సమ్మర్లో కచ్చితంగా తినాల్సిన బెండకాయతో స్నాక్స్ తయారు చేసుకోవడం ఎలా? ఇదిగోండి బెండకాయ రోల్స్ రెసిపీ-must try okra snacks to beat the summer heat how to make them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సమ్మర్లో కచ్చితంగా తినాల్సిన బెండకాయతో స్నాక్స్ తయారు చేసుకోవడం ఎలా? ఇదిగోండి బెండకాయ రోల్స్ రెసిపీ

సమ్మర్లో కచ్చితంగా తినాల్సిన బెండకాయతో స్నాక్స్ తయారు చేసుకోవడం ఎలా? ఇదిగోండి బెండకాయ రోల్స్ రెసిపీ

Ramya Sri Marka HT Telugu

సమ్మర్లో బెండకాయను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. దాదాపు 90 శాతం వరకూ నీటి సాంద్రత ఎక్కువగా ఉండే బెండకాయలను తినడం శరీరానికి చాలా మంచిదట. అందుకే ఈ సారి బెండకాయ కనిపిస్తే వదలకండి. ఇలా సరికొత్తగా బెండకాయ రోల్స్‌గా తినడానికైనా కొనేయండి.

బెండకాయతో తయారు చేసిన రుచికరమైన రోల్స్

టేస్ట్‌తో పాటు హెల్తీ కూరగాయల్లో ఒకటి బెండకాయ. సమ్మర్లో సహజంగా కలిగే డీహైడ్రేషన్‌ను తగ్గించి శరీరానికి చలువదనాన్ని సమకూరుస్తుంది. అందుకే బెండకాయను సమ్మర్లో వీలైనన్ని ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. దీని కోసం మీరు ఇప్పటికే కూరగానో, పులుసుగానో, ఫ్రైగానో తిని ఉంటారు. కానీ, "బెండకాయ రోల్స్"గా ఎప్పుడైనా ట్రై చేశారా.. అయితే ఇప్పుడే ట్రై చేసేయండి. ఇదిగోండి ఈ సింపుల్ రెసిపీతో రుచికరమైన స్నాక్స్ ను తయారుచేసుకోండి.

చిల్లీ & క్రిస్పీ టేస్ట్‌తో బెండకాయ రోల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

  • బెండకాయలు – 15
  • ఉల్లిపాయ (చిన్న తరిగినది) – 1
  • టమాటా (తరిగినది) – 1
  • పచ్చిమిర్చి – 2 (తరిగినవి)
  • ఉప్పు – రుచికి తగినంత
  • కారం – 1/2 టీ స్పూన్
  • ధనియాల పొడి – 1/2 టీ స్పూన్
  • గరం మసాలా – 1/4 టీ స్పూన్
  • నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు (తరిగినది)
  • నూనె – 2-3 టేబుల్ స్పూన్లు
  • టూత్ పిక్స్ లేదా చిన్న స్టిక్స్ – రోల్స్ పట్టేందుకు

బెండకాయ రోల్స్ తయారీ విధానమెలాగో చూసేద్దామా:

  1. ముందుగా బెండకాయలను తల, తోక తీసేసి పొడవుగా, మిశ్రమం పట్టేలా మధ్యలోకి చీల్చాలి. (పూర్తిగా కట్ అవకుండా జాగ్రత్తపడండి)
  2. అవసరమైతే రెండు భాగాలు చేసి, కొంచెం వెడల్పుగా తీసుకోవచ్చు.
  3. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  4. టమాటా వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
  5. అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
  6. చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి మిక్స్ చేసి స్టఫ్ రెడీ చేయాలి.
  7. ఆ స్టఫ్‌ను ప్రతి బెండకాయలో నెమ్మదిగా నింపాలి.
  8. ఇప్పుడు బెండకాయను రోల్‌లా మడిచి, టూత్ పిక్‌తో గట్టిగా నొక్కాలి.
  9. పాన్‌లో కొద్దిగా నూనె వేసి, అన్ని బెండకాయ రోల్స్‌ను మధ్య మంట మీద నెమ్మెదిగా ఫ్రై చేయాలి.
  10. ఇప్పుడు ఆ బెండకాయలను రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేయించాలి.
  11. అంతే, టమాటో లేదా గ్రీన్ చట్నీ వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.

బెండకాయతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించి, జీర్ణ వ్యవస్థను మెల్లగా నడిపిస్తుంది. గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది.

2. డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది: బెండకాయలో నీరు 90% ఉంటుంది. వేసవి కాలంలో తేమను నిలుపుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది.

3. రక్తంలో చక్కెర నియంత్రణ: బెండకాయలో ఉండే జెల్ లాంటి పదార్థం బ్లడ్ షుగర్‌ను స్లోగా అబ్సార్బ్ చేయడంలో సహాయపడుతుంది. ఇది డయబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్.

4. హృదయ ఆరోగ్యానికి మంచిది: బెండకాయలో పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

5. మెమొరీ & బ్రెయిన్ హెల్త్‌కు సహకారం: ఇందులో ఫోలేట్, విటమిన్ B9 ఉంటుంది, ఇది బ్రెయిన్ హెల్త్‌కు మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఇది మేలైనది.

6. కంటి ఆరోగ్యానికి: ఇందులో ఉండే విటమిన్ A, బీటా కీరోటిన్ వల్ల కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

7. ఎముకల బలం: బెండకాయలో విటమిన్ K ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

8. చర్మానికి, జుట్టు ఆరోగ్యానికి: యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మాన్ని గ్లో చేసేటటు చేస్తుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం