Mutton Soup: మటన్ సూప్ ఇలా పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది, పైగా ఎంతో బలం-mutton soup recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mutton Soup: మటన్ సూప్ ఇలా పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది, పైగా ఎంతో బలం

Mutton Soup: మటన్ సూప్ ఇలా పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది, పైగా ఎంతో బలం

Haritha Chappa HT Telugu
Jun 14, 2024 11:38 AM IST

Mutton Soup: సింపుల్‌గా మటన్ సూప్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ సూప్ ను స్పూన్ తో తాగేయొచ్చు. అన్నంలో కలుపుకోవాల్సిన అవసరం లేదు.

మటన్ సూప్ రెసిపీ
మటన్ సూప్ రెసిపీ (Instagram)

Mutton Soup: మటన్ సూప్ తినడం వల్ల క్యాల్షియం పుష్కలంగా అందుతుంది. అందుకే మహిళలు ఖచ్చితంగా తినాల్సిన వాటిలో మటన్ సూప్ ఒకటి. దీన్ని సింపుల్ గా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. దీన్ని నేరుగా తాగేయవచ్చు లేదా ఇడ్లీ వంటి వాటితో జతగా తిన్నా రుచిగా ఉంటుంది. ఈ మటన్ సూప్ ఎలా చేయాలో తెలుసుకోండి.

మటన్ సూప్ రెసిపీకి కావలసిన పదార్థాలు

మటన్ మూలుగ ఎముకలు - అర కిలో

బోన్ లెస్ మటన్ - పావు కిలో

పుదీనా తరుగు - మూడు స్పూన్లు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్

ఉల్లిపాయ - ఒకటి

బిర్యాని ఆకులు - రెండు

నెయ్యి - మూడు స్పూన్లు

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

మటన్ సూప్ రెసిపీ

1. మటన్ ఎముకలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే బోన్ లెస్ మటన్ ముక్కలను తీసి పరిశుభ్రంగా కడిగి కుక్కర్ లో వేయాలి.

2. ఆ కుక్కర్ లోనే మూలుగ ఎముకలు రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు వేసి పైన మూత పెట్టి ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

3. ఆవిరి పోయాక కుక్కర్ మూత తీసి ఆ నీటిని వడకట్టాలి.

4. ఆ నీటిని ఒక గిన్నెలో వేసి మటన్ ముక్కలను సన్నగా తరిగి మళ్లీ ఆ రసంలో వేసేయాలి.

5. అలాగే మూలుగు ఎముకలను కూడా అందులో వేయాలి.

6. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను, పుదీనా తురుమును వేసి మళ్లీ స్టవ్ మీద పెట్టి పది నిమిషాలు మరిగించాలి.

7. మరోపక్క మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేయాలి.

8. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.

9. వీటిని మటన్ రసంలో వేసి మరొక ఐదు నిమిషాల పాటు మరిగించాలి.

10. పైన మళ్ళీ కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ మటన్ సూప్ రెడీ అయినట్టే.

11. అందులో మటన్ ముక్కలు రుచిగా ఉంటాయి. ఈ మటన్ సూప్ తాగే కొద్ది తాగాలనిపించేలా ఉంటుంది. ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు.

మటన్ సూప్ తాగడం వల్ల ఎముకలకు బలం అందుతుంది. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి వృద్ధులు, మహిళలు కచ్చితంగా తినాల్సిన వాటిలో మటన్ సూప్ ఒకటి. అలాగే దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. జుట్టును, చర్మాన్ని మెరిపించడంలో కొలాజెన్ చాలా ముఖ్యం. దానికోసం మీరు మటన్ బోన్ సూపును వారానికి రెండుసార్లు తాగడం మంచిది. దీనిలో జింక్, సెలీనియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మటన్ సూప్ తాగారంటే మన శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు లోపల చేరుతాయి. వృద్ధులు వారానికి రెండు నుంచి మూడుసార్లు మహిళలు కనీసం ఒకసారైనా ఈ మటన్ సూప్ ను తాగడం ఉత్తమం.

WhatsApp channel