Mutton Paya Soup: మటన్ పాయ సూప్... ఇలా చేసుకుని చూడండి, తినే కొద్ది ఇంకా కావాలనిపిస్తుంది
Mutton Paya Soup: మటన్ పాయ సూప్ చూస్తేనే నోరూరి పోతుంది. కానీ దీన్ని ఎలా చేయాలో చాలామందికి తెలియదు. మటన్ పాయా సింపుల్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించండి.
Mutton Paya Soup: మటన్ పాయ అంటే ఇది గొర్రె కాళ్లు. గొర్రె కాళ్లు మృదువుగా ఉంటాయి. వాటినే మటన్ పాయా అని అంటారు. పిల్లలు గర్భిణీలు, వృద్ధులకు ఈ మటన్ పాయా చాలా అవసరం. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే వృద్ధులు ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. ఈ సూప్ ను స్పూన్ వేసుకొని తాగడమే కాదు, కావాలనుకుంటే అన్నంలో కలుపుకుని తినొచ్చు. రుచి అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చడం ఖాయం.
మటన్ పాయా సూప్ రెసిపీకి కావలసిన పదార్థాలు
గొర్రె కాళ్లు - ఆరు
పసుపు - అర స్పూను
మిరియాలు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
యాలకులు - రెండు
నెయ్యి - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - మూడు
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
టమోటో - ఒకటి
కారం - ఒక స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
కొబ్బరి తురుము - ఒకటిన్నర స్పూను
నీరు - సరిపడినంత
నూనె - మూడు స్పూన్లు
వేయించిన శెనగపప్పు - ఒకటిన్నర స్పూను
మటన్ పాయా సూప్ రెసిపీ
1. ముందుగా శెనగపప్పును వేయించాలి. వాటిని మిక్సీలో వేయాలి, అలాగే తురిమిన కొబ్బరిని కూడా అందులో వేసి కాస్త నీరు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు గొర్రె కాళ్ళను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి పసుపు, యాలకులు, ఉప్పు, ఎండుమిర్చి, మిరియాలు వేసి నీళ్లు కలపాలి.
3. కుక్కర్ మీద మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
4. ఇప్పుడు సూప్ లో వేసేందుకు మసాలాను సిద్ధం చేసుకోవాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి రంగు మారేవరకు ఉంచాలి.
7. రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
8. అలాగే సన్నగా తరిగిన టమోటాలు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.
9. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
10. చిన్న మంట మీద పది నిమిషాల పాటు ఉడికించాలి.
11. తర్వాత స్టవ్ కట్టేయాలి.
12. కుక్కర్‌ను తెరిచి స్టవ్ మళ్ళీ వెలిగించాలి. ఆ కుక్కర్ లోని నీళ్లు, పాయాలు మళ్లీ ఉడుకుతాయి.
13. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
14. మళ్లీ మూత పెట్టి పది నిమిషాలు ఆవిరి మీదే ఉడికించాలి.
15. మీకు చిక్కగా కావాలనుకుంటే నీళ్లు తగ్గించుకోవాలి. పలుచగా కావాలనుకుంటే మరి కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి.
16. గరం మసాలా, కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ సూప్ రెడీ అయిపోతుంది.
17. ఇందులో ఉండే పాయాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు వండుకొని చూడండి. మీకు తినాలనిపించేలా ఉంటుంది.
ఆ సూప్‌ను పిల్లలు, పెద్దలు, గర్భిణులు అందరూ తాగడం చాలా ముఖ్యం. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మన శరీరానికి అత్యవసరమైన కాల్షియాన్ని ఇది పుష్కలంగా అందిస్తుంది. ముఖ్యంగా మహిళలు తాగడం చాలా ముఖ్యం.
టాపిక్