Mutton Masala Curry: దసరా రోజు ప్రత్యేకంగా ఇలా మటన్ మసాలా కర్రీ చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Mutton Masala Curry: దసరా రోజు ఎన్నో ప్రాంతాల్లో ఖచ్చితంగా నాన్ వెజ్ తినే ఆచారం ఉంటుంది. ఆ రోజు కోళ్లను అమ్మవారికి బలిస్తారు. దసరా రోజు స్పెషల్ గా మటన్ మసాలా కర్రీ వండుకొని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
దసరా వస్తుందంటే చాలా ప్రాంతాల్లో ఆరోజు నాన్ వెజ్ వంటకాలు ఘుమఘుమలాడిపోతాయి. ఇక్కడ మేము మటన్ మసాలా కర్రీ రెసిపీ ఇచ్చాము. దసరా స్పెషల్ గా దీన్ని ప్రత్యేకంగా వండండి. రుచి అమోఘంగా ఉంటుంది. బగారా రైస్ తో వండితే రుచి అదిరిపోతుంది. తెలంగాణలో ఈ మటన్ మసాలా కర్రీ వేరీ స్పెషల్. దీన్ని చాలా సులువుగా చేసేయొచ్చు. రెసిపీ తెలుసుకోండి.
మటన్ మసాలా కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మటన్ - ఒక కిలో
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
గసగసాలు - రెండు స్పూన్లు
గరం మసాలా పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొబ్బరి పొడి - నాలుగు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు
ధనియాల పొడి - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
పెరుగు - ఒక కప్పు
కారం - రెండు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు
నూనె - తగినంత
మటన్ మసాలా కర్రీ రెసిపీ
1. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి.
2. ముందుగా మసాలాను రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి గసగసాలను, కొబ్బరిపొడిని వేయించాలి.
3. స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పొడి, గసగసాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి.
6. అవి రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించుకోవాలి.
7. తర్వాత శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.
8. మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి.
9. తర్వాత కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
10. చిన్న మంట మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి.
11. తర్వాత పెరుగు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ముద్ద, గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూడు నిమిషాలు ఉడికించుకోవాలి.
12. తర్వాత సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేయాలి.
13. నాలుగు ఐదు విజిల్స్ వచ్చేవరకు అలాగే ఉంచాలి.
14. విజిల్స్ వచ్చాక మూత తీయాలి. కుక్కర్ మూత తీసాక నీరు ఎక్కువగా అనిపిస్తే మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి.
15. అది చిక్కగా అయ్యేవరకు ఉడికించి పైన కొత్తిమీరను జల్లుకోవాలి.
16. అంతే టేస్టీ మటన్ మసాలా కూర రెడీ అయినట్టే.
17. దీన్ని బగారా రైస్ తో చేస్తే తింటే రుచి అదిరిపోతుంది.
ప్లెయిన్ బిర్యాని, బగారా రైస్ కి జతగా మటన్ మసాలా కర్రీ రుచిగా ఉంటుంది. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. కుక్కర్లో మెత్తగా ముక్క ఉడికిపోతుంది. కాబట్టి పంటికింద చక్కగా నలిగిపోతుంది. ఒక్కసారి చేసుకొని చూడండి. మీ అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది.