Friendship myths: ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయితే బాధ ఉండదా? స్నేహం విషయంలో ఈ అపోహలెందుకో..
Friendship myths: ఒకరికోసం ఒకరు తోడుగా నిలబడే స్నేహం నుంచి ఫ్రెండ్షిప్ బ్రేకప్ వరకు స్నేహం విషయంలో అందరికీ ఉండే అపోహలేంటో చూడండి.
స్నేహబంధం చాలా విలువైంది. ఒక మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలుంటే ప్రతి విషయంలో ఓదార్పు, అండ దొరుకుతుంది. మనం చెప్పే ప్రతి విషయాన్ని మనం కోణం నుంచి ఆలోచించి పరిష్కరిస్తారు, అర్థం చేసుకుంటారు. కానీ స్నేహం విషయంలో చాలా మందికి కొన్ని అపోహలుంటాయి. వాస్తవానికి, ఊహకి చాలా తేడా ఉంటుంది.
ఉదాహరణకు స్నేహం గురించి ఏవైనా సూక్తులు, మంచి మాటలు,మెసేజీలు చూస్తుంటే కొన్ని సార్లు విచిత్రంగా అనిపిస్తుంటుంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ అనే మాటైతే బోలెడు సార్లు వింటాం. కష్టసుఖాల్లో తోడుండేదే స్నేహం, మంచి స్నేహితుడు నిన్ను తప్పు చేసినా సరిగ్గానే అర్థం చేసుకుంటాడు, నిజమైన స్నేహంలో సమస్యలుండవు.. ఇలాంటి మెసేజీలు చూసినపుడు స్నేహబంధాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఈ బంధం కూడా అతీతమైంది కాదు. అన్ని బంధాలలాగే సమస్యలు ఉంటాయి. అలకలు ఉంటాయి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే సరైన స్నేహ బంధాన్ని ఆస్వాదించగలం.
స్నేహం విషయంలో ఉండే కొన్ని అపోహలు ఇవే..
ఫ్రెండ్షిప్ బ్రేకప్, లవ్ బ్రేకప్ అంత కష్టం కాదు:
ఎలాంటి బాధ అయినా ఒక్కటే. ఏ బంధం దూరం అయినా బాధ మారదు. ఒక మనిషికి మనస్పూర్తిగా దగ్గరైనపుడు వాళ్లు దూరమైన బాధ భరించడం చాలా కష్టం. స్నేహమైనా, ప్రేమ అయినా బాధ ఒక్కటే.
నిజమైన స్నేహితులు మనకు ఎప్పుడూ అండగా ఉంటారు:
వినడానికి ఎంత బాగున్నా, ఒకరి హద్దుల్ని, పరిమితుల్ని తెలుసుకోకపోతేనే ఇలాంటి ఆలోచనలుంటాయి. ఎవరు చేయగలిగినంత వాళ్లు చేస్తారు. ఎవ్వరి నుంచీ ఎక్కువగా ఆశించకూడదు.
పోల్చుకోకూడదు:
అసూయ, పోల్చుకోవడం ఏ బంధంలో అయినా సాధారణమే. కానీ అలాంటివి ఏమైనా ఉంటే స్పష్టంగా తెలియజేయాలి. గొడవపడకూడదు.
ఎన్నేళ్లయినా స్నేహంలో మార్పుండదు:
సమయంతో పాటూ ఏ బంధంలో అయినా వివిధ మార్పులు వస్తుంటాయి. స్నేహితులను కలవడానికి, మాట్లాడటానికి మనవంతు ప్రయత్నం చేయడం ఆపకపోతే సరిపోతుంది.
టాపిక్