Rare Village : తెలంగాణలో వింత గ్రామం.. సాయంత్రమే లేని ఊరు.. పగలు కంటే రాత్రే ఎక్కువ
Rare Village Kodurupaka : ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. వాటిని చూసినప్పుడు అవునా.. నిజమా.. అనేలా ఉంటాయి. అలాంటిదే పెద్దపల్లి జిల్లాలో కూడా ఓ విషయం ఉంది. ఇక్కడ కొదురుపాక అనే గ్రామంలో పగలు కంటే రాత్రి ఎక్కువగా ఉంటుంది.
మన చుట్టూ అనేక ఆసక్తికర విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనకు తెలిసి ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా దూరంగా జరిగితే ఆ విషయాల గురించి మనకు ఆసక్తి ఉంటుంది. అదే మన చుట్టు పక్కల జరిగితే మాత్రం పట్టించుకోం. ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. మన తెలంగాణలో ఓ వింత గ్రామం ఉంది. దీని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అసలు ఆ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అక్కడ సాయంత్రం అనేది ఎందుకు మిస్ అవుతుందనే విషయాన్ని తెలుసుకుందాం..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కొదురుపాక గ్రామం ఉంది. ఇక్కడ ఉదయం 8 తర్వాత ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకుని హడావుడిగా బయటకు వెళ్తారు. సాయంత్రం 4 గంటల వరకూ పొలాల్లో పనులు చేసుకుని మళ్లీ తిరిగి వచ్చేస్తారు. సాధారణంగా పొలం పనులకు వెళ్లిన వాళ్లు సాయంత్రంపూట 5.30 లేదా కొందరైతే 6 దాటిన తర్వాత కూడా పనులు చేస్తూ ఉంటారు. కానీ కొదురుపాక గ్రామంలో మాత్రం సాయంత్రం 4 గంటలకు ముందే ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు అంటారా? ఇక్కడ సాయంత్రంపూట మిస్ అవుతుందండి.. నాలుగు గంటలకే చీకటి పడుతుంది. అవును ఇది నిజం. ఇంతకీ ఈ గ్రామంలో ఎందుకిలా జరుగుతుంది?
4 గంటలకే చీకట్లు
కొదురుపాక గ్రామం చాలా అందంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం. ఊరి చుట్టూ పొలాలు. కానీ సాయంత్రం 4గైతే మాత్రం చీకట్లు మెుదలవుతాయి. ఇది చదివేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ గ్రామం తెలంగాణలో వింత గ్రామంగా ఉంది. సాధారణంగా ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి.. ఇలా నాలుగు జాముల గురించి తెలుసు. కానీ ఈ కొదురుపాకలో మాత్రం సాయంత్రం మిస్ అవుతుంది. దీనికి కారణం ఈ గ్రామం భౌగోళిక పరిస్థితులు.
ఆలస్యంగా సూర్యుడు
మనలా కాకుండా ఈ గ్రామస్థుల లైఫ్ స్టైల్ కాస్త భిన్నంగా ఉంటుంది. కొదురుపాకలో పగలు సమయం తక్కువగా ఉంటుంది. రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉదయం 8 వరకూ కాస్త చీకటి చీకటిగానే ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది. సూర్యుడు వచ్చి తెల్లారేసరికి టైమ్ పడుతుంది. మిగతా గ్రామాలకంటే భిన్నంగా ఈ గ్రామం ఉంటుంది.
ఇక సూర్యుడు లేట్‌గా వచ్చాడు కదా అని పనులు నిదానంగా చేసుకుంటే కుదరదు. పగలు సమయం తక్కువగా ఉంటుంది. సో.. వెంటవెంటనే ఇంటి పనులు చేసుకుని.. పొలం పనులకు వెళ్లాల్సిందే. ఎవరైనా బయటి ప్రాంతాలకు వెళ్లినా త్వరగానే ఇంటికి వచ్చేస్తారు.
గ్రామం చుట్టూ గుట్టలు
ఈ గ్రామానికి ఇలాంటి భౌగోళిక పరిస్థితి ఎందుకు ఉందంటే.. దీని చుట్టూ 4 గుట్టలు ఉన్నాయి. కొదురుపాక తూర్పున గొల్లగుట్ట, పడమర రంగనాయకుల గుట్ట, ఉత్తరంలో నంబులాద్రి గుట్ట, దక్షిణంలో పాముబండ గుట్ట అనే నాలుగు గుట్టలు ఉంటాయి. సూర్యుడు వచ్చే తూర్పు వైపు గొల్లగుట్ట ఉండటంతో గ్రామానికి సూర్య కిరణాలు ఆలస్యంగా పడతాయి. బయట గ్రామాలతో చూస్తే.. గంట గంటన్నర ఇక్కడ ఆలస్యంగా సూర్యుడు వస్తాడు. ఇక పడమరలో రంగనాయకుల గుట్ట చాటుకు నాలుగు గంటలకే వెళ్లిపోతాడు. ఈ కారణంగా సాయంత్రం నాలుగైతే చాలు చీకట్లు వచ్చేస్తాయి. ఇంట్లో లైట్ల్ ఆన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉంది. శాతవాహన, జైనుల కాలంలో నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి భక్తులు, టూరిస్ట్‌లు కూడా వస్తుంటారు. ఈ గ్రామంలో సాయంత్రం 4 గంటల వరకు పనులు ముగించుకుని వచ్చేస్తారు. ఎవరైనా ఇక్కడకు వెళ్లాలంటే ప్రయాణం కూడా సులభమే. కరీంనగర్ నుంచి సుల్తానాబాద్ వెళ్లాలి. అక్కడ నుంచి పది కిలో మీటర్ల దూరంలో కొదురుపాక గ్రామం ఉంటుంది. ఒక్క రోజంతా ఈ వింత గ్రామంలో ఉండి రండి..