Mutton Goli Biryani: మటన్ గోలి బిర్యానీ, మీట్ బాల్స్‌తో చేసే ఈ బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో
Mutton Goli Biryani: ఎప్పుడూ ఒకేలాగా మటన్ బిర్యానీ తినకండి, ఒకసారి మటన్ గోలి బిర్యాని చేయండి. దీని రుచి అదిరిపోతుంది. మీట్ బాల్స్ తో చేసే ఈ బిర్యాని రెసిపీ చాలా సులువు.
మటన్ బిర్యానీ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఎప్పుడూ ఒకేలాగా మటన్ బిర్యానీ చేసుకుంటే అంత రుచిగా ఉండదు. ఒకసారి మటన్ గోలి బిర్యానీ ప్రయత్నించండి. మటన్‌ను బాల్స్ లాగా చేసి బిర్యానీని వండుతారు. తింటున్న కొద్దీ ఇది మరింతగా తినాలనిపించేలా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీకే తెలుస్తుంది దీని రుచి. మటన్ గోలి బిర్యానీలో ఎముకలు లేని మటన్ మాత్రమే వాడతాము. మటన్ గోలి బిర్యాని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
మటన్ గోలి బిర్యానీకి రెసిపీకి కావలసిన పదార్థాలు
మటన్ - అరకిలో
బాస్మతి బియ్యం - ముప్పావు కిలో
ఉల్లిపాయ - రెండు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
గుడ్డు - ఒకటి
లవంగాలు - మూడు
యాలకులు - మూడు
నెయ్యి - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కార్న్ ఫ్లోర్ - నాలుగు స్పూన్లు
బిర్యానీ ఆకులు - నాలుగు
నూనె - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
షాజీరా - అర స్పూను
అనాసపువ్వు - ఒకటి
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
మిరియాల పొడి - అరస్పూను
బ్రెడ్ పొడి - రెండు స్పూన్లు
బిర్యానీ మసాలా - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - అరస్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
పుదీనా తరుగు - రెండు స్పూన్లు
మటన్ గోలి బిర్యానీ రెసిపీ
1. ముందుగా మటన్ గోలీలను అంటే మీట్ బాల్స్ ను తయారు చేసుకోవాలి.
2. ఇందుకోసం మటన్ ను కీమాను తీసుకోవాలి. లేదా మటన్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
3. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
4. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, గుడ్డు సొన, మిరియాల పొడి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
5. వీటిని మీట్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఒక గంట పాటు మ్యారినేట్ చేయాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి డీప్ ఫ్రై సరిపడా నూనెను వేయాలి.
7. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, మూడు స్పూన్ల నీళ్లు కలపాలి. మటన్ బాల్స్ ను ఆ నీళ్ల మిశ్రమంలో వేసి, వాటిని బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో డీప్ ఫ్రై చేయాలి.
8. డీప్ ఫ్రై అయిన మటన్ బాల్స్ తీసి పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, షాజీరా, యాలకులు అన్నీ వేసి వేయించాలి. బిర్యాని ఆకును కూడా వేయాలి.
10. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి బాగా కలపాలి.
11. అవి ఉడకడానికి సరిపడా నీటిని వేసి ఉప్పును కలపాలి.
12. మరొక గిన్నెను స్టవ్ మీద పెట్టి గిన్నె పెట్టి నూనె వేయాలి.
13. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, బిర్యాని మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
14. ఇందులోనే ముందుగా వేయించిన నీట్ బాల్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి.
15. కొత్తిమీర, పుదీనా తరుగును కూడా వేసి బాగా కలపాలి.
16. ఇప్పుడు మంటను చిన్నగా పెట్టి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని పైన త్వరలో త్వరలో వేసుకోవాలి.
17. ఆ గిన్నెపై మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా బరువు పెట్టాలి.
18. పది నిమిషాలు చిన్న మంట మీద వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
19. అంతే మటన్ గోలి బిర్యాని రెడీ అయినట్టే. దీన్ని గరిటతో మెల్లగా కింద నుంచి గ్రేవీని కలుపుకుంటూ రావాలి. మరీ గట్టిగా కలిపితే మటన్ బాల్స్ విరిగిపోయే అవకాశం ఉంది.
సాధారణ బిర్యానీతో పోలిస్తే మటన్ గోలి బిర్యాని చాలా టేస్టీగా ఉంటుంది. వీటిలో ఎముకలు లేని మాంసాన్ని మాత్రమే వాడతాము. కాబట్టి వీటిని చక్కగా తినవచ్చు. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. కారం తక్కువగా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు ఈ మటన్ గోలి బిర్యాని రుచి నచ్చితే ఇంకొక బిర్యాని చేసుకునే ఆలోచన కూడా రాదు. ఒకసారి ఈ మటన్ గోలి బిర్యాని ప్రయత్నించి చూడండి.