Mutton Liver Gravy: మటన్ లివర్ గ్రేవీ ఈ పద్ధతిలో చేశారంటే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో-mutton liver gravy recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mutton Liver Gravy: మటన్ లివర్ గ్రేవీ ఈ పద్ధతిలో చేశారంటే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో

Mutton Liver Gravy: మటన్ లివర్ గ్రేవీ ఈ పద్ధతిలో చేశారంటే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu
Published Feb 12, 2025 11:32 AM IST

Mutton Liver Gravy: మటన్ లివర్ ఎంతోమందికి నచ్చుతుంది. ముఖ్యంగా నాన్ వెజ్‌ను ఇష్టంగా తినే వాటిలో మటన్ లివర్ ఒకటి. దీనితో మటన్ లివర్ గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకోండి.

మటన్ లివర్ గ్రేవీ రెసిపీ
మటన్ లివర్ గ్రేవీ రెసిపీ

నాన్ వెజ్ ప్రియులకు మటన్‌తో చేసే వంటకాలు ఎంతో ఇష్టం. ముఖ్యంగా మటన్ లివర్తో చేసే గ్రేవీ వేపుళ్ళు ఇంకా నచ్చుతాయి. ఇక్కడ మేము మటన్ లివర్ మసాలా లేదా మటన్ లివర్ గ్రేవీ రెసిపీ ఇచ్చాము. దీన్ని అన్నంలోనే కాదు చపాతీ రోటీల్లో కూడా తినవచ్చు. ఇడ్లీ, దోశతో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. మటన్ లివర్ గ్రేవి చేయడం కూడా చాలా సులువు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. కచ్చితంగా మీకు నచ్చుతుంది.

మటన్ లివర్ గ్రేవీకి కావలసిన పదార్థాలు

నూనె - నాలుగు స్పూన్లు

ధనియాలు - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒ స్పూను

సోంపు గింజలు - అర స్పూను

మిరియాలు - ఒక స్పూను

గసగసాలు - అర స్పూను

ఎండుమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

టమోటో ప్యూరీ - అరకప్పు

మటన్ లివర్ - 400 గ్రాములు

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

మటన్ లివర్ గ్రేవీ రెసిపీ

1. మటన్ లివర్‌ను 400 గ్రాములు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.

3. అందులో మిరియాలు, గసగసాలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సోంపు, కరివేపాకులు వేసి వేయించాలి.

4. ఇవన్నీ వేగాక చల్లార్చి మిక్సీలో వేసి తగినంత నీళ్లు వేసి పేస్టులా చేసుకోవాలి.

5. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి మూడు స్పూన్ల నూనెను వేయాలి.

6. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు మారేవరకు వేయించాలి.

7. అవి రంగు మారేవరకు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి పచ్చివాసన పోయే దాకా ఫ్రై చేయాలి.

8. తర్వాత టమోటో ప్యూరీని వేసి బాగా కలపాలి.

9. టమోటో ప్యూరీలోని పచ్చిదనం పోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మటన్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. రుచికి సరిపడా ఉప్పును, పసుపును వేసి బాగా కలపాలి.

11. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ముద్దను ఇందులో వేసి బాగా కలపాలి.

12. అలాగే గరం మసాలాను కూడా వేయాలి.

13. కారం కూడా వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి చిన్న మంట మీద పెట్టి పైన మూత పెట్టేయాలని.

14. అరగంట పాటు అలా వదిలేయాలి. మూత పెట్టే ముందు పావు గ్లాసు నీటిని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టండి.

15. 20 నిమిషాల తర్వాత తీసి చూడండి. ముక్క బాగా ఉడికితే స్టవ్ ఆఫ్ చేయండి.

16. లేదా ముక్క ఇంకా ఉడకాల్సి వస్తే మరొక పది నిమిషాలు అలా ఉడకనివ్వండి.

17. పైన కొత్తిమీర తరుగున చల్లుకోవడం మర్చిపోవద్దు.

18. అంతే టేస్టీ మటన్ లివర్ గ్రేవీ రెడీ అయినట్టే.

19. ఇది అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. రోటీ చపాతీ తో కూడా బావుంటుంది.

మటన్ లివర్ అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిది. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మహిళలు పిల్లలు అప్పుడప్పుడు మటన్ లివర్ తినేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే వీరిలోనే రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా జరగాలంటే రక్తహీనత సమస్య ఉండకూడదు. కాబట్టి ఐరన్ పుష్కలంగా ఉండే మటన్ లివర్ ను తినాల్సిన అవసరం ఉంది. అలాగని మరీ అధికంగా తినకూడదు. వారంలో రెండుసార్లు మటన్ లివర్ తింటే చాలు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో కూడా ముందుంటాయి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం