Mutton Munakkaya Curry: మటన్ మునక్కాడ మసాలా వండి చూడండి, అద్భుతంగా ఉంటుంది రెసిపీ ఎంతో ఈజీ-mutton munakkaya curry recipe in telugu know how to make this mutton recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mutton Munakkaya Curry: మటన్ మునక్కాడ మసాలా వండి చూడండి, అద్భుతంగా ఉంటుంది రెసిపీ ఎంతో ఈజీ

Mutton Munakkaya Curry: మటన్ మునక్కాడ మసాలా వండి చూడండి, అద్భుతంగా ఉంటుంది రెసిపీ ఎంతో ఈజీ

Haritha Chappa HT Telugu

Mutton Munakkaya Curry: మటన్ తో చేసే వంటకాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. దానికి మరింత రుచిని జోడించాలంటే మునక్కాడను కలిపి వండండి. మటన్ మునక్కాడ మసాలా కర్రీ అదిరిపోతుంది. రెసిపీ కూడా చాలా సులువు.

మటన్ మునక్కాయ మసాలా కర్రీ (VR in the kitchen/Youtube)

మటన్ మునక్కాడ మసాలా కర్రీ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని మీరు ఒక్కసారిharitha తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు. ఎవరైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు సాధారణ మటన్ కూరకు బదులు మటన్ మునక్కాడ కర్రీ వండి పెట్టండి. వారికి ఎంతో నచ్చుతుంది. దీన్ని వండడం కూడా చాలా సులువు. మునక్కాడలు జత చేయడం వల్ల కూర కూడా అధికంగా వస్తుంది. ఇక మటన్ మునక్కాడ మసాలా కర్రీ రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

మటన్ మునక్కాడ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

నూనె - మూడు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

టమోటోలు - రెండు

మటన్ - అరకిలో

షాజీరా - అర స్పూను

దాల్చిన చెక్క - చిన్న మొక్క

యాలకులు - రెండు

లవంగాలు - రెండు

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

మునక్కాడలు - రెండు

కొబ్బరి పొడి - రెండు స్పూన్లు

ధనియాల పొడి - ఒకటిన్నర స్పూన్

గరం మసాలా - అర స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

పచ్చిమిర్చి - మూడు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

మటన్ మునక్కాడ మసాలా కర్రీ రెసిపీ

1. లేత మటన్ తో మునక్కాడ వేసి కర్రీ వండితే రుచి అద్భుతంగా ఉంటుంది.

2. దీనికోసం ముందుగా మీరు మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా వేసి వేయించుకోవాలి.

4. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి అవి బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించాలి.

5. ఉల్లిపాయలు బ్రౌన్ రంగులోకి మారాక పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.

6. కరివేపాకులను కూడా ఇందులోనే వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.

7. మటన్ ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి పొడిని వేసి బాగా కలపాలి.

8. కొబ్బరిపొడి వేయడం వల్ల కూరకు ప్రత్యేకమైన రుచి వస్తుంది.

9. ఇప్పుడు టమోటో ముక్కలను చాలా సన్నగా తరిగి వేయాలి.

10. టమోటో వేయడం వల్ల మటన్ కాస్త మెల్లగా ఉడుకుతుంది. కుక్కర్లోనే దీన్ని వండుతాం కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా ఉడికిపోతుంది.

11. మటన్ లో టమోటో, మునక్కాడ కాంబినేషన్ టేస్టీగా ఉంటుంది.

12. ఐదు నిమిషాల పాటు టమాటాను ఉడికిన తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.

13. ఇప్పుడు ఇది ఉడకడానికి సరిపడా ఒక గ్లాసు నీటిని వేసి ఒకసారి కలిపి పైన కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి.

14. కనీసం నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

15. ఆవిరిపోయాక కుక్కర్ మీద మూత తీసి మళ్ళీ స్టవ్ వెలిగించాలి.

16. ఇప్పుడు కూర చిన్న మంట మీద ఉడుకుతూ ఉన్నప్పుడు మునక్కాడ ముక్కలను అందులో వేసి బాగా కలపాలి.

17. కూర వేడిగా ఉంటుంది. కాబట్టి ములక్కాడలు 10 నిమిషాలలో ఉడికిపోతాయి.

18. ఇప్పుడు చివరలో కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే మునక్కాడ మసాలా మటన్ కర్రీ రెడీ అయినట్టే. ఇది అద్భుతంగా ఉంటుంది.

మటన్ మునక్కాడ కర్రీని ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోలేరు. సాధారణ మటన్ కర్రీ కన్నా ఈ మునక్కాడ వేసిన కర్రీ ఎక్కువ రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ మటన్ ములక్కాడ ఇగురును వేసుకుని తింటే అ రుచి మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఒకసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. మీకు ఇది నచ్చడం ఖాయం.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం