Mutton keema: మటన్ కీమా ఇగురు రెసిపీ చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు, ఇలా సింపుల్‌గా చేసేయండి
Mutton keema: మటన్ కీమా చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే దీన్ని వండడం కష్టం అనుకొని ఎంతోమంది వండరు. దీని రెసిపీ సింపుల్ గా ఇలా చేసేయచ్చు.
నాన్ వెజ్ ప్రియులకు మటన్ కీమా పేరు చెబితేనే తినాలన్న కోరిక పుట్టేస్తుంది. దీన్ని వండడం కష్టమనే ఎంతోమంది ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి చాలా సింపుల్ పద్ధతిలో మటన్ కీమా రెసిపీని వండవచ్చు. ఇక్కడ మేము బిగినర్స్ కోసం మటన్ కీమా రెసిపీ ఇచ్చాము. ఇలా ప్రయత్నించండి, మీకు కచ్చితంగా నచ్చుతుంది.
మటన్ కీమా రెసిపీకి కావలసిన పదార్థాలు
మటన్ కీమా - అరకిలో
టమోటాలు - రెండు
పసుపు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
నూనె - మూడు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు
ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను
కారం - ఒకటిన్నర స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
పచ్చిమిర్చి - మూడు
గరం మసాలా - ఒక స్పూను
పుదీనా తరుగు - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
మటన్ కీమా ఇగురు రెసిపీ
1. మటన్ కీమా ఇగురును వండాలనుకుంటే ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేయండి.
2. ఒక గిన్నెలో మటన్ కీమాను శుభ్రంగా కడిగి వేయండి.
3. అందులోనే పసుపు పావు స్పూన్ వేయండి. ఒక స్పూను ఉప్పు కూడా వేయండి.
4. సన్నగా తరిగిన టమోటోలను వేయండి. ఒక స్పూను కారం కూడా వేసి మిశ్రమాన్ని బాగా కలపండి.
5. ఇది కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి.
6. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయండి.
7. అందులో ఉల్లిపాయల తరుగు, ఉల్లికాడల తరుగు, కరివేపాకులు వేసి వేయించండి.
8. అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా వేయించండి.
9. తర్వాత అర స్పూను పసుపు వేసి బాగా కలపండి.
10. ఒక స్పూను కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.
11. ఈ మొత్తం మిశ్రమాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి.
12. అర స్పూను ఉప్పు కూడా వేస్తే ఇది త్వరగా ఉడుకుతుంది.
13. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న మటన్ కీమా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి పావుగంటసేపు ఉడికించాలి.
14. ఆ తర్వాత గరం మసాలా పొడి, ధనియాలపొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
15. అందులోనే పుదీనా తరుగును కూడా వేసి బాగా కలపాలి.
16. పచ్చిమిర్చి నిలువుగా కోసి అందులో వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
17. ఇది బాగా ఉడికాక ఇగురులాగా కావాలనుకుంటే పావు గ్లాసు నీళ్లు వేసి మళ్ళీ ఉడికించాలి.
18. ఇది ఇగురులాగ అయ్యాక చివరలో కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ మటన్ కీమా ఇగురు రెడీ అయినట్టే.
19. ఇది ఎంతోమందికి నచ్చుతుంది. దీన్ని వండడం కూడా చాలా సులువు.
అప్పుడప్పుడు మటన్ కీమాను తినడం మంచి పద్ధతి. దీనిలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. అప్పుడు మటన్ కీమాను తినడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. ముఖ్యంగా బాలింతలు, గర్భంతో ఉన్నవారు కచ్చితంగా మటన్ కీమాను తినాలి. దీన్ని తినడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం తరుచూ దీన్ని తినకూడదు. నెలకి ఒకటి రెండు సార్లు మాత్రమే తింటే సరిపోతుంది.
సంబంధిత కథనం