అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే మాత్రమే కారణం కాదని ఇప్పుడు రుజువైంది. జన్యువులు, ప్రవర్తనాపరమైన, పర్యావరణపరమైన కారకాలు ఇందుకు కారణమై ఉంటాయి. డయాబెటిస్, హైబ్లడ్ ప్రెజర్, గుండె జబ్బులు వంటి వాటిలాగే ఊబకాయం కూడా ఒక వ్యాధిగా చూడాలి. ఇది ఎవరినైనా ప్రభావితులను చేస్తుంది. ఇదేమీ మనకు మనం తెచ్చుకున్నది కాదు. దీనిపై ఉన్న అపోహలను తొలగించుకుని ఊబకాయం తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.
అపోహ 2: తక్కువగా తినడం, చురుగ్గా కదలడం వల్ల బరువు కోల్పోతారు
వాస్తవం: ఒబెసిటీ చికిత్సలో డైట్, లైఫ్‌స్టైల్ మార్పులు ఒక ముఖ్యమైన అంశం. అయితే కేవలం ఇది మాత్రమే చికిత్స కాదు. అధిక బరువు కేటగిరీ వ్యక్తులు మాత్రమే దీని వల్ల ప్రయోజనం పొందుతారు. కానీ బరువు ఎక్కువగా ఉండి, బాడీ మాస్ ఇండెక్స్ పెరిగిన వారికి ఇంకా లోతైన చికిత్స అవసరం. ఫార్మాకోథెరపీ, ఎండోస్కోపిక్ థెరపీ, బెరియాట్రిక్ సర్జరీ వంటివి అవసరం అవుతాయి. కానీ ఊబకాయం ఉన్న వారు ఉపవాసాలు ఉండడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు.
అపోహ 3: ఒబెసిటీ వల్ల కేవలం మహిళల్లోనే ఫెర్టిలిటీ సమస్యలు
వాస్తవం: ఊబకాయం వల్ల కేవలం మహిళల్లోనే కాకుండా, పురుషుల్లోనూ ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఊబకాయం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం, అంగస్తంభన లోపం, లైంగిక చర్యలో ఆసక్తి కోల్పోవడం వంటి పరిణామాలు ఉంటాయి.
అపోహ 4: బెరియాట్రిక్ సర్జరీ వల్ల ఫెర్టిలిటీపై ప్రతికూల ప్రభావం ఉంటుంది
వాస్తవం: బెరియాట్రిక్ సర్జరీ అనంతరం బరువు కోల్పోవడం వల్ల పురుషులు, మహిళల్లో సానుకూల ప్రభావం కనబడుతుందని అధ్యయనాలు నిరూపించాయి. ఒబెసిటీ వల్ల సంతానోత్పత్తిలో ఎదురైన సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. పీసీఓఎస్ పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తాయి. ఒవల్యూషన్ ప్రక్రియ మెరుగుపడుతుంది. బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఒబెసిటీ, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సహజంగా గర్భధారణ జరిగేందుకు అవకాశాలు మెరుగుపడుతాయి. ఒకవేళ ఐవీఎఫ్ వంటి పద్ధతులను అనుసరించినా గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి. అయితే బెరియాట్రిక్ సర్జరీ జరిగిన అనంతరం బరువు తగ్గడం కోసం, పోషక స్థితి స్థిరత్వం కోసం 12 నుంచి 18 నెలల పాటు వేచి ఉండాలి. ఆ తరువాత మహిళలు వైద్య సలహా తీసుకుని గర్భ ధారణకు ప్రయత్నించవచ్చు.